Salary to their wives: సమయానికి ఇంట్లో డబ్బులు లేకపోతే.. పోపు డబ్బాలో దాచుకున్న చిల్లర పనికి వస్తుంది.. అవసరానికి డబ్బు అందకపోతే గల్లా పెట్టెలో దాచిన సొమ్ము ఉపయోగపడుతుంది.. వాస్తవానికి పోపు డబ్బాలో చిల్లర దాయడం.. గల్లా పెట్టెలో సొమ్ము భద్రపరచడం.. మగవాళ్ళకు రాదు. మగవాళ్లకు అంతగా ముందుచూపు కూడా ఉండదు.
ఇలాంటి ఆర్థిక వ్యవహారాలలో ఆడవాళ్లు తలపండినవారు కాబట్టే.. చాలావరకు కుటుంబాలలో ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు.. ఆర్థికంగా ఇబ్బందులు చోటు చేసుకున్నప్పుడు ఆడవాళ్లు ధైర్యంగా ఉంటారు. ఆ సమయంలో తాము భద్రపరచిన నగదును బయటకు తీసి ఆ సమస్యలను పరిష్కరిస్తారు. అయితే ఇలాంటి నేర్పు జపాన్ మహిళలకు అధికంగా ఉంటుందట. అందువల్లే అక్కడ మగవాళ్ళు ఆర్థిక వ్యవహారాలలో కలగ చేసుకోరట. పైగా సంపాదించిన డబ్బులు.. వేతనంగా వచ్చిన నగదును తమ భార్యలకు ఇస్తారట. అందువల్ల అక్కడ కుటుంబాలలో పెద్దగా ఆర్థిక సమస్యలు చోటు చేసుకోవట. జపాన్లో ఈ సంప్రదాయాన్ని ఒకో జూకై అని పిలుస్తారట. ఈ ఆచారం ప్రకారం కుటుంబంలో ఆర్థిక వ్యవహారాలు మొత్తం భార్యలు మాత్రమే చూసుకుంటారు.. భర్తలు తమ జీతాన్ని భార్యలకు అప్పగించడం ద్వారా.. ఆర్థిక వ్యవహారాలు మొత్తం కూడా వారే చూస్తారట. అంతేకాదు భర్తలకు పాకెట్ మనీ కూడా భార్యలే ఇస్తారట. దీనివల్ల అక్కడి కుటుంబాలలో పెద్దగా ఆర్థిక సమస్యలు ఉండవట..
Read Also: ఏడాది కూటమి పాలన.. వచ్చే నాలుగేళ్లలో జరిగేది అదే!
ఎప్పటినుంచంటే
జపాన్లో ఈ తరహా సంప్రదాయం చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఎందుకంటే జపాన్ మహిళలు ఎక్కువగా ఖర్చు పెట్టరు. పైగా ఉన్న దాంట్లోనే గుట్టుగా సంసారాన్ని సాగిస్తుంటారు. ప్రతి విషయంలోనూ లెక్కలు వేసుకుంటారు. అంతేకాదు ఇంటి చాకిరి మొత్తం వాళ్లే చేస్తారు. అద్భుతంగా ఇంటిని తీర్చిదిద్దుకుంటారు. అందువల్లేవారు ప్రతి పైసకు లెక్కలు వేసుకుంటారు. ఆచితూచి ఖర్చు పెడుతుంటారు. అడ్డగోలుగా ఖర్చుపెడితే ఆర్థికంగా ఇబ్బంది ఎదురవుతుందని భావిస్తుంటారు. పైగా మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ ఆర్థిక క్రమశిక్షణ చూసి.. వారు నెల చివర్లో సంపాదించిన వేతనాన్ని తమ భార్యలకు అప్పగిస్తారు. అంతేకాదు ప్రతిరోజు వారి దగ్గర నుంచి పాకెట్ మనీ గా కొంత సొమ్ము తీసుకుంటారు. దాని ఖర్చుకు కూడా లెక్కలు చెప్పాల్సిన బాధ్యత భర్తలపై ఉంటుంది. ఇంత కట్టుదిట్టంగా ఆర్థిక వ్యవహారాలు కొనసాగిస్తున్నారు కాబట్టి జపాన్ దేశంలో కుటుంబాలు పటిష్టంగా ఉన్నాయి.
అయితే ఇటీవల కాలంలో అక్కడ మహిళలు కూడా సంపాదించడం మొదలుపెట్టారు. కార్పొరేట్ కొలువులు చేయడం ప్రారంభించారు. మహిళలు కూడా ఉన్నతంగా చదువులు చదువుతున్న నేపథ్యంలో వారికి కూడా అద్భుతమైన ఉద్యోగాలు వస్తున్నాయి. అదే స్థాయిలో సంపాదన కూడా ఉన్నది. అందువల్లే ఓకో జూకై వ్యవహారం క్రమంగా కనుమరుగవుతోందని తెలుస్తోంది. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ ఈ ఆచారం ఉందని.. మద్యస్థ పట్టణాలలో కూడా ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉందని తెలుస్తోంది. మొత్తంగా జపాన్ దేశస్తులు కష్టంగా పనిచేయడంలోనే కాదు.. కట్టుదిట్టంగా ఆర్థిక వ్యవహారాలు కొనసాగించడంలోనూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.