
AP MLC Elections Polling: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో పట్టభద్రులు మూడు, రెండు ఉపాధ్యాయులు, నాలుగు స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 16న కౌంటింగ్ జరగనుంది. నాలుగు పట్టభద్రుల స్థానాలకు 10,00,519 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 1172 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు గాను 55,842 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 351 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీలకు గాను 3,059 మంది ఓటర్లు ఉన్నారు. వీరు ఓటు వేసే వీలుగా రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు.
అయితే అధికార పార్టీ అటు ఉపాధ్యాయ, ఇటు పట్టభద్రుల సీట్లలో పోటీచేస్తుండడంతో ఎక్కడికక్కడే అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దొంగ ఓట్ల నమోదుతో పాటు విపక్షాల సానుభూతిపరుల ఓట్లు తొలగించారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్షన్ ప్రధాన అధికారి స్పందించారు. చేర్పులు, మార్పులు, అభ్యంతరాలకు అవకాశమిచ్చామని గుర్తుచేశారు. ఎన్నికలు సజావుగా జరిపిస్తామని చెప్పారు. అయితే ఉదయం పోలింగ్ ప్రారంభం నుంచి చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి, ఎక్కడికక్కడే అధికార వైసీపీ నేతలు దూకుడుగా వ్యవహరించడంతో వివాదాలు జరిగాయి. అనంతపురంలో బీజేపీ నేతలు నిరసన తెలిపారు. వైసీపీ దొంగ నోట్లు వేయిస్తోందని.. దానికి అధికారులే సహకరిస్తున్నారంటూ ఆరోపించారు. కడప జిల్లా ప్రొద్టుటూరులో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు లాఠీచార్జి చేశారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.తిరుపతి, నెల్లూరులో వివాదాలు కొనసాగాయి.

ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల సరళిని తెలుసుకున్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేసిందని.. ఓట్లు తొలగించి దొంగ దెబ్బతీసిందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్ పూర్తయ్యాక దీనిపై ప్రణాళిక రూపొందించడానికి నిర్ణయించారు. సాయంత్రం 4.30 గంటల వరకూ సమయం ఉన్నందున పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు.
అయితే పట్టభద్రులు, ఉపాధ్యాయుల స్థానాలతో పోల్చుకుంటే స్థానిక సంస్థల ఓటింగ్ శరవేగంగా ఉంది. , మొత్తం 9 స్థానిక సంస్థల అభ్యర్థులకు ఎన్నికల నోటిఫికేషన్ జారీకాగా.. అందులో ఐదుచోట్ల కేవలం వైసీపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. దీంతో అనంతపురం స్థానిక సంస్థల స్థానం నుంచి ఎస్ మంగమ్మ, కడప స్థానిక సంస్థల స్థానం నుంచి రామసుబ్బారెడ్డి, నెల్లూరు స్థానిక సంస్థల స్థానం నుంచి మేరిగ మురళీధర్, తూర్పుగోదావరి స్థానిక సంస్థల స్థానం నుంచి కుడుపూడి సూర్యనారాయణరావు, చిత్తూరు స్థానిక సంస్థల స్థానం నుంచి నుంచి సుబ్రమణ్యం సిపాయి మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు నియోజకవర్గాలు, కర్నూలులో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ వైసీపీకి స్పష్టమైన మెజార్టీ ఉండడంతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే పార్టీ ఆదేశాల మేరకు ఉదయం 11 గంటలకే దాదాపు స్థానిక సంస్థల పోలింగ్ పూర్తయ్యింది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి పోలింగ్ మందకొడిగా సాగింది. గ్రాడ్యుయేట్స్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇది గెలుపుపై ప్రభావం చూపిస్తుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. రెండో ప్రాధాన్యత ఓటు విషయంలో టీడీపీ, వామపక్షాలు అవగాహనకు రావడంతో అధికార పార్టీ మద్దతు దారులు కలవరపడుతున్నారు. అయితే ఉపాధ్యాయ స్థానాల్లోమాత్రం పోలింగ్ ఉదయం నుంచే మోస్తరుగా ఉంది. ప్రభుత్వ విధానాలపై ఉపాధ్యాయులు వ్యతిరేకంగా ఉన్న తరుణంలో అధికార పార్టీ ఇప్పటికే ఆశలు వదులుకుంది. అందుకే ప్రలోభాలకు తెరతీసినట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి.