Bond of Rakhi Religions: మతం, భాష, ప్రాంతం అనే గీతలన్నింటినీ దాటి, మానవత్వం మాత్రమే మిగిలే క్షణాలు కొన్ని ఉంటాయి. అలాంటి అరుదైన, హృద్యమైన సంఘటన గుజరాత్‌లోని రాఖీ పౌర్ణమి రోజు చోటుచేసుకుంది.
గులాబీ రంగు సల్వార్ కమీజ్ ధరించిన 16 ఏళ్ల అనంతా అహ్మద్, శివం మిస్త్రీ చేతికి రాఖీ కట్టగానే అక్కడున్న హాలు చప్పట్లతో మారుమోగింది. “బెహ్నా నే భాయ్ కి కళాయీ పే ప్యార్ బాంధా హై…” అనే రాఖీ బంధన్ పాట వినిపించగా, అందరూ శృతి కలిపి పాడారు. కానీ ఈ రాఖీ కట్టడం వెనుక ఒక అసాధారణమైన కథ ఉంది. ఎందుకంటే శివం చేతికి రాఖీ కట్టినది అనంతా చేతి కాదు, అతికించబడిన తన చనిపోయిన చెల్లి రియా చేయి.
Read Also: రాహుల్ గాంధీతో జగన్ భేటీ
ముంబాయిలో నివసించిన రియా అనారోగ్యంతో బ్రెయిన్ డెడ్ అయ్యింది. ఆమె కుటుంబం మానవతా దృక్పథంతో ఆమె మూత్రపిండాలు, లివర్ వంటి అవయవాలను అవసరమైన వారికి దానం చేశారు. అదే సమయంలో, గుజరాత్‌కి చెందిన అనంతా 10వ తరగతి చదువుతుండగా హైటెన్షన్ వైర్ తగిలి కుడి చేయి కోల్పోయింది. ఎడమ చేయి కూడా 20% మాత్రమే పనిచేసేది. అయినా ఆమె పట్టుదలతో చదువులు కొనసాగించింది.
స్టేట్ ఆర్గాన్ మరియు టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్ సహకారంతో రియా కుడి చేయి అనంతాకి భుజం వరకు అతికించే శస్త్రచికిత్స విజయవంతమైంది.
Read Also: ‘వార్ 2’ లో ఆధిపత్యం చూపించే హీరో ఎవరు..?
రాఖీ పౌర్ణమి రోజు సామాజిక కార్యకర్తలు, రియా కుటుంబం, అనంతా కుటుంబం అంతా ఒకచోట కలుసుకునేలా ఏర్పాటు చేశారు. శివం మిస్త్రీకి, తన చనిపోయిన చెల్లి చేయితో అనంతా రాఖీ కట్టింది. ఆ క్షణంలో శివం ఆనందంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. రియా తల్లిదండ్రులు, తమ కూతురి స్పర్శను మరోసారి అనుభవిస్తూ ఆ చేయిని ముద్దాడారు.
ఈ సంఘటన మనసుకు హత్తుకునేలా, మానవత్వం ఎప్పుడూ మతం కన్నా పెద్దదని నిరూపించింది. రాఖీ బంధం కేవలం సోదర సోదరీల మధ్య ప్రేమకే కాదు, మానవ హృదయాల మధ్య ఉన్న ఆప్యాయతకు కూడా చిహ్నమని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.