Homeఆంధ్రప్రదేశ్‌వైసీపీ టార్గెట్: టీడీపీలో నెక్స్ట్ ఎవరు

వైసీపీ టార్గెట్: టీడీపీలో నెక్స్ట్ ఎవరు


ఏపీ సీఎం జగన్ టీడీపీ నేతలను వేటాడేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా తనను ముప్పుతిప్పలు పెట్టిన వారిని ఏరేస్తున్నారు. ఇటీవలే వైఎస్ జగన్ సర్కార్ టీడీపీ ముఖ్య నాయకులను ఒకేరోజు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు, జేసీ ట్రావెల్స్ మోసంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో మీడియా ఫోకస్ అంతా టీడీపీపై పడింది. టీడీపీ నేతలు, శ్రేణులంతా షాక్ కు గురై ఆందోళనలో ఉన్నారు.

ఇక అచ్చెన్నాయుడుని పరామర్శించడానికి చంద్రబాబు వెళ్లగా ఆయనకు అనుమతి నిరాకరించారు అధికారులు. ఇక జేసీ ఫ్యామిలీని ఓదార్చడానికి నారాలోకేష్ బయలు దేరారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులను లోకేష్ అనంతపురం వెళ్లి పరామర్శించనున్నాడు. అనంతపురంలో జేసీ అరెస్ట్ కు నిరసనగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని శ్రేణులకు పిలుపునివ్వనున్నారు.

అయితే జేసీ ఫ్యామిలీని పరామర్శించడానికి వెళుతున్న నారా లోకేష్.. అచ్చెన్నాయుడు ఫ్యామిలీ వద్దకు, అచ్చెన్న వద్దకు వెళ్లే సాహసం చేయడం లేదు. ఎందుకంటే ఈఎస్ఐ స్కాంతోపాటు ఫైబర్ గ్రిడ్, సహా చంద్రబాబు పాలనలో నారాలోకేష్ కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు అచ్చెన్నను కలిస్తే పాత విషయాలు తవ్వుకున్నట్టు ఉంటుందని అచ్చెన్న ముఖం చూడడానికి కూడా లోకేష్ బాబు సాహసించడం లేదని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అచ్చెన్నను లోకేష్ పూర్తిగా విస్మరించడానికి కారణం అదేనా అన్న చర్చ మొదలైంది.

ఇక అచ్చెన్నాయుడు, జేసీ ఫ్యామిలీ తర్వాత వైసీపీ ప్రభుత్వం నెక్ట్స్ టార్గెట్ ఎవరనే చర్చ ఇప్పుడు టీడీపీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల టీడీపీ సీనియర్లు ఇద్దరిపై కేసులు బుక్ కావడంతో వారేనని అని ఆందోళన చెందుతున్నారు.

టీడీపీలో సీనియర్ నేతలు, కీరోల్ పోషించే ఇద్దరు మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన్నరాజప్పలపై తాజాగా ఒక దళిత మహిళ తూర్పుగోదావరి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తన భర్తకు వేరే మహిళను ఇచ్చి వివాహం చేసేందుకు యనమల, చిన్నరాజప్ప ప్రయత్నించారని.. తనను కలవనీయకుండా అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. దళిత మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ లో యనమల, చిన్నరాజప్పపై స్ట్రాంగ్ కేసు పెట్టింది. తన భర్త రాధాకృష్ణతో అనంత లక్ష్మీ అనే మహిళ రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించిందని.. ఇద్దరు మాజీ మంత్రులు యనమల, చిన్నరాజప్పలు ఆమెకు సహాయం చేశారని ఆమె ఫిర్యాదు చేసింది. అనంతలక్ష్మిని అడ్డుకొని తన భర్తను తన దరికి చేర్చాలని ఆమె డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో వారిని అరెస్ట్ చేయవచ్చనే ప్రచారం కూడా మొదలైంది.

అచ్చెన్నాయుడు తర్వాత అదే కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు పితాని సత్యనారాయణ. ఇప్పుడు ఆయన టార్గెట్ గా రాజకీయ ప్రచారం సాగుతుండడంతో పితాని ఆందోళన చెందుతున్నారు. పితాని సత్యనారాయణ కుమారుడిని ఏసీబీ అరెస్ట్ చేయబోతోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగడంతో పితాని స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ ఆరోపణలు ఖండించారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన పితాని వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన నిర్వహించిన శాఖల్లో ఆరోపణలు, వివాదాలు పెద్దగా లేవు. ఈ వ్యవహారంలో కావాలని కొందరు పితానిని ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయన వర్గం ఆరోపిస్తోంది. అధికార పార్టీ నేతలు ఈ మేరకు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. అయితే పితాని ప్రమేయం ఎక్కడా బయటపడకపోవడంతో ఆయన కుమారుడిని టార్గెట్ చేశారనే ప్రచారం ఉధృతమైంది. దీనిపై తాజాగా పితాని మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడిని, తనను అరెస్ట్ చేస్తారనే వార్తలను ఖండించారు. కార్మికమంత్రి పనిచేసిన సమయంలో కొందరి అధికారుల తీరుపై తానే విచారణకు ఆదేశించారు. తనపై ఇప్పుడు లేనిపోని ఆరోపణలు తెరమీదకు తెచ్చారని’ పితాని ఏకరువు పెట్టారు.

ఇక ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలను కూడా జగన్ టార్గెట్ చేశారని అంటున్నారు. వారే కాదు.. ఇప్పుడు టీడీపీ సర్కార్ హయాంలో నారా లోకేష్ ఐటీశాఖ మంత్రిగా చేపట్టిన అతిపెద్ద పథకం ఫైబర్ గ్రిడ్ తోపాటు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక పథకాల్లో వందల కోట్ల అవినీతి జరిగినట్టు తాజాగా జగన్ నియమించిన కేబినెట్ సబ్ కమిటీ నిర్ధారించినట్టు సమాచారం. మొత్తంగా 2015-19 మధ్య సంక్రాంతి కానుక, రంజాన్‌ తోఫా పథకం పేరిట సరుకుల సేకరణకు రూ.1,766.28 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ.158.38 కోట్ల మేర అవినీతి జరిగినట్లు మంత్రివర్గ ఉపసంఘం గుర్తించినట్టు సమాచారం.

ఫైబర్ గ్రిడ్, చంద్రన్న కానుకల స్కాంలను తవ్వితీస్తున్న వైసీపీ సర్కార్ ప్రధానంగా ఫైబర్ గ్రిడ్ లో నాటి మంత్రి లోకేష్ తోపాటు.. చంద్రన్న కానుకల్లో అవినీతిలో నాటి సీఎం చంద్రబాబు అవినీతి ఉందని కేబినెట్ సబ్ కమిటీ నివేదికలో స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ లను కూడా బుక్ చేసేందుకు వైసీపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం మొదలైంది. ఇదే మొదలైతే టీడీపీలో పెను సంక్షోభం రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular