Lok Sabha Election Results 2024: క్రితం లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 18 స్థానాల్లో విజయం సాధించింది. మమతా బెనర్జీ నాయకత్వానికి అత్యంత కఠినమైన సవాల్ విసిరింది.. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యానికి చెక్ పెట్టింది.. అయితే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఫస్ట్ బెంగాల్ రాష్ట్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ రాష్ట్రంలో ఉన్న 42 పార్లమెంట్ నియోజకవర్గాలలో.. సత్తా చాటాలని భావించింది. కానీ బిజెపి అనుకున్నట్టుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పప్పులు ఉడకడం లేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కేవలం పది స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 31 స్థానాలలో అధికార తృణమూల్ కాంగ్రెస్ సత్తా చాటుతోంది.
42 పార్లమెంటు స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో.. 31 స్థానాలలో మమతా బెనర్జీ టిఎంసి ముందంజలో ఉంది. పది స్థానాల్లో మాత్రమే బిజెపి పై చేయి కొనసాగిస్తుంది. బెంగాల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదురి విజయం దిశగా సాగుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఏకంగా 47% ఓట్లతో తిరుగులేని స్థాయిలో దూసుకెళ్తోంది. బిజెపి 37%, కాంగ్రెస్ 4.63 శాతం ఓట్లను సాధించాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో టీఎంసీ 22 స్థానాలలో విజయం సాధించింది. ఈసారి ఎన్నికల్లో ఏకంగా 9 స్థానాలు మెరుగు పరుచుకొని, 31 స్థానాలలో లీడ్ లో కొనసాగుతోంది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బిజెపికి క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ లేకపోవడమే సీట్లు తగ్గడానికి ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. క్షేత్రస్థాయిలో బలం పెంచుకొని ఉంటే బాగుండేదని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయి నాయకత్వం.. కింది స్థాయి కార్యకర్తలను పట్టించుకోవడం మానేసిందని.. ఇదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు వారిని ఆకర్షించారని.. అందువల్లే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కి ఎదురు దెబ్బ తప్పలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..