Divorces: ఒకప్పుడు ప్రేమ పెళ్లిళ్లు అంతగా ఉండేవి కాదు. పెద్దలు చూసిన సంబంధాలను చాలామంది ఇష్టపడేవారు. పెద్దల మాటలకు కట్టుబడేవారు. పెద్దలు చూసిన అమ్మాయిలను లేదా అబ్బాయిలను పెళ్లి చేసుకునేవారు. కుటుంబంలో ఏవైనా కలహాలు వస్తే పెద్దలు సరి దిద్దేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. పైగా వేరు కుటుంబాలు ఎక్కువైపోయాయి. పెద్దల మాటలకు విలువ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో దంపతుల మధ్య కలహాలు పెరిగిపోతున్నాయి. అవి విడాకులకు దారితీస్తున్నాయి.
విడాకులు తీసుకుంటున్న వారిలో ఎక్కువ శాతం ప్రేమ వివాహాలు చేసుకున్న వారే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. విడాకులు తీసుకున్న క్రమంలో భార్యలకు భరణాలు చెల్లించలేక చాలామంది భర్తలు అప్పులు చేస్తున్నారు. డైవర్స్ తీసుకున్న పురుషుల్లో 42 శాతం మంది పరిస్థితి ఇదే విధంగా ఉంది. పైగా 53 శాతం మంది మహిళలకు భర్త ఆస్తిలో సగం కన్నా ఎక్కువ భరణం ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. అంతేకాదు 26 శాతం మంది మహిళలు భర్త నికర అస్తి కంటే ఎక్కువ భరణంగా పొందుతున్నారు. ఆర్థిక అంశాలే 67% జంటల్లో విడాకులకు దారితీస్తున్నాయి. వివాహం జరిగిన తర్వాత 46% మంది మహిళలు ఉద్యోగాలను వదిలేస్తున్నారు. అయితే ఆర్థికపరమైన సమస్యలు.. వివాహేతర సంబంధాలు.. ఇతర వ్యవహారాలు విడాకులకు దారితీస్తున్నాయని తెలుస్తోంది.
మనదేశంలో వైవాహిక వ్యవస్థలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న మార్పులపై వన్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. దేశంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోయిందని ఈ సర్వే ద్వారా బయటపడింది. విడాకుల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్న పురుషులు దారుణంగా అప్పులు చేస్తున్నారు. దాదాపు 42 శాతం మంది పురుషులు విడాకుల కోసమే అడ్డగోలుగా అప్పులు చేస్తున్నారు. లాయర్ల కోసం.. కోర్టు ఫీజుల కోసం భారీగా చెల్లిస్తున్నారు. విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్న వారిలో ఎక్కువగా ఐటీ ఉద్యోగులే ఉండడం విశేషం.
ఐటీ విభాగంలో పని చేసే స్త్రీ, పురుషుల మధ్య ఆర్థిక అవాంతరాలు పెరిగిపోతున్నాయి. వీరికి భారీగా జీతాలు ఉండడంతో బ్యాంకులలో రుణాలు తీసుకొని గృహాలు.. వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే డబ్బులు తిరిగి చెల్లించే క్రమంలో వీరిద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి. అందువల్లే అవి విడాకులకు దారితీస్తున్నాయి. అయితే చాలామంది ఐటీ వి భాగంలో పని చేసేవారు వివాహం జరిగిన తర్వాత తమ ఉద్యోగాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉండడం లేదు. ఇవి కూడా విడాకులు తీసుకోవడానికి ఒక కారణంగా ఉంటున్నాయి. డబ్బుల కోసం జరుగుతున్న గొడవలు విడాకులకు దారి తీస్తున్నాయి. ఇలా విడాకులు తీసుకుంటున్న జంటలు ఏకంగా 67% వరకు ఉంటున్నట్టు సర్వే ద్వారా తేలింది.