Jagan Illegal Assets Case:ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అక్రమాస్తుల విషయంలో విచారణ వేగంగా సాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలం వరకు కూటమి నేతలు కాస్త సమయమనం పాటించారు. అదును కోసం ఎదురు చూశారు. మొత్తానికి పని మొదలుపెట్టారు.
జగన్ అక్రమాస్తుల కేసులో గతంలో విచారణలు జరిగాయి.. అయితే ఇందులో రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు జగన్ కేసుల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీనికి తోడు నాడు జగన్ అక్రమాస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొన్నవారు ఆయన ప్రభుత్వంలో కీలక శాఖలలో పనిచేశారు. ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో.. జగన్ హయాంలో అక్రమాలకు పాల్పడిన అధికారుల మీద వేటు మొదలైంది. ఆ తర్వాత రకరకాల కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమాలను రాష్ట్ర దర్యాప్తు సంస్థలు బయటపెట్టాయి. వాటి విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇది ఇలా ఉండగానే జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఇటీవల కాలంలో జగన్ అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణ చేపడతామని కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. దాన్ని మర్చిపోకముందే విచారణలో వేగాన్ని పెంచాయి. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఏర్పాటు చేసిన కంపెనీలకు పెట్టుబడులు వరదలా వచ్చాయి. వీటికి సంబంధించి అప్పట్లోనే అభియోగాలు నమోదయ్యాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆధారాలు కూడా సహకరించాయి. ఇప్పుడు రోజువారి విచారణ మొదలు పెట్టాయి. ఈ సమయంలో శనివారం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండియా సిమెంట్స్ కేసులో డిశ్చార్జి పిటిషన్ల పై విచారణ పూర్తయింది. ఇప్పటివరకు సిబిఐ దాఖలు చేసిన ఆరు చార్జి సీట్లలో.. పిటిషన్ మీద విచారణ పూర్తయింది ఇక భారతి సిమెంట్స్ కు సంబంధించిన కేసులో పిటిషన్ల పై విచారణ ప్రారంభమైంది. సిబిఐ.. ఈడీ కేసులలో రోజువారీ విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు దాదాపు 45 డిశ్చార్జి పిటిషన్ లపై విచారణ పూర్తయింది. జగన్.. విజయసాయిరెడ్డి.. బీపీ ఆచార్య.. అయోధ్య రామిరెడ్డి.. ధర్మాన ప్రసాదరావు.. మోపిదేవి వెంకటరమణ.. నిమ్మగడ్డ ప్రసాద్ వంటి వారి డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. వీటన్నిటిమీద సిబిఐ కోర్టు ఒకేసారి ఆదేశాలు వెలువరిస్తుంది.
మొన్నటిదాకా వైసిపి నేతల మీద రకరకాల కుంభకోణాలు.. అనేకరకాల అవినీతి వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో కొన్ని అరెస్టులు కూడా చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా మద్యం కుంభకోణంలో జగన్ వైపు అన్ని వేళ్లూ చూపిస్తున్నాయి. ఇప్పుడు అక్రమాస్తుల వ్యవహారంలో కూడా విచారణ వేగం కావడంతో మరింత ఇబ్బందికరమైన పరిస్థితి జగన్ కు తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.