Chandrababu- BJP: ఏపీలో తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ కమలం స్టార్ట్ చేసిందా? కన్నా లక్ష్మీనారాయణ బాటలో మరికొంత మంది నాయకులు ఉన్నారా? బీజేపీ పొత్తు బాటలోకి రాకపోయేసరికి చంద్రబాబు పునరాలోచనలో పడ్డారా? దీనికి కారణం సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహరావులేనని భావిస్తున్నారా? అందుకే వారిద్దరికి పొగపెడుతున్నారా? ఇటు పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తూనే.. కొంతమంది ఢిల్లీ వెళ్లి పెద్దలను కలవడం వెనుక వ్యూహం అదేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ బీజేపీ ముందుకు రావడం లేదు. దీనిపై హైకమాండ్ పెద్దలు ఎటువంటి వ్యాఖ్యలు చేయకున్నా..రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం టీడీపీతో వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. దీంతో చంద్రబాబు రాష్ట్ర బీజేపీ నాయకులను టార్గెట్ చేసుకొని ఆ పార్టీలోని అసంతృప్త నాయకులను సైకిలెక్కిస్తున్నారు. అటు హైకమాండ్ పై ఒత్తిడి పెంచి రాష్ట్ర బీజేపీని తన చెప్పుచేతల్లోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
గత ఎన్నికల తరువాత జనసేన, బీజేపీ మిత్రపక్షాలుగా మారాయి. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో టీడీపీ విఫలమైనందున.. ఖాళీని భర్తీచేసి వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి నిర్ణయించాయి. కానీ అటు తరువాత రెండు పార్టీలు కలిసి వెళ్లిన దాఖలాలు లేవు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోనివ్వకూడదని పవన్ ప్రయత్నిస్తున్నారు. టీడీపీ, బీజేపీని ఒకే గూటికి తేవాలని ప్రయత్నించారు. కానీ దీనికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు అడ్డుకుంటున్నారని చంద్రబాబు అనుమానిస్తున్నారు. అందుకే వారిద్దరికి వ్యతిరేకంగా ఉన్న నాయకులను టీడీపీలో చేర్చుతున్నారు. వారిద్దరు మూలంగానే నాయకులు పార్టీని వీడుతున్నారని హైకమాండ్ కు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా బీజేపీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ చార్జి మురళీధరన్ కు 30 మంది బీజేపీ నేతలను కలిశారు. సోము, జీవీఎల్ పై ఫిర్యాదు చేశారు.
వాస్తవానికి బీజేపీలో మెజార్టీ నాయకులు పొత్తును కోరుకుంటున్నారు. అయితే వారంత టీడీపీ నుంచి వచ్చిన వారే. పొత్తు ఉంటే బీజేపీ తరుపున పోటీచేయ్యాలని భావిస్తున్నారు. కానీ రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం పొత్తు వద్దని భావిస్తున్నారు. అందులో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జీవీఎల్ బలంగా తమ వాయిస్ ను వినిపిస్తున్నారు. గత ఎన్నికల అనంతరం చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాజ్యసభ పదవులతో ఉన్న నలుగురిని బీజేపీకి గిఫ్ట్ గా ఇచ్చారు. కానీ బీజేపీ మాత్రం వారిని టీడీపీ నేతలుగానే చూస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అందుకే పొత్తు ఉన్నా బీజేపీ తరపున టీడీపీ నాయకలే పోటీచేస్తారని రాష్ట్ర బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఇదే విషయాన్ని హైకమాండ్ కు నివేదించారు. అందుకే ఏపీ పరిస్థితులను పార్టీ పెద్దలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
అయితే చంద్రబాబు మాత్రం బీజేపీని దరి చేర్చుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణను పార్టీలో చేర్చుకున్నారు. అటు తరువాత పురందేశ్వరి, విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాస్ వంటి నేతలను చేర్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఇలా చేరుతున్న వారు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలపై తమకు ఇప్పటికీ అభిమానం ఉందని చెబుతున్నారు. సోము, జీవీఎల్ వైఖరి వల్లే తాము పార్టీ మారాల్సి వచ్చిందని హైకమాండ్ పెద్దల దృష్టికి తీసుకెళుతున్నారు. ఢిల్లీ పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేసి రాష్ట్ర బీజేపీ పీఠంపై తన వారినే కూర్చోబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారుట. తద్వారా వచ్చే ఎన్నికల్లో పొత్తుతో పాటు తన వారికే టిక్కెట్లు ఇచ్చేందుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారుట. హైకమాండ్ పెద్దలకు కోపం తెప్పించకుండా ఆపరేషన్ కలమం కు శ్రీకారం చుట్టారుట.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Operation kamalam started by chandrababu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com