Khairatabad Ganesh 2024: తెలంగాణలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిమజ్జన వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి. సోమవారం(సెప్టెంబర్ 16న) చాలా ప్రాంతాల్లో నిమజ్జన వేడుకలు నిర్వహిస్తున్నారు. మంగళవారం(సెప్టెంబర్ 17న) హైదరాబాద్‌లో నిమజ్జన వేడుకలు నిర్వహించనున్నారు. ఈమేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ గణేశ్ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ బడా గణేశ్. తర్వాత బాలాపూర్ గణనాథుడు. బాలాపూర్ గణపతి లడ్డూ చాలా ఫేమస్. ఇక్కడి లడ్డూ లక్షల్లో పలుకుతుంది. ఇక ఖైరతాబాద్ గణపతి ఎత్తులో ఫేమస్. 70 ఏళ్లుగా ఖైరతాబాద్ గణపతి వేడుకలు నిర్వహిస్తున్నారు. అందుకే ఈ ఏడాది బడా గణేశ్ విగ్రహాన్ని 70 అడుగులు తయారు చేశారు. పది రోజులపాటు భక్తులకు దర్శనమిచ్చాడు. రాష్ట్రంతోపాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి బడా గణేశ్‌ను దర్శించుకున్నారు. మంగళవారం బడా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు.
హుండీ లెక్కింపు..
మంగళవారం నిమజ్జనం సందర్భంగా సోమవారమే బడా గణేశ్ హుండీ లెక్కించారు. ఈ ఏడాది స్వామివారికి భారీగా ఆదాయాం వచ్చింది. కేవలం హుండీ ఆదాయమే రూ.70 లక్షలు వచ్చిందని ఉత్సవ కమిటీ తెలిపింది. ఇక గణనాథుడి చుట్టూ, పరిసరాల్లో వివిధ కంపెనీల ప్రకటనలు ఏర్పాటు చేయడం ద్వారా మరో రూ.40 లక్షల ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది.
కోటికిపైగా ఆదాయం..
మొత్తంగా ఖైతరాబాద్ గణనాథుడికి ఈ ఏడాది రూ.కోటికిపైగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. గణపయ్యకు స్కానర్ల ద్వారా కూడా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమేజాన్ యాప్‌ల ద్వారా కూడా భక్తుగు భారీగా నగదు చెల్లించారు. ఇంకా వాటిని లెక్కించాల్సి ఉంది. ఇక ఈసారి ఖైరతాబాద్ గణనాథుడిని ఈసారి 30 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాద దర్శనాలు నిలిపవేశారు. సోమవారం వెల్డింగ్ పనులు మొదలు పెట్టారు. సాయంత్రానికి పూర్తి చేశారు.
ఉదయం 6 గంటలకే శోభాయాత్ర..
ఇదిలా ఉంటే.. మంగళవారం ఉదయం 6 గంటలకే బడా గణేశ్ శోభాయాత్ర ప్రారంభించనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. మధ్యాహ్నం 2 గంటలలోపు క్రేన్ నంబర్ 4 వద్ద ఖైతరాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తవుతుందని వెల్లడించారు. మరోవైపు వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.