Vijay Government: ఆ ఇల్లు మొత్తం సందడిగా ఉంది. బంధువులు.. కుటుంబ సభ్యులు హడావిడి చేస్తున్నారు. అంతటి ఉత్సాహం మధ్య ఆ బాలిక తన ఏడవ పుట్టినరోజు జరుపుకుంది. రాత్రి తన తల్లి పక్కన నిద్రపోయింది. తెల్లవారి చూసేసరికి కనిపించలేదు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల వెతికారు. బావులు, చెరువులు, పొలాలు కొండ ప్రాంతాలు మొత్తం గాలించారు. వందల ఫోన్ నెంబర్లు పరిశీలించారు. అయినప్పటికీ చిన్నారి ఆచూకీ లభించలేదు. చివరకు ఈ కేసును CB CID కి అప్పగించడంతో మిస్టరీ మరింత పెరిగింది. ఈ చిన్నారి అదృశ్యం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది.
ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం జిల్లాలో సంజీ సమీపంలోని అలంపుడి ప్రాంతంలో జరిగింది. హేమలత అనే బాలిక ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతోంది. అక్టోబర్ 11న కుటుంబ సభ్యులు ఆమె ఏడవ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఆ రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి చిన్నారి నిద్రపోయింది. అక్టోబర్ 12న తెల్లవారుజామున కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఇంటి పరిసరాలలో వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఆ చిన్నారి ఎటు వెళ్ళింది.. ఇంటి నుంచి బయటకు వెళ్లిందా.. లేదా ఎవరైనా తీసుకెళ్లారా.. ఇంకా ఏదైనా ఘోరం జరిగిందా.. ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇప్పటివరకు లభించలేదు. స్థానిక పోలీసులు బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. ఆ గ్రామంలో గృహాలు.. వ్యవసాయ పొలాలు.. బావులు.. చెరువులు.. కొండ ప్రాంతాలలో పోలీసులు గాలించారు. చివరికి స్నిఫర్ డాగ్స్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు..
దర్యాప్తులో భాగంగా ఘటన జరిగిన రాత్రి.. తెల్లవారుజామున ఈ ప్రాంతంలోని మొబైల్ టవర్ల పరిధిలో నమోదైన సుమారు 600 అనుమానాస్పద కాల్ రికార్డులను పరిశీలించారు. గ్రామం నుంచి బయటికి వెళ్లే మార్గాలలోని కెమెరాల ఫుటేజ్ లను పరిశీలించారు. కుటుంబ సభ్యులు.. బంధువులు.. పొరుగు వారిని ప్రశ్నించారు. అయినప్పటికీ కేసులో కీలకమైన ఆధారం లభించలేదు.
స్థానిక పోలీసుల దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో తమిళనాడు డీజీపీ మహేష్ కుమార్ అగర్వాల్ అక్టోబర్ 21న ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ సీఐడీ కి బదిలీ చేశారు. అక్టోబర్ 22 నుంచి అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులో సీబీసీఐడీ రంగ ప్రవేశం చేయడంతో కొత్త ఆధారాలు లభిస్తాయని స్థానికులు భావించారు. చిన్నారి ఇంటి పరిసరాలను మరోసారి అధికారులు పరిశీలించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులను విచారించారు. గతంలో సేకరించిన సమాచారాన్ని మళ్లీ పరిశీలించారు.
హేమలత అక్కకు వివాహం నిశ్చయమైంది. ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులను కూడా అధికారులు విచారిస్తున్నారు. పుట్టినరోజు నాడు చిన్నారికి కేక్ తీసుకొచ్చిన వ్యక్తి నుంచి కూడా వివరాలు సేకరించారు. చిన్నారిని ఎవరైనా అపహరించారా.. ఆమెను మరో ప్రాంతానికి తీసుకెళ్ళారా.. కుటుంబానికి తెలిసిన వ్యక్తుల ప్రమేయం ఏదైనా ఉందా.. అనే కోణాలలో దర్యాప్తు సాగుతోంది.
ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ చిన్నారి ఆచూకీ లభించలేదు. ఒక చిన్నారి కనిపించకుండా పోయిన ఘటన ఇప్పుడు కుటుంబానికి పరిమితమైన సమస్యగా లేదు. ఏపీలో కూడా తుని ప్రాంతంలో ఒక బాలిక ఇలానే తప్పిపోయింది. ఇంతవరకు ఆమె ఆచూకీ లభించలేదు. పోలీసులు అన్ని రకాలుగా దర్యాప్తు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు తమిళనాడులో కూడా ఈ బాలిక ఆచూకీ ఇంతవరకు లభించలేదు. అయితే ఈ కేసులో కీలక ఆధారాలు ఏంటి.. ఫోన్ కాల్స్.. సీసీటీవీ దృశ్యాలు ఏదైనా కొత్త పురోగతిని చూపిస్తాయా.. సి బి సి ఐ డి విచారణలతో చిన్నారి ఆచూకీ లభిస్తుందా.. ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది.