Thatikunta Reservoir Couple Missing: మూడు రోజులైంది అమ్మానాన్న కనిపించక.. ఇంటి వైపు వెళ్లాలంటే మనసు ఒప్పడం లేదు. తిండి సహించడం లేదు. బంధువులు ఎన్ని మాటలు చెప్పినా ధైర్యం రావడం లేదు. తాటికుంట రిజర్వాయర్ వైపు వెళ్లడం.. ఇంటికి రావడం.. అమ్మ నాన్నల ఫోటోలు చూడడం కన్నీటి పర్యంతం అవడం.. ఇలానే సాగిపోతోంది ఆ చిన్నారుల దినచర్య. అమ్మ నాన్న గుర్తుకొచ్చినప్పుడు గుక్క పెట్టి ఏడుస్తున్నారు. వారి ఆచూకీ లభిస్తుందని రిజర్వాయర్ వైపు వెళ్తున్నారు… వారి ఆవేదన చూసిన చుట్టుపక్కల వారు ఇంతటి కష్టం పగవారికి కూడా రావద్దని వాపోతున్నారు.
Also Read: కవిత వ్యాఖ్యలు.. రేవంత్ చెప్పిన పాముల కథ..మామూలు పంచ్ కాదు ఇది
గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలం తాటికుంట గ్రామానికి చెందిన దుబ్బోని బావి రాముడు.. సంధ్య భార్యాభర్తలు. వీరికి చేపల వేట ప్రధాన వృత్తి. తాటికుంట రిజర్వాయర్ కు వెళ్లి చేపలు పట్టడం.. వాటిని విక్రయించడం.. అలా వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని సాకడం.. వీరి దినచర్య సాగుతోంది. రాముడు, సంధ్య దంపతులకు ఇద్దరు సంతానం. వారిలో అబ్బాయి పెద్ద, అమ్మాయి చిన్న. స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో చదువుతున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు ఈ రిజర్వాయర్లో నీరు భారీగా చేరుకుంది. ఈ క్రమంలో చేపల వేటకు రాముడు, సంధ్య వెళ్లారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో తాటికుంట రిజర్వాయర్ కు వెళ్లారు. రాత్రి తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. రిజర్వాయర్ పరిసర ప్రాంతంలో గాలించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. తల్లిదండ్రులు ఇంటికి ఇంకా రాకపోవడంతో వారి పిల్లలు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. మా అమ్మానాన్నలు కావాలని ఆ పిల్లలు ఏడుస్తున్న తీరు గుండెను బరువెక్కిస్తోంది.
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్వయంగా బోటులో గాలించారు. ఆయన పిలుపు మేరకు ఎస్పి, ఇతర అధికారులు కూడా వచ్చారు. రిజర్వాయర్ ప్రాంతంలో తీవ్రంగా గాలించినప్పటికీ ఆ దంపతుల ఆచూకీ లభించలేదు. రాముడు, సండే కోసం ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. వాళ్ళిద్దరూ సజీవంగా ఉండాలని.. గ్రామస్తులు గంగమ్మ తల్లికి పూజలు చేస్తున్నారు. ఈ పూజలు ఫలించాలని.. ఆ పిల్లలకు తల్లిదండ్రులు లేని లోటు తీరాలని అధికారులు కూడా కోరుతున్నారు.