
ఏపీలో ప్రతిపక్ష టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా వలసలు ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీ కండువా కప్పుకోనేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. తన కుమారుడితో కలిసి బుధవారం సాయంత్రం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో అధికార పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ముందస్తు సంప్రదింపుల ప్రక్రియ ముగిసిందని శిద్దా అనుచర వర్గాల సమాచారం.
మహానాడుకు ముందే పార్టీ వీడేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని వార్తలు వచ్చినా వారికి ఇచ్చే ప్రాధాన్యతపై అధికార పార్టీ నుంచి సరైన క్లారిటీ లేకపోవడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల వరకూ పార్టీ మరే అవకాశం ఉందని వాదనలు వినిపించాయి. వీరిలో ముందు వరుసలో ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ముఖ్య నేత మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ముందడుగు వేశారు. మరోవైపు కుమారుడికి రాజకీయ భవిష్యత్ కోసమే శిద్దా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని భావించిన ఆయన వైసీపీలో చేరడమే సరైన నిర్ణయంగా సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఈ ప్రయాణంలో ఆయన వెనుక ఎవరెవరు ఉంటారనే విషయం ఆసక్తి కరంగా మారింది.
టీడీపీకి ఆర్ధికంగా వెన్నుదన్నుగా ఉన్న శిద్దా రాఘవరావు పార్టీని వీడటం కోలుకోలేని దెబ్బగానే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గ్రానైట్ క్వారీల వ్యాపారంలో ఉన్న ఆయన వైసీపీ వత్తిడుల కారణంగా పార్టీ మారతారనే చర్చ గతంలో జరిగింది. ఇటీవల కాలంలో వైసీపీ ప్రభుత్వం నుంచి టీడీపీ క్వారీ నిర్వహకులపై వత్తిళ్ళు ఎక్కువైనట్లు తెలుస్తోంది. శిద్దా మార్గంలో మరికొందరు పార్టీ మరే యోచనలో ఉన్నారని అంటున్నారు.