ACB Raids: ” మేడం మీ బాంచన్.. నేను అంత ఇచ్చుకోలేను. అసలు ఆ భూమి మాకు వంశపారంపర్యంగా వస్తోంది. ఈ భూమికి సంబంధించి ప్రొసీడింగ్ కాపీ ఇవ్వడానికి ఇన్ని రోజులు మమ్మల్ని తిప్పిస్తున్నారు. ఇది మీకేమైనా న్యాయమా.. పైగా డబ్బుల కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు.. ప్రభుత్వ పరంగా జీతం తీసుకుంటున్నారు కదా.. జర మా పని చేయండి” అంటూ పదేపదే వారు బతిమిలాడారు. ఆయనప్పటికీ ఆ మేడంగారు వినిపించుకోలేదు. పైగా డబ్బులు ఇస్తేనే పనిచేస్తానని చెప్పింది. దీంతో వారికి ఒళ్ళు మండింది.
Also Read: అమరావతికి నందమూరి బాలకృష్ణ.. రేపే ముహూర్తం!
15వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు వికారాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న సుజాత అనే మహిళా ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. రెవిన్యూ సెక్షన్లో ఆమె కీలక అధికారిగా పనిచేస్తున్నది. నవీపేట మండలం తహసీల్దార్ కార్యాలయానికి ప్రొసీడింగ్ కాపీ పంపించాలని ఓ వ్యక్తి కొద్దిరోజులుగా సుజాత చుట్టు తిరుగుతున్నారు. అయితే ఆమె లంచం ఇస్తేనే ఆ కాపీ పంపిస్తానని చెప్పడంతో.. అతడు ఆమెను బతిమిలాడాడు. ఆయినప్పటికీ సుజాత ఒప్పుకోలేదు. పైగా తనని కలవడానికి అతడు వచ్చిన ప్రతిసారి తిరస్కారంగా సమాధానం చెప్పింది. దీంతో అతడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు చెప్పాడు. వారు సూచించిన విధంగా కెమికల్ కోటెడ్ కరెన్సీని మంగళవారం వికారాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో ఇచ్చాడు. అతని వద్ద డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా సుజాతను పట్టుకున్నారు.
సుజాత రెవెన్యూ విభాగంలో కీలక హోదాలో పనిచేస్తున్నప్పటికీ.. ఆమె మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఓ ప్రాంతంలో పనిచేస్తూ.. అక్కడి రైతుల భూములకు సంబంధించిన దస్త్రాలు ఇవ్వడానికి ఆమె లంచం డిమాండ్ చేశారు. అప్పట్లో ఆ రైతులు రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఆమెపై చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ సుజాత పనితీరు మారలేదు. వికారాబాద్ లో కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆమె.. ప్రతి పనికి ఒక రేట్ ఫిక్స్ చేశారు. చివరికి ఏసీబీ అధికారులకు ఇలా దొరికిపోయారు. వికారాబాద్ కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు చేసిన దాడుల్లో రెవెన్యూ అధికారి దొరకడం సంచలనం కలిగిస్తోంది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా దాడులు చేస్తున్నారు. లంచాలు తీసుకుంటూ దొరికిపోతున్న అధికారుల్లో రెవెన్యూ శాఖకు చెందిన వారే అధికంగా ఉన్నారు. గతంలో పురుష అధికారులు మాత్రమే ఏసీబీ దాడుల్లో దొరికేవారు. కానీ ఇప్పుడు మగ అధికారులతో మహిళ అధికారులు పోటీపడుతున్నారు. లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోతున్నారు.