YS Sharmila : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. వెంటిలేటర్ పై ఉన్న కాంగ్రెస్ పార్టీని ఊపిరి పోసి అధికారంలోకి తీసుకు రాగలిగారు వైయస్సార్. 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిందంటే దానికి కారణం ఏపీలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజారిటీ. 2009లో త్రిముఖ పోటీలో నెగ్గుకు రాగలిగారు రాజశేఖర్ రెడ్డి. అటు యూపీఏ 2 అధికారంలోకి రావడానికి కూడా ఒక విధంగా కారణం ఆంధ్రప్రదేశ్. అందుకే జాతీయస్థాయిలో రాజశేఖర్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. మరో దశాబ్ద కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి జీవం పోయగలిగారు రాజశేఖర్ రెడ్డి. అయితే రాష్ట్ర విభజనతో పాటు వైఎస్ అకాల మరణం, వైసిపి ఆవిర్భావంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయింది. 45 ఓటు శాతం నుంచి ఒకటికి పడిపోయింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం సీఎం పదవి ఆశించారు జగన్. కానీ కాంగ్రెస్ హై కమాండ్ అడ్డుకట్ట వేసింది. ఆ పదవిలో సీనియర్ నేత రోశయ్యను కూర్చోబెట్టింది. అటు తరువాత కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ పై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టింది. ఈ తరుణంలో జగన్ సొంత పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించారు. దారుణంగా దెబ్బ కొట్టారు.
* ఆ విషయంలో షర్మిల ఫెయిల్
ఏపీలో కనీసం ఉనికి చాటుకోలేని స్థితికి కాంగ్రెస్ పార్టీ చేరుకుంది. ఈ తరుణంలో చాలామంది సీనియర్లు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందుకున్నారు. కానీ ఒక్క శాతం ఓటును కూడా పెంచుకోలేకపోయారు. ఇటువంటి తరుణంలో ఈ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలకు అప్పగించింది హై కమాండ్. ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుందని అంతా భావించారు. కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. అయితే వైసీపీని దెబ్బతీయడంలో మాత్రం క్రియాశీలక పాత్ర పోషించారు షర్మిల. కానీ కాంగ్రెస్ పార్టీకి ఆమెతో ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని గాడిలో పెడతారని అంతా భావించారు. కానీ ఆమె ఆ ప్రయత్నం చేయడం లేదని.. ఎంతసేపు జగన్ పై విమర్శలకే పరిమితం అవుతున్నారన్న అపవాదు ఉంది.
* పార్టీ కార్యకలాపాలకు దూరంగా
షర్మిల తీరు నచ్చక చాలామంది సీనియర్లు పార్టీకి దూరంగా ఉన్నారు. పార్టీ కార్యకలాపాల్లో సైతం పెద్దగా కనిపించడం లేదు. ఆమె సీనియర్లను కలుపుకొని వెళ్లడం లేదన్నది ఒక విమర్శ. ఈ నేపథ్యంలో ఒకప్పటి రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. చాలామంది వైసీపీలోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో అతి కొద్ది మంది మాత్రమే మిగిలి ఉన్నారు. ఆ నేతలు సైతం సరైన ముహూర్తం చూసుకుని వైసీపీలో చేరతారని ప్రచారం నడుస్తోంది. మొత్తానికి వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి చేరికలు ఉంటాయని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అవుతోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Rajasekhara reddys close associates are saying that he cannot remain in the congress party
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com