Onam 2024: మలయాళీల ఓనం అంటే… రకరకాల వంటల సమ్మేళనం.. ఇంతకీ ఎలాంటి వంటలు వండుతారంటే..

పండిన పంట ఇంటికి వచ్చినప్పుడు.. శీతాకాలం మొదలైనప్పుడు.. తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి పండుగ జరుగుతుంది. అవనికి కొత్త క్రాంతిని అందిస్తుంది. ఆ సమయంలో చేసే పిండి వంటలు న భూతో న భవిష్యత్ అనే లాగా ఉంటాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : September 13, 2024 10:10 pm

Onam 2024

Follow us on

Onam 2024: మనకు సంక్రాంతి ఎలాగో.. కేరళ ప్రజలకు ఓనం కూడా అలాంటిదే. ఋతుపవనాలు ముగింపు దశకు చేరుకున్నప్పుడు రాక్షస రాజు బలి చక్రవర్తిని వారి ఇళ్లల్లోకి ఆహ్వానిస్తారు. ఆ సందర్భంగా పూలతో ముగ్గులు వేస్తారు. సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. ఇదే క్రమంలో బలి చక్రవర్తిని కీర్తిస్తూ పాటలు పాడుతారు. స్తోమత ఆధారంగా ఇళ్లను పూలతో అలంకరిస్తారు. విభిన్నమైన ముగ్గులతో బలి చక్రవర్తిని ఆకర్షిస్తారు. ఎంత పెద్ద ముగ్గు వేస్తే బలిచక్రవర్తి అంత ఇష్టంగా ఇంటికి వస్తాడని కేరళ వాసులు నమ్ముతుంటారు. ఈ పండుగను కేరళవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. ఈ పండుగను చేసుకునేందుకు దేశ విదేశాలలో స్థిరపడిన కేరళ వాసులు సొంత ప్రాంతానికి వెళ్తుంటారు. ఓనం పండుగ సమయంలో కేరళ రాష్ట్రంలో బంగారం నుంచి మొదలు పెడితే వస్త్ర దుకాణాల వరకు కిటకిటలాడుతుంటాయి. కోట్లల్లో వ్యాపారాలు జరుగుతుంటాయి. సాధారణంగా ఓనం అంటే బలి చక్రవర్తికి పూజలు, పూలతో ముగ్గులు మాత్రమే కాదు.. కడుపు నింపే పిండి వంటలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా సంస్కృతి, సంప్రదాయాన్ని కలగలిపి ఉంటాయి.

ఎలాంటి వంటలు వండుతుంటారంటే..

ఓనం సెప్టెంబర్ 6న మొదలవుతుంది.. 15వ తేదీన ముగుస్తుంది.. ఓనం అంటేనే పువ్వులతో చేసే అందమైన అలంకరణ. ఆ సమయంలో కేరళ ప్రజలు తమ ఇళ్ళను అద్భుతంగా ముస్తాబు చేస్తారు. పసందైన విందు భోజనం తింటారు. ముఖ్యంగా సాధ్య అనే ఎర్ర బియ్యంతో అన్నం వండుతారు. ఇక ఉప్పేరి, పసుపు, ఆవాలు, పన్నీర్ కూర, క్లాసిక్ పరిప్పు, గుమ్మడి, కొబ్బరితో వంటకాలు చేస్తారు. ఇది మాత్రమే కాకుండా తోరన్, శర్కర వరట్టి, ఉల్లి వడ, అవియల్ సాంబారు… ఇలా 20 రకాల వంటకాలు తయారు చేస్తారు. ముఖ్యంగా అరిటాకులో చేసే భోజనం ప్రత్యేకంగా ఉంటుంది.. ఓనం సందర్భంగా చేసే పరిప్పు కూర అద్భుతంగా ఉంటుంది. పచ్చికొబ్బరి, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పెసరపప్పు, నల్ల మిరియాలు, ఉప్పు మిశ్రమంతో దీనిని తయారు చేస్తారు. ఇక బీట్రూట్, దోసకాయ, గుమ్మడి, పైనాపిల్.. వంటి వాటితో పచ్చళ్ళు తయారు చేస్తారు. అన్ని రకాల కూరగాయల ముక్కలతో సాంబార్ తయారు చేస్తారు. ఇందులో ఆవపిండి పోస్తారు. అందువల్ల అది అత్యంత రుచిగా ఉంటుంది. ఇన్ని వంటకాలు తినడం పూర్తయిన తర్వాత.. చివర్లో పాయసం తాగి నోటిని తీపి చేసుకుంటారు. భోజనం పూర్తయిన తర్వాత సాయంత్రం పూట కుటుంబం మొత్తం సరదాగా ఆటలాడుతారు. బలి చక్రవర్తిని కీర్తిస్తూ పాటలు పాడుతుంటారు. బలి చక్రవర్తి గొప్పదనాన్ని గురించి వివరించే కథలను చదువుతుంటారు. తమ ఇంటిని కాపాడాలని బలి చక్రవర్తిని కోరుకుంటారు.