రివ్యూ: దురంధర్: ది రివెంజ్
నటీనటులు: రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్, రాకేశ్ బేడీ, గౌరవ్ గేరా తదితరులు.
సంగీతం: శాస్వత్ సచ్‌దేవ్
ఛాయాగ్రహణం: వికాస్ నౌలాఖ
ఎడిటర్: శివకుమార్ వి. పానికర్
దర్శకత్వం: ఆదిత్య ధర్
నిర్మాతలు: ఆదిత్య ధర్, జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్
హిందీ సినిమాల్లో సరైన కంటెంట్ లేదు, సౌత్ సినిమాలు బాలీవుడ్ ను దున్నేస్తున్నాయి ఇక బాలీవుడ్ పనైపోయింది ఆనే కామెంట్లు జోరుగా వినిపిస్తున్న టైమ్ లో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయింది దురంధర్. కానీ రిలీజైన తర్వాత మౌత్ టాక్ తో రోజురోజుకీ కలెక్షన్లు పెంచుకుని బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. సినిమాలో కంటెంట్ తో పాటుగా అక్షయ్ ఖన్నా వైరల్ డ్యాన్స్ సీక్వెన్స్ కూడా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది. ఒక్క హిందీ వెర్షన్ మాత్రమే దాదాపు వెయ్యికోట్లు వసూలు చేసిందంటే దురంధర్ సత్తాను ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు. మరోవైపు ఈ సినిమాను “మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రాపగాండా సినిమా” అంటూ జోరుగా విమర్శలు కూడా వచ్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘ధురంధర్: ది రివెంజ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం తరహాలోనే ఇది కూడా ఇంటెన్స్ గా ఉంటూ ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.
మొదటి భాగంలో పాకిస్తాన్‌లోని ల్యారీ టౌన్ ఏరియాలోకి అండర్ కవర్ ఏజెంట్‌గా ప్రవేశిస్తాడు హంజా అలీ మజారీ(రణవీర్ సింగ్). ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన బలోచ్ తెగవాడిగా చెప్పుకుని అతను అక్కడ ఎలా స్థిరపడ్డాడు? కరాచీ అండర్ వరల్డ్ డాన్ రెహ్మాన్ డకైత్ (అక్షయ్ ఖన్నా) గ్యాంగ్ లో చేరి చివరికి అతన్నే ఎలా తుదముట్టించాడు? ఇండియాపై పాకిస్తాన్ వారి కుట్రలకు సంబంధించిన సమాచారాన్ని భారతదేశానికి ఎలా చేరవేశాడు అనేది మొదటిభాగంలో చూపించారు. ఇప్పుడు రెండవ భాగం దురంధర్: ది రివెంజ్ లో అసలు జస్కిరత్ సింగ్ రంగి ఎవరు? అతను హంజా అలీ మజారీగా ఎందుకు మారాడు అనేది చూపించారు. ఇక రెహ్మాన్ డకైత్ మరణం తర్వాత కరాచీలోని ల్యారీ టౌన్ పగ్గాలు ఎలా చేపట్టాడు? రెహ్మాన్ డకైత్ స్థానాన్ని భర్తీ చేయడమే కాకుండా ఐయస్ఐ కుట్రలను తెలుసుకుంటూ ఎలా భారతదేశాన్ని అప్రమత్తం చేస్తూ ఉంటాడు. హంజా కేవలం గ్యాంగ్ స్టర్ గా ఎదగడమే కాకుండా, 26/11 దాడుల వెనుక ఉన్న అసలు సూత్రధారులను ఏరిపారేయడమే తన అంతిమ లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఈ క్రమంలో అతనికి ఎస్పీ చౌదరి అస్లాం (సంజయ్ దత్) నుండి ఎదురైన సవాళ్లు ఏంటి? మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) తో సాగిన మైండ్ గేమ్ ఏంటి? చివరికి తను అనుకున్నది సాధించాడా అనేది మిగతా కథ.
దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సీక్వెల్‌ను మొదటి భాగం తరహాలోనే ఇంటెన్స్‌గా రా గా తీర్చిదిద్దారు. చాప్టర్ వైజ్ ఒక్కో ఎపిసోడ్ ను ఓపెన్ చేసుకుంటూ వెళ్లడంతో సినిమా నిడివి 3 గంటల 49 నిమిషాలు ఆనే విషయం మనకు ఇబ్బందిగా అనిపించదు. రెండు భాగాలు అనగానే ఫిల్మ్ మేకర్స్ కు ఎదురయ్యే ఛాలెంజ్ అంచనాలను అందుకోవడం. ఆ విషయం దృష్టిలో ఉంచుకునే డైరెక్టర్ వర్క్ చేశాడేమో కానీ చాలా సీక్వెన్సులు హై ఇంటెన్సిటీతో సాగుతాయి. హంజా అలీ మజారీ ఫ్లాష్ బ్యాక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక సీన్ కరాచీకి షిఫ్ట్ అయిన తర్వాత తన లక్ష్యానికి తగ్గట్టు శత్రువులను ఒక్కొక్కరుగా నిర్వీర్యం చేయడం, ఒక దశ దాటిన తర్వాత మట్టుబెట్టడం యాక్షన్ ను పతాకస్థాయికి తీసుకెళ్తాయి. ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ ఎక్కడా సస్పెన్స్ ఫ్యాక్టర్ మాత్రం మిస్ కాలేదు. ముఖ్యంగా ప్రేక్షకులకు ఏదో ఒక మూల మన హీరో పట్టుబడతాడేమో ఆనే అనుమానం తొలుస్తూనే ఉంటుంది. పైగా అక్కడే పెళ్లి చేసుకుని కాపురం కూడా పెట్టాడు కాబట్టి వాళ్ళకు కూడా డేంజర్ కదా అనేది ప్రేక్షకుల్లో అనిపిస్తుంది. కానీ అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూనే తన మిషన్ లో ముందుకు సాగడం, ఈ ప్రాసెస్ లో కొందరు ఇండియాకు వాంటెడ్ అయిన వారిని అంతం చేయడం హైలైట్ గా నిలుస్తుంది. మొదటి భాగంలో రియల్ ఇన్సిడెంట్స్ అయిన 26/11 ఉగ్రవాద దాడి లాంటి సంఘటనలను కథలో మిక్స్ చేసినట్టే ఈ భాగంలో కూడా డీమానెటైజేషన్ ను ఎందుకు చేయాల్సి వచ్చింది ఆనే కోణం చర్చించడం ఒక హైలైట్ గా నిలుస్తుంది. మొదటి భాగంలో అసంపూర్తిగా మిగిలిన చాలా అంశాలకు చక్కటి ముగింపు ఇచ్చారు.
ఈ సినిమాకు శాస్వత్ సచ్ దేవ్ అందించిన నేపథ్య సంగీతం వెన్నెముకగా నిలిచింది. చాలా సీన్స్ ను సంగీతం నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. వికాస్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు తగ్గట్టు ఇంటెన్స్ గా ఉంది. ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ పాకిస్తాన్ అండర్ వరల్డ్ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడంలో ముఖ్యపాత్ర పోషించాయి. కొంతవరకూ ప్రథమార్థం అంతా హంజా పాత్ర యొక్క ఎదుగుదల, ల్యారీ గ్యాంగ్ వార్లతో నిండిపోయి కాస్త నిదానంగా సాగినట్లు అనిపిస్తుంది. కానీ ద్వితీయార్థంలో వచ్చే ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు, యాక్షన్ సన్నివేశాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళాయి. రణ్‌వీర్ సింగ్ తన ‘బీస్ట్ మోడ్’ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకోగా, మాధవన్ తన హుందాతనంతో అజయ్ సాన్యల్ పాత్రకు ప్రాణం పోశారు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ ఇద్దరూ తమ నటనతో ఆకట్టుకున్నారు.
సినిమాలో బాగోలేనివి ఇవీ:
1. ప్రథమార్థంలో కొన్ని సాగతీత సన్నివేశాలు.
2. మితిమీరిన హింస
ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?
1. రణ్‌వీర్ సింగ్ నటన
2. డైరెక్షన్
3. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్,
4. సినిమాటోగ్రఫీ
రేటింగ్: 3.25/5
ఫైనల్ వర్డ్: పైసా వసూల్ యాక్షన్ థ్రిల్లర్
