Manthani: ఏదైనా ఆవిష్కరించాలి అంటే.. అందుకు సైంటిస్టే కానవసరం లేదు. అవసరం మన ఆలోచనలకు పదును పెడుతుంది. సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా ఆలోచింప జేస్తుంది. ఈ క్రమంలో ఆవిష్కరణలవైపు అడుగులు వేయిస్తుంది. సృష్టిలో కొన్ని సహజ సిద్ధంగా పరిష్కార మార్గాలు చూపితే.. చాలా సమస్యలకు మనిషే పరిష్కారం కనుగొన్నాడు. అందుకే ఆది మానవుల కాలం నుంచి ఆధునిక మానవుడిగా ఎదగగలిగాడు. ఇక నేటి తరం యువత సమస్యల పరిష్కారానికి అనేక మార్గాలు కనిపెడుతోంది. పిల్లలు కూడా తమ మెదడుకు పదును పెట్టి ఆవిష్కరణలు చేస్తున్నారు. చదువుకున్న జ్ఞానంతో కొత్త కొత్త ఆవిష్కరణలతో ప్రతిభ కనబరుస్తున్నారు. రెండేళ్ల క్రితం వేములవాడకు చెందిన బాలుడు ధాన్యం బస్తాల్లోకి ఎత్తే చిన్న పరికరం తయారు చేశాడు. దీంతో తన తండ్రి సమస్యకు పరిష్కారం కొనుగొన్నాడు.
ఉద్యోగులు కూడా..
ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ పని తప్పించుకుందామని చూస్తారు. కరెంటు పోయినా, ఇంటర్నెట్ అవాంతరాలు ఏర్పడినా ఖాళీగా ఉంటారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నా మేం ఏం చేయాలని ఎదురు ప్రశ్నిస్తారు. అయితే అందరూ అలాగే ఉండాటారని కాదు. కొంత మంది తీరుతో అందరూ అపవాదు ఎదుర్కొంటున్నారు. అయితే తెలంగాణలో ఓ పంచాయతీ కార్యదర్శి మాత్రం సాకులు చెప్పి తప్పించుకోకుండా సమస్యకు పరిష్కారం కనుగొని విధులు సక్రమంగా నిర్వహిస్తున్నాడు.
సిగ్నల్ సమస్యతో…
మంథని మండలం ఉప్పట్ల పంచాయతీ కార్యదర్శి హరికృష్ణ ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేస్తున్నారు. గ్రామంలో సెలఫోన్ సిగ్నల్ సక్రమంగా ఉండడం లేదు. దీంతో తరచూ అవాంతరాలు కలుగుతున్నాయి. సర్వే ఆలస్యం అవుతోంది. దీంతో ఆయనకు వినూత్న ఆలోచన చేశాడు. ఎత్తయిన ప్రాంతంలో ఉంటే సిగ్నల్ సమస్య ఉండడం లేదని గుర్తించాడు. దీంతో తన సెల్‌ఫోన్‌ను కర్రకు కట్టి.. ఎత్తుగా ఉంచుతున్నాడు. దాని వైఫై ఆన్‌చేసి.. మరో సెల్‌ఫోన్‌లో ఇందిరమ్మ యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నాడు. దీంతో సర్వే పని చకచకా జరుగుతోంది. గ్రామంలో సర్వేకు 390 దరఖాస్తులు రాగా, పది రోజుల్లో 230 దరఖాస్తులు సర్వే చేశారు. మరో 170 ఇళ్లు సర్వే చేయాల్సి ఉందని కార్యదర్శి తెలిపారు.