Fake GST billing Scam In Restaurants India: మనలో చాలా మందికి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. పేరు పొందిన హోటళ్లలో లొట్టలు వేసుకుని బిర్యానీలను తింటాం. బిర్యానీ కంటే ముందు సూప్ లు, స్టాటర్ లు, మెయిన్ కోర్స్.. ఐస్ క్రీమ్.. ఇలా చెప్పుకుంటూ పోతే తింటూనే ఉంటాం. మన తింటి యావకు తగ్గట్టుగానే హోటళ్లు వెలుస్తున్నాయి. వెస్ట్రన్, కాంటినెంటల్ రుచులు అందిస్తూ మన పొట్టలు పెరిగేలా చేస్తున్నాయి. వేలకు వేలు బిల్లులు వసూలు చేస్తూ భారీగా వెనకేసుకుంటున్నాయి.
జీఎస్టీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని హోటల్స్ కస్టమర్ల దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నాయి. ఇలా వసూలు చేసిన జీఎస్టీ కేంద్రానికి, రాష్ట్రానికి వెళ్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ, కస్టమర్ల దగ్గర నుంచి వసూలు చేసిన జీఎస్టీ ప్రభుత్వాలకు వెళ్లడం లేదు. అడ్డగోలు వంటకాలు తయారు చేసి జనాల ఆరోగ్యాల చెలగాటమాడుతున్న హోటళ్లు నిర్వాహకులు.. చివరికి ట్యాక్స్ ను కూడా చెల్లించడం లేదు.
హోటల్ నిర్వాహకులు భారీగానే కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. వారు వేసే బిల్లుల గురించి అడిగే అధికారి ఎవరూ ఉండరు. పైగా హోటళ్ల వ్యాపారం అనేది మనదేశంలో ఒక పెద్ద దందా. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ దందాకు అడ్డు ఉండదు. ఇటీవల కాలంలో స్వయం ప్రకటిత యూట్యూబర్లు తెరపైకి రావడంతో.. హోటళ్ల వ్యాపారం మరింత పెరిగింది. కొత్త కొత్త రుచుల పేరుతో ప్రచారం చేసుకోవడం వల్ల జనం ఇంట్లో వండుకోవడం మానేసి హోటల్లలో తినేస్తున్నారు. చివరికి ఆన్లైన్ లో బుక్ చేసుకొని అడ్డగోలుగా తినేస్తున్నారు.
కొన్నాళ్లుగా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే హోటల్స్ జీఎస్టీ చెల్లించడం లేదట. అనుమానం వచ్చిన అధికారులు లోతుగా పరిశీలిస్తే దారుణమైన నిజాలు బయటికి వచ్చాయి. ఏఐ ఆధారంగా అధికారులు పరిశీలన చేస్తే మొత్తం 1.77 లక్షల రెస్టారెంట్లు అక్రమాలకు పాల్పడ్డాయట. ఆ రెస్టారెంట్లు జారీ చేసిన 60 టెరా బైట్ల బిల్లుల ను విశ్లేషణ చేస్తే 70 వేల కోట్ల స్కాం జరిగిందట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 5,100 కోట్ల స్కామ్ జరిగిందట. బిల్లుల మోసం వ్యవహారంలో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ రెండో స్థానంలో, తమిళనాడు మూడోస్థానంలో ఉన్నాయట.