AP Film Development Corporation: ఏపీలో ( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. ఎమ్మెల్సీ పదవులతో పాటు రాజ్యసభ పదవులను సైతం భర్తీ చేయగలిగారు. ఓ 100 వరకు కార్పొరేషన్ పదవులను సైతం నియామకాలు పూర్తి చేశారు. కానీ కీలకమైన ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇంతవరకు భర్తీ చేయలేదు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఆ పదవిలో పోసాని కృష్ణ మురళి ఉండేవారు. కూటమి వచ్చాక రకరకాల పేర్లు వినిపించాయి. అయితే చాలామంది సినిమా ప్రముఖులు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. అయితే ఆ పదవిలో ఎవరిని నియమిస్తారు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఆ మధ్యన హరిహర వీరమల్లు సినిమా నిర్మాత ఏఎం రత్నం పేరును ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. అయితే అది తన చేతుల్లో లేదని.. ఎన్నో రకాల సమీకరణలు ఉంటాయని కూడా నాడు గుర్తు చేశారు పవన్. అయితే ఆ పదవిని ఇంతవరకు భర్తీ చేయకపోవడం మాత్రం గమనించదగ్గ విషయం.
తెలంగాణలో వెంటనే భర్తీ..
తెలంగాణలో( Telangana)) కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలో వచ్చింది. హైదరాబాదులో చిత్ర పరిశ్రమ ఉన్నందున వెంటనే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని నియమించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజును చైర్మన్ పదవి ఇచ్చింది. కానీ ఏపీ నుంచి రకరకాల పేర్లు వినిపించాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో రాఘవేంద్రరావు, అశ్వినీ దత్, మురళీమోహన్, ఆదిశేషగిరిరావు వంటి వారు ఉన్నారు. గతంలో టిడిపి అధికారంలోకి వచ్చినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎస్వీబీసీ ఛానల్ బాధ్యతలను రాఘవేంద్రరావుకు కట్టబెట్టింది. అయితే ఈసారి మాత్రం ఇంతవరకు ఎవరిని నియమించలేదు. గత రెండు సంవత్సరాలుగా ఆ పోస్టు ఖాళీగా ఉంది.
ఆ కారణాలతోనే..
ప్రస్తుతం టిడిపి కూటమి ప్రభుత్వంలో జనసేన కూడా ఉంది. ఏపీలో కూటమి అధికారంలోకి రావాలని తెలుగు చిత్ర పరిశ్రమ బలంగా కోరుకుంది. జనసేనకు మద్దతుగా చిత్ర పరిశ్రమ ప్రముఖులు, బుల్లితెర నటులు ప్రచారం చేశారు. ఏపీ ప్రజలు కూటమికి అండగా నిలవాలని కూడా విజ్ఞప్తి చేసిన వారు ఉన్నారు. కానీ ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇంతవరకు భర్తీ చేయలేదు. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో సినిమా కార్యకలాపాలు చాలా తక్కువ. ఆ కారణంతోనే ఇంతవరకు భర్తీ చేయలేదని తెలుస్తోంది. అయితే ఈ పదవి విషయంలో జనసేన ఒక పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. తమ పార్టీకి చెందిన వారికి ఆ పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని పేర్ల విషయంలో అభ్యంతరాలు రావడంతోనే.. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నియామకం విషయంలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం.
