Visakha Mayor
Visakha Mayor: గ్రేటర్ విశాఖ( greater Visakha ) మేయర్ పీఠంపై దృష్టి పెట్టింది కూటమి. ఎట్టి పరిస్థితుల్లో చేజిక్కించుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నోటీసులు ఇచ్చారు. కలెక్టర్ వద్దకు వెళ్లి ఈ నోటీసులు అందించారు. ఆయన రేపో మాపో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. అవిశ్వాస తీర్మాన తేదీని ప్రకటించనున్నారు. అన్ని సవ్యంగా జరిగితే మరో వారం రోజుల్లో గ్రేటర్ విశాఖ పీఠంపై కూటమి నేత కూర్చోవడం ఖాయం. కూటమిలోకి పెద్ద ఎత్తున కార్పోరేటర్లు జంప్ చేయడం.. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు ఉండడంతో.. కూటమి బలం అమాంతం పెరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ బలం తగ్గిపోయింది.
* అప్పట్లో ఘన విజయం..
2021 లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో( Municipal Elections ) గ్రేటర్ విశాఖ పీఠాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. 98 డివిజన్లకు గాను 58 డివిజన్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. అయితే ఎన్నికలకు ముందు కొంతమంది కార్పొరేటర్లు పార్టీ మారిపోయారు. ఎన్నికల ఫలితాల అనంతరం సైతం చాలామంది కార్పొరేటర్లు కూటమి పార్టీల వైపు మొగ్గు చూపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బలం 78 కి చేరినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పట్టుమని పాతికమంది కార్పొరేటర్లు కూడా లేరు. అయినా సరే అవిశ్వాస తీర్మానాన్ని ఓడిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శపధం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు తో పాటు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో జీవీఎంసీ పీఠాన్ని నిలబెట్టుకుంటామని ప్రకటించారు.
* పట్టించుకోని కీలక నేతలు..
ఇప్పటికే స్థాయి సంఘ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి( YSR Congress ) ఎదురు దెబ్బ తగిలింది. ఈ తరుణంలో అవిశ్వాస తీర్మానాన్ని ఓడిస్తారనుకుంటే కాస్త అతి అనిపిస్తోంది. పైగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఎవరు అటువైపుగా చూడడం లేదు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, ఆపై మండలి లో విపక్ష నేత బొత్స సైతం ఇది జరిగే పని కాదు అంటూ పక్కకు తప్పుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. కూటమి పార్టీలు సమన్వయంతో ఉన్నాయి. ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ను రంగంలో దించే అవకాశం ఉంది. చివరి ఏడాది కావడంతో అభివృద్ధి పనులు చేపట్టి.. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది కూటమి. కానీ బలం తగ్గిపోయినా.. ఇంకా ధీమాతోనే ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. చూడాలి మరి ఏం జరుగుతుందో.