HomeజాతీయంAhmedabad Plane Crash Report: అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కారణం అది కాదా? ఏఏఐబీ ప్రాథమిక...

Ahmedabad Plane Crash Report: అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కారణం అది కాదా? ఏఏఐబీ ప్రాథమిక నివేదిక తప్పా? కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో సంచలనం..

Ahmedabad Plane Crash Report: అహ్మదాబాద్ లో ఇటీవల విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో చాలామంది ప్రయాణికులు కన్నుమూశారు. దేశ విమానయాన చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదాలలో ఇది ఒకటిగా మిగిలింది. ప్రమాదం జరిగిన తర్వాత దీనిపై విచారణకు ఆదేశిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ప్రాథమిక నివేదిక ఇచ్చింది.

Also Read: ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

ఈ నివేదిక వెలుగులోకి వచ్చిన తర్వాత జాతీయ మీడియా సంస్థలు, ప్రాంతీయ మీడియా సంస్థలు రకరకాల కథనాలను వండి వార్చడం మొదలుపెట్టాయి. ఈ కథనాలు తమకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయని.. ఎయిర్ లైన్స్ పైలట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఎల్ఎఫ్ఏ) ఖండించింది..”పైలెట్ లేకుండా అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఏఐబీ నివేదిక ఎలా ఇస్తుంది? పైలెట్లు లేకుండా విచారణ ఎలా చేస్తారు? విచారణ జరిగిన తీరు బాగోలేదు. నివేదికలో వివరాలు తప్పుల తడక మాదిరిగా ఉన్నాయి. ప్రమాదం మొత్తానికి పైలెట్లదే తప్పు అనే దీర్ఘ ధోరణి ఉంది.. మీడియాకు ఈ నివేదిక ముందుగానే ఎలా లీక్ అయింది? ఈ నివేదికపై ఏ అధికారి సంతకం కూడా లేదు. దర్యాప్తులో పారదర్శకత ఉన్నట్టు కల్పించడం లేదు. గోప్యంగా జరగాల్సిన ఈ ప్రక్రియ బయటికి రావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. లైన్ పైలెట్లు (షెడ్యూల్డ్ ఫ్లైట్లు నడిపేవారు) దర్యాప్తులో భాగం కాకపోవడం దారుణమని” ఏఎల్ఎఫ్ఏ అధ్యక్షుడు థామస్ పేర్కొన్నారు..” విమానం లో ఇంజన్ కు సంబంధించిన ఇంధన స్విచ్ లలో అనుకోకుండా కదలికలు ఏర్పడ్డాయి. అందువల్ల ఈ దుర్ఘటన జరిగిందని వాల్ట్ జర్నల్ లో ఓ కథనం ప్రసారమైంది. ఇటువంటి సున్నితమైన సమాచారం మీడియాకు ఎలా లీక్ అవుతుంది.. దర్యాప్తు పారదర్శకంగా జరగాలి అనుకుంటే కచ్చితంగా తమను అందులో భాగం చేసుకోవాలని” థామస్ వెల్లడించారు.

మరోవైపు ఈ నివేదిక మీడియాకు లీక్ కావడం.. రకరకాల కథనాలు ప్రసారం కావడంతో.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు..” ప్రపంచంలో అత్యంత శిక్షణ పొందినపైలట్లో మన వద్ద ఉన్నారు. సిబ్బంది కూడా అత్యంత ప్రతిభ ఉన్నవారు. దేశ విమానయాన రంగానికి వారు వెన్నెముకలాగా ఉన్నారు. ఈ రంగానికి వనరులుగా వారు కొనసాగుతున్నారు. వారి సంక్షేమం.. శ్రేయస్సుకోసం కచ్చితంగా పాటుపడతాం. ప్రభుత్వం దానికోసం కృషి చేస్తుంది. తుది నివేదిక విడుదల కాకుండా ప్రమాదంపై ఒక నిర్ధారణకు రావడం సరికాదు. ఈ కేసు అత్యంత జటిలమైనది. ఈ కేసులో ఎన్నో సాంకేతికపరమైన అంశాలు ఉన్నాయి. అందుకే ఈ కేసు పై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు చర్య అవుతుందని” రామ్మోహన్ నాయుడు అన్నారు.. ఏఏఐబీ 15 పేజీలతో ప్రాథమిక నివేదికను సమర్పించిన తర్వాత మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.. మరోవైపు ఈ కేసు దర్యాప్తుకు తాము సహకరిస్తామని బోయింగ్ సంస్థ వెల్లడించింది. తమ దానికి గురైన విమానానికి సంబంధించిన సమాచారం మొత్తం దర్యాప్తు అధికారులకు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని బోయింగ్ బాధ్యులు వెల్లడించారు.

ప్రమాదం జరిగి చాలా రోజులు గడుస్తున్నప్పటికీ.. దర్యాప్తు సంస్థ విచారణ సాగిస్తున్నప్పటికీ.. ప్రాథమిక నివేదిక బయటకు విడుదలైనప్పటికీ.. ఇప్పటివరకు ఈ ఘటనపై స్పష్టమైన సమాచారం బయటకు రావడం లేదు. ప్రమాదానికి కారణం ఏంటనే విషయం ఇంతవరకు బయటపడలేదు. పక్షి ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని మొదట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇంజన్లు ఫెయిల్ అయ్యాయని మరి కొన్ని కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ప్రాథమిక నివేదిక లీకైన తర్వాత కూడా.. ప్రమాద విషయంలో ఒక అంచనాకు రావద్దని.. తుది నివేదిక రావాలని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించడం విశేషం. మరి ఈ ప్రమాదంపై తుది నివేదిక ఎప్పుడు వస్తుంది? వివరాలు ఎప్పుడు తెలుస్తాయి? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular