Blue Banana: అరటిపండు అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది.. పసుపు రంగులో ఉండే పండ్లే. అరటికాయ అనగానే ఆకుపచ్చ రంగులో ఉండే కూర అరటికాయ గుర్తుకు వస్తుంది. ఈ అరటి పండు, అరటి కాయలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే చాలా మంది అరటి పండ్లను ఇష్టంగా తింటారు. కానీ ఈ రెండూ కాకుండా ఇప్పుడు నీలిరంగు అరటిపండ్లు కూడా వచ్చాయి. వీటిని ఎప్పుడైనా చూశారా.. తిన్నారా.. వీటి రుచి మన తినే అరటిపండ్లకన్నా భిన్నంగా ఉంటుంది. టేస్టీగా ఉంటాయి. మరి ఇవి ఎక్కడ దొరుకుతాయి. వాటి రుచి ఎలా ఉంటుంది. వాటితో ప్రయోజనాలు ఏమిటి అనే వివరాలు తెలుసుకుందాం.
బ్లూ జావా బనానా..
నీలిరంగులో ఉండే ఈ అరటిపండ్లను బ్లూ జావా బనానా అని పిలుస్తారు. ఇవి అరటిలో మూసా అక్యుమినాటా, మూసా బాల్సిసియానా అనే హైబ్రిడ్ రకం. ఈ రకమైన అరటి మొక్కలు ఎక్కువగా ఆగ్నేయాసియా, మధ్య అమెరికా, హవాయి దీవుల్లో సాగుచేస్తారు. వీటి తొక్కల్లో ఉండే ఒకరకమైన మైనపు పూత కారణంగా ఇవి కాయ దశ నుంచే నీలం రంగులో కనిపిస్తాయి. ఇవి సాధారణ అరటి రకానికన్నా మరింత మందంగా, క్రీమీగా ఉంటాయి. చిన్నటి నల్లని గింజలు ఉంటాయి.
రుచి ఎలా ఉంటుంది?
నీలి రంగు జావా అరటిపండ్లు సాధారణమైన రుచిని కలిగి ఉంటాయి. ఇవి వెనిలా స్టర్డ్ లేదా వెనిలా ఐస్‌క్రీమ్ రుచిని పోలి ఉంటాయి. అందుకే వీటిని ఐస్‌క్రీమ్ బనానా అని కూడా పిలుస్తారు. అరటిపండు గుజ్జు కూడా మృదువైన క్రీమ్‌లా ఉంటుంది. సహజంగా తయారు చేసిన ఐస్‌క్రీమ్ రుచి, అలగే వీటి ప్రత్యేకమైన రంగు కారణంగా నీలిరంగు జావా అరటిపండ్లను డెజర్ట్‌లు, స్మూతీలలో కలిపి ఆస్వాదిస్తారు.
ప్రయోజనాలు ఇవీ..
ఒక నీలిరంగు అరటిపండు కేవలం 105 కేలరీలు కలిగి ఉంటుంది. అంటే ఐస్‌క్రీమ్ కన్నా చాలా రెట్లు తక్కువ. కాబట్టి ఐస్‌క్రీమ్, స్మూతీస్, కస్టర్డ్ వంటి స్వీట్లను తినడానికి బదులుగా బ్లూ బనానా తింటే మంచి రుచి, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అధిక కేలరీశులు శరీరంలోకి చేరవు. దీంతో బరువు నియంత్రణలో ఉంచుతుంది. ఇక నీలిరంగు అరటిపండులో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా, ఈ అరటిపండులోని ఫైబర్ జీర్ణక్రియ ఆరోగ్యంపై శక్తివంతంగా ప్రభావం చూపుతుంది. పేగుల కదలికలను క్రమబద్ధీకరిస్తుంది. మలబద్ధకం సమస్య ఉండదు. అదనంగా అల్సర్లు, హెమోరాయిడ్స్, గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిప్లక్స్ వ్యాధి వంటి అనేక జీర్ణ వ్యాధులను కూడా నయం చేసే గుణాలు నీలిరంగు అరటిపండుకు ఉన్నాయి.