Traffic Problem: ఒకప్పుడు మనదేశంలో నగరాలు కొన్ని మాత్రమే ఉండేది. ఇప్పుడు చాలా వరకు పెరిగిపోయాయి. దీనికి తోడు వ్యక్తిగత అవసరాలకు వాహనాల వినియోగం అధికమైంది. ఆర్థిక స్థిరత్వం పెరగడంతో చాలామంది ద్విచక్ర, త్రి చక్ర, ఇతర వాహనాలను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. తద్వారా వాహనాల సంఖ్య పెరిగింది. వాహనాలు పెరిగిన నేపథ్యంలో ట్రాఫిక్ కష్టాలు కూడా అధికమయ్యాయి. ఒకప్పుడు ఢిల్లీ, ముంబై, హైదరాబాదు లాంటి నగరాలలో ట్రాఫిక్ ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు పట్టణాలు.. ఒక మోస్తరు మండల కేంద్రాల్లో కూడా ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోయాయి.
Also Read: కవిత వ్యాఖ్యలు.. రేవంత్ చెప్పిన పాముల కథ..మామూలు పంచ్ కాదు ఇది
ఢిల్లీ లాంటి నగరంలో అయితే ట్రాఫిక్ ఇబ్బందులు మరింత పెరిగిపోయాయి. అక్కడ కాలుష్యం కూడా అధికంగా ఉండడంతో ప్రభుత్వం “సరి బేసి” విధానాన్ని తీసుకొచ్చింది.. ఆ విధానం కూడా పెద్దగా ప్రయోజనాన్ని కలిగించడం లేదు. దీంతో కాలం చెల్లిన వాహనాలను తొలగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కొంత మేరకు ఫలితాన్ని ఇచ్చినప్పటికీ.. సమస్య మాత్రం పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదు. ఇక ముంబై..కోల్ కతా, హైదరాబాద్, గుర్గావ్ వంటి నగరాలలో రోజు ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. ఇక వర్షం పడితే చాలు ఇంటికి వెళ్లాలంటే గంటలు గంటలు ఎదురు చూడాలి. ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వాలు బాహ్య వలయ రహదారులు వంటి వాటిని ఏర్పాటు చేస్తున్నప్పటికీ సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారం కావడం లేదు. దీంతో సరికొత్త విధానాలను అమలు చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇలాంటి క్రమంలో ఇంటర్నెట్లో మనదేశంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సింగపూర్ మోడల్ ను అమలు చేయాలనే సూచన కూడా వినిపిస్తోంది.
ఇంతకీ ఆ మోడల్ ఏంటంటే..
సింగపూర్ దేశంలో 1975లో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ట్రాఫిక్ వల్ల అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఆ సమస్యను వినూత్నంగా పరిష్కరించింది. నగరాలలో రద్దీగా ఉండే ప్రాంతాలను నియంత్రిత మండలాలుగా గుర్తించింది. ఇందులో ప్రవేశానికి ప్రత్యేకమైన లైసెన్స్.. నెలవారి రుసుం విధానాన్ని ప్రవేశపెట్టింది. సింగిల్ గా కాకుండా.. కారులో నలుగురు ఉంటే ఆ లైసెన్స్ అవసరం లేదు. దీంతో రోడ్డుమీదికి వచ్చే వాహనాల సంఖ్య చాలావరకు తగ్గింది. ఫలితంగా ట్రాఫిక్ సమస్య పరిష్కారమైంది. మనదేశంలో ప్రధాన నగరాలలో.. పెద్ద పెద్ద పట్టణాలలో ఈ విధానాన్ని అమలు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు..” ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. మనదేశంలో ట్రాఫిక్ జామ్ కావడంవల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల సింగపూర్ మోడల్ అందుబాటులోకి తీసుకొస్తే సమస్య పరిష్కారం అవుతుంది. దీనివల్ల చాలామందికి సాంత్వన లభిస్తుంది. అదే కాదు కాలుష్యం కూడా తగ్గుతుందని” నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.