HomeజాతీయంABN RK : ఆర్కే కొత్త పలుకు: బిజెపికి "రిటర్న్ సమర్థన్ సంపర్క్"

ABN RK : ఆర్కే కొత్త పలుకు: బిజెపికి “రిటర్న్ సమర్థన్ సంపర్క్”

ABN RK : ఆ మధ్య అమిత్ షా తెలంగాణ రావాలి అనుకున్నారు. ఖమ్మంలో భారీ బహిరంగ సభలో పాల్గొనాలి అనుకున్నారు. తెలంగాణలో పెద్ద పెద్ద వ్యక్తులను కలవాలి అనుకున్నారు. అందులో ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ కూడా ఒకడు. దానికి అమిత్ షా పెట్టుకున్న పేరు “సమర్ధన్ ఫర్ సంపర్క్.” అయితే గుజరాత్ లో ఏర్పడిన తుఫాను అమిత్ షా టూర్ ను అడ్డుకుంది. దానికి కారణాలు ఏమైనప్పటికీ.. మొత్తానికి బిజెపి అప్పటి నుంచే డైలామాలో పడింది. ఇప్పటివరకు కూడా కోలుకోలేదు. ఇక ముందు కోలుకుంటుదన్న గ్యారెంటీ కూడా లేదు. అధ్యక్షుడి మార్పు నుంచి జితేందర్ రెడ్డి ఫామ్ హౌస్ రాజకీయాల వరకు ఇలా రకరకాల అవలక్షణాలతో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని మించిపోయింది. ఇలాంటి సమయంలో ఏ మీడియా హౌస్ అయినా భారతీయ జనతా పార్టీని ఎండగట్టడం కామన్. అయితే తెలుగు నాట మీడియా ఓనర్లలో డిఫరెంట్ క్యారెక్టర్ అయిన వేమూరి రాధాకృష్ణ ఒక అడుగు ముందుకేశాడు. గత కొంతకాలంగా తన పేపర్, చానల్లో బిజెపిని ఏకిపారేస్తున్నాడు. కాంగ్రెస్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. ప్రతివారం తన పత్రికలో కొత్త పలుకు పేరిట వర్ధమాన రాజకీయాల గురించి రాసుకొచ్చే రాధాకృష్ణ.. ఈసారి భారతీయ జనతా పార్టీకి “రిటర్న్ సమర్ధన్ సంపర్క్” ఇచ్చేశాడు.
భారతీయ జనతా పార్టీ మెరుగుపడాలి
రాధాకృష్ణ జర్నలిజం లో ఉండే బ్యూటీ ఏంటంటే చంద్రబాబు నాయుడి ప్రస్తావన లేకుంటే అలవోకగా రాయగలడు. ఎలాగైనా రాయగలడు. అయితే అది ప్రశంసలు దక్కించుకుంటుంది. లేకుంటే విమర్శలు మూటగట్టుకుంటుంది. అంతేగాని మిగతా పత్రికల మాదిరి దోబూచులాట ఉండదు. ఈ ఆదివారం కొత్త పలుకులో రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపి ఎలాంటి తప్పులు చేసిందో ఉదాహరణలతో సహా వేమూరి రాధాకృష్ణ రాసుకొచ్చాడు. ఆఫ్ కోర్స్ గత కొంతకాలంగా తన పత్రికలో రాసిన వార్తలనే ఇక్కడ ఉటంకించాడు. తెలంగాణలో బండి సంజయ్ ని మార్చడం, కిషన్ రెడ్డిని మళ్లీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టడం ఘోర తప్పిదమని ఆర్కే తేల్చి పడేశాడు. దీని వల్ల బిజెపి నేతల్లో నైతిక స్థైర్యం తగ్గిపోయిందని, ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీపై నమ్మకం కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆర్కే రాసుకొచ్చాడు. అకస్మాత్తు మార్పులతో భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితితో అంట కాగుతున్నట్టు కనిపిస్తోందని రాధాకృష్ణ రుజువులతో సహా వివరించాడు. కేంద్ర దర్యాప్తు సంస్థలు వెనుకంజ వేయడం, కవిత కేసుల విషయంలో చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని రాధాకృష్ణ స్పష్టం చేశాడు. అయితే ఈ వ్యాసంలో ఎక్కడా కూడా బిజెపి, భారత రాష్ట్ర సమితి ఒప్పందానికి వచ్చిందని నేరుగా చెప్పలేదు. ఒకవేళ ఇలాంటి వాతావరణం ఏర్పడితే అంతిమంగా అది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చుతుంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మళ్లీ పుంజుకోవాలి అంటే దర్యాప్తు సంస్థల సాయం కావాల్సిందేనని ఆర్కే తేల్చి పడేశాడు.
పురందేశ్వరి విషయంలో..
ఇక ఏపీ రాజకీయాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి నియామకం తనకు అర్థం కాలేదని ఆర్కే చెప్పుకొచ్చాడు. సోము వీర్రాజు తొలగింపులో ఇప్పటికీ ఆలస్యం చేశారన్న రాధాకృష్ణ.. ఒకరకంగా భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి చురకలంటించాడు. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్సిపి తో అంట కాగుతోందని ఆరోపించాడు.. ఇది సరైన రాజకీయ విధానం కాదని వేలెత్తి చూపాడు. కానీ తన రాజ గురువు చంద్రబాబునాయుడు మాత్రం 2018 వరకు బిజెపితో అంటకాగాడు. తర్వాత కాంగ్రెస్ తో స్నేహ హస్తం చాచాడు. ఇది మాత్రం రాధాకృష్ణకు గుర్తుకురాదు. అప్పట్లో ఇదే ఆర్కే తన పేపర్, చానెల్ ద్వారా ఇచ్చిన కవరింగ్ ఏంటంటే “ఏపి ప్రయోజనాలు”. ఇలాంటి శిఖండి రాజకీయాలు చేశారు కాబట్టే కదా ఏపీ ప్రజలు తెలుగుదేశం పార్టీని “23” దగ్గర కూర్చోబెట్టింది. అయితే తాజా తన కొత్త పలుకు వ్యాసం లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో నిలబడాలంటే తెలుగుదేశం వైపు ఉండాలని రాధాకృష్ణ సూచించాడు. గత ఎన్నికల్లో వైసీపీకి సహకరించినట్టే..ఈ ఎన్నికల్లో టిడిపికి సహకరించాలని సలహాలిస్తున్నాడు. తెలంగాణ విషయంలో చర్నాకోలు పట్టుకొని బిజెపిని విమర్శించిన రాధాకృష్ణ.. ఏపీ విషయానికి వచ్చేసరికి ఒంటికి పసుపు రంగు పూసుకొని పోతురాజు మాదిరి ఎగరడం ప్రారంభించాడు. మొత్తానికైతే రాధాకృష్ణ తెలంగాణలో తన సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకే అని తన రాతల ద్వారా చెప్పేస్తున్నాడు. ఈ వ్యాసాన్ని చూసైనా భారతీయ జనతా పార్టీ తన రాజకీయ అడుగులు మార్చుకుంటుందా? ఒకవేళ అమిత్ షా తెలంగాణకు వస్తే, తనను కలిస్తే రాధాకృష్ణ వాయిస్ లో ఏమైనా తేడా వస్తుందా? ఈ ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి.
Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular