Kota Srinivasarao Passed Away: ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఆదివారం తెల్లవారుజామున ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి అందరికి తెలిసిందే..
కోట శ్రీనివాసరావు స్వగ్రామం కృష్ణాజిల్లా లోని కంకిపాడు. ఆయన 1942 జులై 10న జన్మించారు. 1968లో రుక్ష్మిణిని వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అయన కుమారుడు కోట ప్రసాద్ 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో కన్ను మూసారు. కోట శ్రీనివాసరావు తన కొడుకు లేని లోటుతో తీవ్రమైన మనస్తాపానికి గురైనారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎంతో గర్వించ దగ్గ దిగ్గజ నటులలో ఒకరు కోట శ్రీనివాస రావు. ఎస్వీ రంగారావు లాంటి మహానటుడు తర్వాత, మళ్ళీ అలాంటి నటుడిని చూస్తామా అని అనుకుంటున్న రోజుల్లో కోట శ్రీనివాస రావు ఆయన లేని లోటుని పూడ్చాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు. 1978 వ సంవత్సరం లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా నటించిన ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో కోట శ్రీనివాస రావు వెండితెర అరంగేట్రం చేశాడు. ఆ సినిమా హిట్ అవ్వడంతో కోట కి అవకాశాలు క్యూ కట్టాయి. 1979 వ సంవత్సరం లో నాలుగు సినిమాలు, 1980 లో ఏకంగా 13 సినిమాలు చేశాడు. అయితే ఆయన కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఏదైనా ఉందా అంటే అది జంధ్యాల దర్శకత్వం లో తెరకెక్కిన ‘అహనా పెళ్ళంట’ అనే చిత్రం.
రాజేంద్ర ప్రసాద్ హీరో గా నటించిన ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు పరమ పీనాసి వ్యక్తిగా నటించి అద్భుతమైన మార్కులు కొట్టేసాడు. ఈ చిత్రం తర్వాత నుండి ఏడాదికి 20 నుండి 30 సినిమాలు చేసే స్థాయికి వెళ్ళాడు కోట శ్రీనివాస రావు. కమెడియన్ గా , విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకు సాటి మరెవ్వరు లేరు అనిపించేలా చేసుకున్నాడు. కామెడీ తో కడుపుబ్బా నవ్వించడం, భయంకరమైన విలనిజం పండించడమే కాదు, ప్రేక్షకుల చేత వెక్కిళ్లు పెట్టి ఏడ్చేలా సెంటిమెంటల్ సన్నివేశాల్లో కూడా నటించగలడు. అందుకే కోట శ్రీనివాస రావు లెజెండ్ అయ్యాడు. ఆయన సినిమాల్లో నటించని లోటు ఇప్పటికే స్పష్టంగా మన అందరికీ తెలుస్తూనే ఉంది. ఇప్పుడు ఆయన స్వష్టంగా మనకి దూరం అవ్వడం జీర్ణించుకోలేని విషయం. ఆయన నటించిన చివరి చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ నెల 24 న గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది.
తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఎటువంటి పాత్రనైనా అవలీలగా నటించగలిగిన అతికొద్ది మంది లో కోట గారు కూడా ఒకరు. ఆయన లేని లోటు ఆయన కుటుంబానికి తీర్చలేనిది. అయన ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిద్దాం.. విలక్షణ నటుడికి శ్రద్ధాంజలి.