Lok Sabha Election Results 2024: మోడీ దే అధికారం.. కాకపోతే ఎన్నో చిక్కు ముళ్లు.. మరెన్నో సవాళ్లు

వాస్తవానికి 56 ఇంచుల ఛాతి ఉందని చెబుతుంటాడు.. మోడీ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నడూ సామాన్య ప్రధానమంత్రి కాలేదు. ఆ ఊసే అతడికి గిట్టదు. రాయితీల పెంపు, ధరలు తగ్గింపు, జన రంజక పథకాలు అతనికి అసలు చేతకాదు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 4, 2024 4:33 pm

Lok Sabha Election Results 2024

Follow us on

Lok Sabha Election Results 2024 ఈసారి 400 సీట్లు గెలవాలి.. పార్లమెంట్ ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ పెట్టుకున్న టార్గెట్. పార్టీ కార్యకర్తలకు.. నాయకులకు విధించిన టార్గెట్. రాముడికి గుడి కట్టించారు. త్రిబుల్ తలాక్ అమల్లోకి తెచ్చారు. కాశ్మీర్ లో జాతీయ జెండా ఎగరేశారు.. ఇన్ని చేశారు కాబట్టి బిజెపికి అడ్డేముంది. మోడీ చెప్పిన దాంట్లో తప్పేముంది. 400 ఖచ్చితంగా గెలుస్తారు. ఎన్నికలకు ముందు మేధావుల మాట ఇదే విధంగా ఉండేది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం కూడా ఇలానే కొనసాగేది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని చెప్పాయి. కానీ సీన్ కట్ చేస్తే.. ఫీల్డ్ రియాల్టీ లో ఏం జరిగింది.. మోడీ గెలవలేదు. విర్రవీగిన స్థాయిలో విజయం దక్కలేదు. అలాగని తలవంచే స్థాయిలో పరాజయం పొందలేదు.

వాస్తవానికి 56 ఇంచుల ఛాతి ఉందని చెబుతుంటాడు.. మోడీ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నడూ సామాన్య ప్రధానమంత్రి కాలేదు. ఆ ఊసే అతడికి గిట్టదు. రాయితీల పెంపు, ధరలు తగ్గింపు, జన రంజక పథకాలు అతనికి అసలు చేతకాదు. ఎంతసేపటికి ఆదాయం పెంచుకున్నామా? మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార బోతున్నామా? G20 సమావేశాలు నిర్వహించామా? ప్రపంచానికి పెద్ద దిక్కుగా మారామా? అనేవే అతడికి పడతాయి. పెరుగుతున్న పన్నులు, వేధిస్తున్న ధరలు సామాన్యుడి జీవితాన్ని ఎలా ఇబ్బంది పడుతున్నాయో అతని పట్టించుకోలేదు.. ఒక్కనాడూ సమీక్ష చేయలేదు.

ఇక ఈ ఎన్నికల్లో బిజెపికి సానుకూల అంశాలను ఒకసారి పరిశీలిస్తే.. మోడీ తన రాజకీయ చరిష్మాతో బిజెపిని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబెట్టాడు. సంకీర్ణాలకు చరమగీతం పాడాడు. శాసించే మిత్రులను అడుగుదాకా తొక్కాడు. 2019లో మరింత బలాన్ని పెంచుకున్నాడు. ఫలితంగా అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి ఏక లింగమయ్యాడు. స్థూలంగా చెప్పాలంటే మోడీ మాత్రమే మాట్లాడాలి. మోడీ చెప్పింది మాత్రమే వినాలి. అంతే మరో స్టార్ క్యాంపెయినర్ లేడు. పార్లమెంటు ఎన్నికల్లో దేశం మొత్తం చుట్టి వచ్చాడు. చివరికి తన స్థాయిని తగ్గించుకుని ఏవేవో అన్నాడు. అలాంటి మాటలు మోడీ నుంచి ఎన్నడూ వినలేదు. వినిపించలేదు. ఇది ఒక ప్రతిబంధకమైతే.. 10 సంవత్సరాలుగా లేని ఐక్యత.. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలలో కనిపించింది.. ఫలితంగా మోడీ బలం 300 నుంచి 290 కి (అప్పటివరకు ఉన్న ఎన్నికల ఫలితాల ప్రకారం) పడిపోయింది.. వాస్తవానికి ఎన్నికల పరిభాషలో దీనిని ఓటమి అని చెప్పలేం. అలాగని విర్రవీగే విజయం అని సూత్రీకరించలేం. మోటు భాషలో చెప్పాలంటే పైనుంచి కిందికి పడ్డాడు. అంతేతప్ప పూర్తిగా పడిపోలేదు. అలాగని ఓడిపోలేదు. 56 ఇంచుల ఛాతి 48 ఇంచులకు పడిపోయింది.

ముందే చెప్పుకున్నట్టు మోడీ ఓడిపోలేదు. ఇప్పుడు కూడా ఆయనదే అధికార. అతడే ప్రధానమంత్రి. కాకపోతే సంకీర్ణ ప్రభుత్వం. సంకీర్ణ ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నితీష్ కుమార్ తో సహవాసం చేయాలి. చంద్రబాబుతో అంట కాగాలి. షిండే తో అలయ్ బలయ్ చెప్పుకోవాలి. అజిత్ పవర్ మీద ఆధారపడాలి.. కానీ, ఇక్కడే చంద్రబాబు లాంటి నాయకుడికి బిజెపి కంటే కాంగ్రెస్ లోనే దోస్తులు ఎక్కువ.. నితీష్ కుమార్ పరిస్థితి కూడా అంతే. సో అలాంటప్పుడు కీలకమైన నిర్ణయాలు మోడీ తీసుకునేందుకు వీలుపడదు. అడుగడుగునా చిక్కు ముళ్లు ఎదురవుతాయి. స్పీడ్ బ్రేకర్లు అడ్డు తగులుతుంటాయి. ఒకరకంగా దిన దిన గండం నూరేళ్ల ఆయుషు లాగా మోడీ కాలం గడపాలి.

ఇందాక చెప్పినట్టు ఈ ఎన్నికల్లో మోడీ తన స్థాయిని తగ్గించుకున్నాడు. దేవుడు పంపిన మనిషి అంటూ తనను తాను కల్కి లాగా అభివర్ణించుకున్నాడు.. వాస్తవానికి రాజకీయాలలో నేను అనే అహం ఉండకూడదు అంటారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇలానే చెప్పుకొని బోల్తాపడ్డాడు. 2023 ఎన్నికల్లో చంద్రశేఖర రావు ఓడిపోయాడు. మోడీ కూడా అలానే చెప్పుకున్నాడు కానీ.. ఎక్కడో అయోధ్య రాముడు మన్నించి ఉంటాడు. ఈసారికి జాగ్రత్త బిడ్డ అంటూ దీవించి ఉంటాడు.. వాస్తవానికి బిజెపికి హిందీ బెల్టులో అత్యంత ఆశాజనకమైన ఫలితాలు వస్తుంటాయి. కానీ మోడీ ఏక నిరంజన్ వ్యవహారం వల్ల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ బిజెపికి దూరమైందట. అందువల్లే అత్యంత నాసిరకమైన ఫలితాలు వచ్చాయట. ఒడిశా ఆదుకుంది, ఆంధ్రప్రదేశ్ అక్కున చేర్చుకుంది, కర్ణాటక ఉడిపి టిఫిన్ తినిపించింది, తెలంగాణ నెత్తిన పెట్టుకుంది.. లేకపోతే మోడీ పరిస్థితి మరో విధంగా ఉండేది.. అయితే ఇది సంకీర్ణ ప్రభుత్వం.. ఇబ్బంది ఎదురవుతుందని మోడీ ప్రధాని పీఠాన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్లే రకం.. ఎందుకంటే మోడీ కుడి పక్కన అమిత్ షా ఉన్నాడు. అన్నిటికీ మించి ఏదైనా చేయగల గుజరాత్ వ్యాపారులు ఉన్నారు. కాకపోతే కొన్నాళ్లపాటు ఈ దేశం చంద్రాలు సార్, నితీష్, షిండేల గోపి తరహ భాగస్వామ్యాన్ని అనుభవించాల్సిందే. అంతకుమించిన గత్యంతరం మరొకటి లేదు.