Pandu Rangaswamy Temple: మద్యం తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఇంట్లో ఉన్న డబ్బులు మొత్తం తాగుడుకు ఖర్చు చేయాల్సి వస్తుంది. అప్పుడు కుటుంబ పోషణ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పై పడుతుంది. అది అంతిమంగా విభేదాలకు దారితీస్తుంది. తాగిన మైకంలో ఏదైనా చేయడానికి పురిగొల్పుతుంది. ఒక నివేదిక ప్రకారం పురుషులు మద్యం తాగడానికి తమ సంపాదనలో సింహభాగానికంటే ఎక్కువగా ఖర్చు చేస్తారని తేలింది.. అలాంటి కుటుంబాల్లో నిత్యం ఘర్షణలు చోటు చేసుకుంటారని వెలుగులోకి వచ్చింది. అయితే మద్యం తాగే అలవాటు చెడ్డదయినప్పటికీ.. చాలామంది దానిని మానుకోలేరు. మద్యం తాగలాగే అలవాటును మానిపించడానికి వైద్య చికిత్సలు కూడా లేవు. అయితే ఒక గుడికి వెళ్తే మాత్రం ఎంత మద్యం ప్రియులైనా సరే ఆ అలవాటును మానేస్తారు. తాత్కాలికంగా కాదు, శాశ్వతంగా మద్యాన్ని దూరం పెడతారు. అంతేకాదు జన్మలో మద్యం వైపు ముఖం కూడా చూపించరు. ఆ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గంలోని బొమ్మనహల్ ప్రాంతంలోని ఉంతకల్లు అనే గ్రామంలో ఉంది..
స్వామి మాలధారణ చేస్తే
ఈ ఆలయంలో పాండురంగడు కొలువై ఉన్నాడు. ఇక్కడ కొలువై ఉన్న స్వామి ఎంతో మహిమ గలవాడు. అందువల్లే ఎక్కడెక్కడ నుంచో భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా తాగుడుకు బానిసైన వారు స్వామివారిని దర్శించుకుని.. పాండురంగ స్వామి మాల ధరిస్తే జన్మలో ఇక మందు జోలికి వెళ్ళరని ఇక్కడి ప్రజల నమ్మకం. అంతేకాదు మాల ధరించి మద్యాన్ని మానివేసిన చాలామంది వ్యక్తులను ఇక్కడ గ్రామస్తులు ఉదాహరణగా చూపిస్తుంటారు. అయితే స్వామివారి మాల ఎప్పుడు పడితే అప్పుడు ధరించకూడదు. మాల ధరించేందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. మాల ధారణను కేవలం నెలలో రెండు రోజులు మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఏకాదశి తిధి రోజున ఈ మాలను ధరింప చేస్తారు. ఏకాదశి తిధులు శుక్ల ఏకాదశి , కృష్ణ ఏకాదశి ప్రతి నెలలో రెండు వస్తాయి. అందువల్ల నెలలో ఈ రెండు రోజుల్లోనే మాల ధరించడానికి అవకాశం ఉంటుంది. మద్యం అలవాటుకు వీడ్కోలు పలకాలి అనుకునే వాళ్లు ఈ ఆలయానికి వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా మందు బాబులు ఈ ఆలయానికి చేరుకుంటారు.
టోకెన్ తీసుకోవాలి
మాల ధరించాలనుకునేవారు వంద రూపాయలు చెల్లించి దేవాలయంలో టోకెన్ తీసుకోవాలి.. ఏకాదశి తిథి కంటే కొన్ని రోజులు ముందుగానే ఆలయ అధికారులను సంప్రదించాలి. ఏకాదశి ముందు రోజు అంటే అర్ధరాత్రి నుంచి ఆ మాలను పాండురంగ స్వామి ఆలయంలో ఉంచుతారు. భక్తులు పూజలు చేస్తుంటారు. భజనలు కొనసాగిస్తుంటారు. ఆ తర్వాత మనసటి రోజు ఏకాదశి సూర్యోదయం సమయంలో నిద్ర లేచి, చన్నీళ్ళతో స్నానం చేస్తారు. స్వామివారి ఆలయానికి చేరుకున్న అనంతరం టోకెన్ నెంబర్ ప్రకారం క్యూ లైన్ లో నిలబడి.. మాల ధరించాలి. ఇక్కడ ఏకాదశి ఇది రోజున వచ్చే భక్తులకు గ్రామస్తులు ఉచితంగా భోజనాన్ని అందిస్తారు. ఇందుకోసం ఎటువంటి రుసుమూ స్వీకరించరు. మాలధారణ చేసిన వ్యక్తులు ఆలయంలోనే నిద్రించాలి. ఇలా మూడు ఏకాదశి తిధులు నిద్ర చేసిన తర్వాత.. మాలను విరమింప చేయవచ్చు.