Purandeshwari : ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోంది. మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది. మూడు పార్టీల మధ్య సమన్వయం బాగానే ఉంది. కూటమిగా ఉంటూనే ఎవరికి వారు బలోపేతం కావాలని భావిస్తున్నారు.అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు చేపట్టింది. రికార్డు స్థాయిలో 80 లక్షల సభ్యత్వం వైపు అడుగులు వేస్తోంది. అదే సమయంలో జనసేన సైతం బలోపేతం పై ఫోకస్ పెట్టింది.ఆ పార్టీ సైతం సభ్యత్వ నమోదు పూర్తి చేసుకుంది. అయితే బిజెపి నుంచి ఆ స్థాయిలో సభ్యత్వ నమోదు జరగడం లేదు.ఆ పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు ఎంపీలు ఉన్నారు. క్రియాశీలక నాయకులకు కొదువలేదు.అయినా సరే సభ్యత్వ నమోదు ముందుకు కదలడం లేదు.అయితే ఈ విషయంలో బిజెపి ఏపీ చీఫ్ పురందేశ్వరి ఫెయిలయ్యారని ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
* టిడిపితో పొత్తులో కీలకంగా
గత ఏడాది జూలైలోఏపీ బీజేపీ చీఫ్ గా పురందేశ్వరి నియమితులయ్యారు.తెలుగుదేశం పార్టీతో పొత్తులో కీలకంగా వ్యవహరించారు.అప్పటివరకు బిజెపి చీఫ్ గా సోము వీర్రాజు ఉండేవారు.తెలుగుదేశం పార్టీతో పొత్తును ఆయన వ్యతిరేకించారు. ఎప్పుడైతే పురందేశ్వరి బిజెపి చీఫ్ గా మారారో.. అప్పటినుంచి పొత్తులకు అడుగులు వేగంగా పడ్డాయి.మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. కూటమి సక్సెస్ అయ్యింది. సూపర్ విక్టరీ సాధించింది. అయితే అప్పటివరకు ఏపీలో బిజెపికి ఓట్లు, సీట్లు లేవు.ఒకేసారి 8 ఎమ్మెల్యే సీట్లతో పాటు మూడు ఎంపీ స్థానాలను బిజెపి దక్కించుకోవడంతో ఆ క్రెడిట్ పురందేశ్వరి ఖాతాలో పడింది.
* ఢిల్లీలో మకాం
ప్రస్తుతం పురందేశ్వరి ఏపీలో కంటే ఢిల్లీలోనే ఎక్కువ గడుపుతున్నారు. ఆమె పదవి కాలం వచ్చే ఏడాది జూలై తో పూర్తి కానుంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి బిజెపి చీఫ్ ఎంపిక ఉంటుంది. ఇంతలో కేంద్రమంత్రిగా బాధ్యతలు తీసుకొని బిజెపి చీఫ్ వదులుకోవాలని పురందేశ్వరి భావిస్తున్నారు. అందుకే ఆమె పెద్దగా సభ్యత్వ నమోదు పై దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది. ఇంకోవైపు వీలైనంతవరకుపార్టీలో తన వర్గాన్ని పెంచుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ ను పార్టీలో చేర్పించుకున్నారు. ఇలానే టిడిపికి అనుకూలంగా ఉండే వైసీపీ నేతలను బిజెపిలోకి రప్పించాలని చూస్తున్నారు. అంతకుమించి పార్టీ బలోపేతానికి ప్రత్యేక చర్యలు అంటూ ఏమీ చేపట్టడం లేదని.. బిజెపిలో వ్యతిరేకపక్షం ఆరోపిస్తోంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి.