CM Revanth Reddy: రాజకీయాలలో అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు సహజం. ప్రతి విమర్శలు కూడా సహజమే. కానీ తెలంగాణ రాజకీయాల్లో తొలిసారిగా ప్రతిపక్షంలోనే వర్గాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితిలో కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన అంతర్గత కలహాలు తారా స్థాయికి చేరాయి. ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారం ఏకంగా జాగృతి వ్యవస్థాపకురాలిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేదాకా వెళ్ళింది. దీనికి తోడు కవిత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి.. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు నీటిపారుదల శాఖ మాజీ మంత్రి.. రాజ్యసభ మాజీ సభ్యుడి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇవి రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ విమర్శల పరంపరలో భాగంగా కవిత ఓ పెద్దబాంబు పేల్చారు. దీని అంతటికి రేవంత్ కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: కవితకు కేఏ పాల్ ఆహ్వానం.. ఇదే మరి కామెడీ అంటే..
కవిత చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ స్పందించారు. భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “వాళ్లలో వాళ్లే బల్లెలతో వీపుల మీద పోడుచుకుంటున్నారు. మధ్యలో మాకేం సంబంధం. అవినీతి సొమ్ము పంపకాలలో గొడవలు వస్తున్నాయి. వారి కుటుంబ పెద్ద లక్ష కోట్లు సంపాదించాడు. పేపర్ ఇచ్చిండు. టీవీ ఛానల్ ఇచ్చిండు. వ్యాపారాలు ఇచ్చిండు. పెద్దపెద్ద బంగ్లాలు కూడా ఇచ్చిండు. ఇన్ని ఇచ్చినప్పటికీ సంతోషం లేదు. సంతృప్తి లేదు. వాళ్ళింట్లో పంచాయతీతో మాకే సంబంధం. వారి వెనుక మేము ఉన్నామని అంటున్నారు. మాకు అంత ఖాళీ ఎక్కడిది.. మాకు పేదలకు సన్నబియ్యం ఇచ్చే పని ఉంది. పేదలకు రేషన్ కార్డులు ఇచ్చే పనుంది. ఇంకా అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇంత పని పెట్టుకొని మేము ఎవరి వెనకాల ఉండాల్సిన అవసరం ఏముందని” తెలంగాణ ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
పాముల కథ చెప్పారు
గులాబీ పార్టీ కుటుంబ పెద్ద గురించి మాట్లాడుకుంటూ.. రేవంత్ పాముల కథ చెప్పారు..” మేము ఎవరి కలహాల వెనుకలేము. మాకు ఇతరుల వ్యవహారాలలో ప్రవేశించాల్సిన అవసరం లేదు. 2023 లోనే ఆ కాలనాగును తెలంగాణ ప్రజలు రాళ్లతో కొట్టారు. అవినీతి అనకొండ ను నెత్తిమీద బండరాయితో మాడు పగలగొట్టారు. చచ్చిన పామును మేము ఇంకా ఎందుకు చంపుతాం. మేము అంత ఖాళీగా లేము కదా. మా పని మేము చేసుకుంటున్నాం. ప్రజలకు అనేక హామీలు ఇచ్చాం. ఆ హామీలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. మా మీద అభాండాలు మోపకండి” అంటూ రేవంత్ వెల్లడించారు. సీఎం చేసిన విమర్శలకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది..