
Pawan Kalyan: సింహం నవ్వింది.. మీరు విన్నది నిజమే. కానీ అది పొలిటికల్ లైన్ పవన్ కళ్యాణ్. ఈ నెల 14న జనసేన పదో ఆవిర్భావ సభ మచిలీపట్నంలో జరగనుంది. సువిశాల 36 ఎకరాల ప్రాంగణంలో వేదిక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పవన్ చేరుకున్నారు. గత మూడు రోజులుగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో బిజిబిజీగా గడుపుతున్నారు. అన్నివర్గాల ప్రజలతో సమావేశమవుతున్నారు. వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. వాటిని నివేదిక రూపంలో తయారుచేసి ఒక ప్రణాళిక రూపొందించనున్నారు. బీసీలు, కాపులు,ఇతరత్రా సామాజికవర్గాల నేతలతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు.
పదో ఆవిర్భావ సభలో బీసీ డిక్లరేషన్ ను ప్రవేశపెట్టనున్నారు. అందుకే పార్టీలతో సంబంధం లేని తటస్థులను ఆహ్వానించారు. ఈ క్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రముఖులు తమ విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా బీసీలకు దగ్గరగా ఉండే కాపులు సంఘటితమైతే రాజకీయ ప్రభంజనం సృష్టించవచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. సమాజంలో 50 శాతం ఉన్న బీసీలు, అగ్రవర్ణాల్లో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కాపులు –60 శాతం కలిపితే రాజ్యాధికారం సొంతమవుతుందని చెప్పిన వారూ ఉన్నారు. అందరి అభిప్రాయాలను తెలుసుకున్న పవన్ ప్రత్యేక పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అయితే బీసీల సాధికారిత కోసం పోరాడుతున్న ఓ వ్యక్తి కీలక సూచనలిచ్చారు. సామాజిక సమస్యల పరిష్కరానికి కృషిచేస్తున్న పవన్ గొప్పతనాన్ని వివరించారు. సమస్యల పరిష్కరానికి అధికార పక్షానికో.. ప్రతిపక్షానికో కలుస్తారని.. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువ మంది పవన్ ను కలుస్తున్నారని గుర్తుచేశారు. అయితే ఈ క్రమంలో వెనుకబడిన వర్గాల వారిని గుర్తించింది ప్రజారాజ్యం పార్టీయేనని చెప్పుకొచ్చారు. మహాత్మ జ్యోతీరావు పూలేతో పాటు కొందరు వెనుకబడినవర్గాలకు చెందిన మహనీయులకు వెలుగుబాట కల్పించింది ప్రజారాజ్యమేనని గుర్తుచేశారు. అయితే ఆయన జనసేన పేరు చెప్పే క్రమంలో పదేపదే ప్రజారాజ్యం పేరు ప్రస్తావనకు తీసుకురావడంతో పవన్ నవ్వు ఆపుకోలేకపోయారు. దీంతో జన సైనికులు ఈలలు, గోలతో ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ట్రోల్ ఆఫ్ దీ డే గా నిలిచింది.
https://www.youtube.com/watch?v=jd_iTLCGovs