
Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఆయన వాయిస్ వినిపించడం లేదు. కనీసం మీడియాకు కూడా ఆయన పలకరించడం లేదు. తను తాను శిక్ష విధించుకున్నారా? లేకుంటే వైసీపీ హైకమాండే ఆయన్ను శిక్షించిందా? అన్నది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. విశాఖ వ్యవహారాల నుంచి తప్పించడం నుంచి మొన్నటి సోషల్ మీడియా బాధ్యతల నుంచి తొలగించం వరకూ చూస్తుంటే ఎందుకో పొమ్మన లేకుండా పొగపెడుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే తన స్వరం, వ్యవహారం మార్చుకున్నట్టున్నారు విజయసాయిరెడ్డి. అసలు తాడేపల్లి ప్యాలెస్ వైపు తొంగిచూడడం మానేసిన ఆయన రాజకీయ ప్రత్యర్థులతో ముచ్చటించడం, వారి దగ్గర ఒద్దికగా కనిపిస్తుండడం చూస్తుంటే ఏదో తేడా కొట్టినట్టు మాత్రం కనిపిస్తోంది.
ఇప్పుడు వైసీపీలో చలామణి అవుతున్న నాయకులు కొత్తగా వచ్చిన వారే. కానీ విజయసాయిరెడ్డి మాత్రం జగన్ పార్టీ పెట్టక ముందు నుంచే ఆయన వెంట అడుగులు వేస్తున్నారు. ఆయనతో పాటు జైలు జీవితం అనుభవించారు. జగన్ ప్రతీ నిర్ణయం వెనుక విజయసాయిరెడ్డే కనిపించేవారు. ప్రత్యర్థులను చీల్చిచెండాడే వారు. అటు విజయసాయిరెడ్డిని జగన్ పక్కన పెట్టడం వ్యూహమా? లేక అంతర్గతంగా ఏదో జరిగిందా? అన్నది మాత్రం తెలియడం లేదు.వైసీపీకి మూలస్తంభాల్లో ఒకరైన విజయసాయిరెడ్డిని తప్పించి ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తెస్తున్న జగన్ దాదాపు పక్కనపెట్టినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే విజయసాయిరెడ్డిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో మాదిరిగా ఆయన వెంట మందీ మార్భలం లేదు. కనీసం వైసీపీ నేతలు కలుస్తున్న దాఖలాలు లేవు. అటు ఢిల్లీలో కూడా విజయసాయిరెడ్డి ఒంటరిగానే గడుపుతున్నారు. మొన్నటికి మొన్న జరిగిన ఏపీ గ్లోబల్ సమ్మిట్ కు జాతీయ స్థాయిలో పారిశ్రామిక దిగ్గజాలు వచ్చిన సమయంలో సైతం పార్లమెంటరీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డి సేవలను పెద్దగా సద్వినియోగం చేసుకోలేదు. దీంతో సదస్సుకు హాజరైన చాలా మంది పారిశ్రామికవేత్తలు, బిగ్ షాట్స్ సైతం విజయసాయి కోసం ఆరాతీసినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సమీప బంధువు అరెస్ట్ కావడం ఎపిసోడ్ నుంచి విజయసాయిరెడ్డి దూకుడు తగ్గించారు.
ఢిల్లీలో విజయసాయిరెడ్డి వ్యవహార శైలిపై ఇప్పుడు పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఆయన వ్యవహార శైలికి, ఇప్పటికీ తేడాను ఉదహరిస్తూ వైసీపీ ఎంపీలు కొందరు ఫిర్యాదులు చేస్తున్నారుట. ఒకానొక సమయంలో విజయసాయిరెడ్డి వైసీపీకి ఢిల్లీ సామంతరాజుగా వ్యవహరించేవారు. మొత్తం వైసీపీ వ్యవహారాలన్నీ ఆయన కనుసన్నల్లో నడిచేవి. ఇప్పటికీ బీజేపీతో బంధం కొనసాగించడానికి విజయసాయే కారణమని వైసీపీ వర్గాలు చెబుతుంటాయి. అటువంటి ఆయన ఇటీవల వైసీపీ ఎంపీలను కలిసేందుకు కూడా ఇష్టపడడం లేదు. పైగా ఇప్పటివరకూ వైసీపీకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న పార్టీల నేతలను కలుస్తుండడం హైకమాండ్ కు కలవరపాటుకు గురిచేస్తోంది.

అయితే తనకు వైసీపీ పార్లమెంటరీ నేతగా ఉన్న పదవిని అడ్డంపెట్టుకొని విజయసాయి ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఆ మధ్య ఉప రాష్ట్రపతి జగదీప్ దన్ ఖడ్ నివాసంలో ఆయన వ్యవహరించిన తీరుతో వైసీపీ నేతలు షాక్ కు గురయ్యారట. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ తో చాలా సన్నిహితంగా మెలిగారు. విజయసాయిరెడ్డి భుజంపై చేయి వేసుకొని జైరాం రమేష్ ముచ్చటించారు. విజయసాయిరెడ్డి కూడా ఎంతో ఒద్దికగా,, తనతో ఉన్న వైసీపీ నేతలకు అనుమానం కలిగించే రీతిలో వ్యవహరించారు. దీంతో నాటి విజయసాయిరెడ్డేనా అని అక్కడున్న వారంత గుసగుసలాడుకున్నారు. బీజేపీ ప్రాపకం కోసం పలుమార్లు సోనియా, రాహుల్ ను విజయసాయిరెడ్డి టార్గెట్ చేసుకునేవారు. అనుచిత వ్యాఖ్యలు చేసేవారు.
అటువంటి విజయసాయిరెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో సన్నిహితంగా జరగడం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ దూరం పెట్టిందన్న వార్తలు నేపథ్యంలో అలా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ రెండు వ్యూహాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కు దగ్గరైనట్టు బీజేపీ భావిస్తే జగన్ కు చిక్కుముడి తప్పదు. అలాగే వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తున్న వేళ బీజేపీకి సంకేతం పంపేలా జగన్ విజయసాయిరెడ్డి ద్వారా కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారన్న మరో టాక్ నడుస్తోంది. కానీ ఢిల్లీ వర్గాల్లో మాత్రం వైసీపీ కాంగ్రెస్ కు దగ్గర కానుందన్న ప్రచారం ఊపందుకుంటోంది.