KKR Vs RCB (2)
KKR Vs RCB: మన దేశంలో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రికెటర్లను నయా దేవుళ్ళుగా భావిస్తుంటారు. వారు కనిపిస్తే చాలు దేవుళ్లను చూసినట్టుగా అనుకుంటారు.. వారిని ఒక్కసారైనా కలిస్తే బాగుంటుందని కలలు కంటారు. క్రికెటర్లు కూడా మనుషులేననే భావనను మర్చిపోతుంటారు.
Also Read: మొదటి రౌండ్‌లో అన్ సోల్డ్.. ఫస్ట్ మ్యాచ్‌లో అదరగొట్టిన రహానే
ఐపీఎల్ లో అభిమానులు తరచూ నిబంధనలు అతిక్రమించి స్టేడియం లోకి రావడం పరిపాటిగా మారిపోయింది. గత ఐపిఎల్ లో ఇటువంటి సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. క్రికెటర్లను కలవడానికి అభిమానులు వెళ్లడం.. స్టేడియంలోకి ప్రవేశించడం.. తమ అభిమాన ఆటగాళ్లతో సెల్ఫీలు లేదా ఫోటోలు దిగడం.. వారిని హగ్ చేసుకోవడం.. కరచాలనం చేయడం వంటి సంఘటనలు అనేకం జరిగాయి. అలాంటి వాటికి పాల్పడిన అభిమానులను సెక్యూరిటీ గార్డ్స్ లోపలికి తీసుకెళ్లి.. వారిదైన మర్యాద చేసినప్పటికీ అభిమానులు తమ తీరు మార్చుకోవడం లేదు. ఇలా స్టేడియంలోకి అభిమానులు వెళ్లడం.. ఆటగాళ్లను కలవడం వంటి సంఘటనలు సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి.
తాజాగా ఏం జరిగిందంటే..
శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఐపిఎల్ 18వ ఎడిషన్ మొదలైంది. కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ వైపు ఆసక్తి చూపించింది. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ జట్టులో కెప్టెన్ రహానే, సునీల్ నరైన్, రఘు వంశీ మినహా మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టపోయి 174 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని బెంగళూరు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేదించింది. ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో వీరవిహారం చేశాడు. హాఫ్ సెంచరీ చేసి బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతడు మైదానంలో ఉండగా అభిమాని సెక్యూరిటీని దాటుకుని లోపలికి వచ్చాడు. నేరుగా విరాట్ కోహ్లీ వద్దకు వెళ్లి అతని కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేశాడు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకొని లోపలికి తీసుకెళ్లారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా స్టేడియంలో సంచలనం నెలకొంది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ” మైదానంలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఉంటాయి కదా. సెక్యూరిటీ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది కదా. ఇలాంటి సమయంలో ఒక అభిమాని అంత పెద్ద వ్యవస్థను చేదించుకుని లోపలికి వెళ్లాడంటే అవన్నీ కూడా విఫలమైనట్టే కదా.. వేలకోట్లను ప్రతి ఏడాది సంపాదిస్తున్న బీసీసీఐ సెక్యూరిటీ విషయంలో ఇంత నిర్లక్ష్యాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నది. సెక్యూరిటీ కల్పించే విషయంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు.. కొంచమైనా జాగ్రత్తగా ఉండాలి కదా.. విరాట్ కోహ్లీ లాంటి విలువైన ఆటగాడికి కల్పించే భద్రత ఇదేనా.. వేల కోట్లు వెనకేసుకోవడం కాదు ఆటగాళ్లకు భద్రత కల్పించాలి. ఆ విషయాన్ని బీసీసీఐ గుర్తుంచుకోవాలని” విరాట్ అభిమానులు సోషల్ మీడియా వేదిక వ్యాఖ్యానిస్తున్నారు.