AP Politics: అమరావతి( Amaravathi ) మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసు తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో సాక్షి టీవీ యాంకర్, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. సాక్షి మీడియాలో డిబేట్లో అమరావతిలో వేశ్యలు అంటూ జర్నలిస్ట్ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే యాంకర్ హోదాలో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు దానిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. సమర్ధించినట్టుగా వ్యాఖ్యానించడంతో వివాదం మరింత ముదిరింది. రాజధాని మహిళల ఫిర్యాదుతో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు జరిగింది. అయితే తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఈసారి వైయస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పై డిజిపి కి ఫిర్యాదు చేశారు. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read Also: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
* పిశాచులతో పోల్చిన వైనం..
సాక్షి యాంకర్, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ( Kommineni Srinivasa Rao ) అరెస్ట్ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అయితే ఈ ఘటన నేపథ్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను పిశాచులు, రాక్షసులు అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా సంకర తెగ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. నిరసనలు చేసిన తెగ ఆర్గనైజ్డ్ గా ఉన్న సంకర తెగ అంటూ సజ్జల అనడం ఇప్పుడు సంచలనం గా మారింది. గత రెండు రోజులుగా అమరావతి రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారిచ్చిన ఫిర్యాదుతోనే కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు జరిగింది. అయితే అమరావతి మహిళా రైతుల నిరసనను ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడం మాత్రం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.
* డిజిపి కి ఫిర్యాదు
తాజాగా ఈ ఘటనపై స్పందించారు రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు( deputy speaker raghurama Krishna m Raju) . ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. కుల వివక్షకు సంబంధించిన పదప్రయోగం చేస్తూ.. సజ్జల దూషణలకు దిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అమరావతి లోని వేలాదిమంది మనోభావాలను దెబ్బతీశారని… సజ్జలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు. భవిష్యత్తులో అలాంటి అవమానకర భాషను ఎవరూ వాడకుండా చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణం రాజు కోరారు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి పై కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది. అయితే వరుసగా అమరావతి రైతుల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న కామెంట్స్ వివాదాస్పదంగా మారుతున్నాయి. మరోవైపు జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర బిజెపికి కమిషన్ చైర్ పర్సన్ విజయ రహత్కర్ లేఖ రాశారు. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని బిజెపిని ఆదేశించింది. అమరావతి ఉద్యమంలో మహిళా రైతులు కీలక పాత్ర పోషించారని మహిళా కమిషన్ స్పష్టం చేసింది. మొత్తానికి అయితే అమరావతి మహిళలను కించపరిచిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై చర్యలు తప్పేలా లేవు.