
తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజుకు రోజుకు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం బోనాల పండుగపై నిర్వహించాలా? వద్దా అని సుదీర్ఘంగా చర్చించి ఇటీవలే నిర్ణయం తీసుకుంది. సామూహిక బోనాలను రద్దు చేసింది. బోనాల పండుగను ఈసారి ప్రతీఒక్కరూ వారి ఇళ్లల్లోనే చేసుకోవాలని సూచించింది. ఈ ఏడాది బోనాలను పూజారుల బృందమే అమ్మవార్లకు సమర్పిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతియేటా బోనాలతో కళకళలాడే భాగ్యనగరం ఈసారి కళ తప్పనుండటంతో నగరవాసులు నిరాశ చెందుతున్నారు.
తెలంగాణలో బోనాలకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆషాడం వచ్చిందంటే చాలు బోనాల వైభవం కొట్టిచ్చొనట్లు కన్పించేంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలతో ప్రారంభమై.. ఆ తర్వాత భాగ్యనగరం.. ఆ వెంటనే ప్రతీ పల్లె బోనం ఎత్తుతుంది.. ఎన్నో ఏళ్లుగా సంప్రదాయంగా బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగ ప్రకటించి వైభవంగా వేడుకలను నిర్వహిస్తూ వస్తోంది.
ఈసారి కరోనా కారణంగా బోనాల పండుగ కళ తప్పిపోనుంది. ఇప్పటికే ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ వంటి వేడుకలు కరోనా కారణంగా సాదాసీదాగా జరిగాయి. తాజాగా ఈ ఎఫెక్ట్ బోనాల నిర్వహణపై పడింది. ఇదిలా ఉంటే మహానగరంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హన్మంతరావు కోరుతున్నారు. ఈమేరకు సీఎం కేసీఆర్ కు స్వయంగా లేఖను రాశారు. బోనాల పండగపై ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దని ఆ లేఖలో కోరారు. అవసరమైతే పోతరాజులు, ఫలహారం బండిని ఆపేయండి కానీ.. మహిళలు అమ్మవారికి బోనం సమర్పించే అవకాశం కల్పించాలని సూచించారు. మహిళలు బోనం సమర్పిస్తే కరోనా పోతదని.. గతంలోనూ అమ్మవారికి సాకే పోస్తే ప్లేగు వ్యాధి తగ్గిందని ఆయన గుర్తుచేశారు. బోనాలు ఆపితే అనర్దాలు జరుగొచ్చని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.