Kerala: వ్యక్తిగత శుభ్రత పాటిస్తే దేహం బాగుంటుంది. పరిసరాల పరిశుభ్రత పాటిస్తే సమాజం బాగుంటుంది. అయితే మనలో చాలామందికి దేహం మీద ఉన్న ఆసక్తి పరిసరాల మీద ఉండదు. అందుకే చాలామంది తమ ఇంట్లో ఉన్న చెత్తను రోడ్లమీద అడ్డగోలుగా వేస్తూ ఉంటారు. వాడుకునే దిండ్ల నుంచి కూర్చునే సోపాల వరకు మురికి కాల్వలో వేస్తూ ఉంటారు. ఫలితంగా మురుగునీరు మొత్తం రోడ్డు మీదనే ప్రవహిస్తూ ఉంటుంది. దాని మీదుగా ప్రయాణించేవారు నరకం చూడాల్సి ఉంటుంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇదే పరిస్థితి. స్వచ్ఛభారత్ అనే పథకం ప్రవేశపెట్టినప్పటికీ జనాల్లో కొంచమైనా మార్పు రాలేదు. అయితే దీనికి పరిష్కార మార్గం కనుగొనేందుకు కేరళ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయిననూ మార్పు రాలేదు
కేరళ అంటే.. ఎవరికైనా పర్యాటక స్వర్గధామం గుర్తుకు వస్తుంది. ఎగిసిపడే అరేబియా సముద్రం అలలు.. భూమికి పచ్చటి కోక చుట్టినట్టు ఉండే కొబ్బరి చెట్లు.. నోరూరించే చేపల కూర.. ఇలా చెప్పుకుంటూ పోతే కేరళ రాష్ట్రం ఒక పట్టానా వర్ణనకు అందదు. అయితే అలాంటి కేరళ రాష్ట్రాన్ని 2018లో వరదలు కనివిని ఎరగని స్థాయిలో చుట్టుముట్టాయి. నదులు ఉప్పొంగాయి. డ్యాములలో నీళ్లు ఊళ్లను ముంచెత్తాయి. ఆ నీటి తాకిడికి కొట్టుకు వచ్చిన చెత్తతో కేరళ రాష్ట్రం మొత్తం డంపింగ్ యార్డ్ లాగా మారిపోయింది. ఆ చెత్తను తగలబెట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అప్పట్లో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి.. అయితే అప్పటి పరిస్థితి చూసి కూడా కేరళ వాసులు మారలేదు.
తలనొప్పి వ్యవహారం
రోజురోజుకు కేరళలో పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో చెత్త భారీగా పేరుకు పోతోంది.. ఇందులో రకరకాల వ్యర్ధాలు ఉంటున్నాయి. ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో “ఈ వ్యర్ధాలు” కూడా ఇందులో ఉన్నాయి. ఈ క్రమంలో తమ వినియోగించగా మిగిలిన వస్తువులను ప్రజలు రోడ్లమీద పారేస్తున్నారు. కొందరైతే పాలిథిన్ కవర్లలో చెత్తను వేసి నడిరోడ్డు మీద పారేస్తున్నారు. కొచ్చి నుంచి త్రివేండ్రం వరకు ఇదే పరిస్థితి నెలకొంది. మొదట్లో ఈ చెత్తను మొత్తం శుభ్రం చేసిన మున్సిపాలిటీ సిబ్బంది.. ఇక ఇప్పుడు తమ వల్ల కాదు అని చేతులెత్తేస్తున్నారు. దీంతో నగరాలు, పట్టణాలు కంపు కొడుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఒక వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా చెత్తను ఎవరైనా రోడ్లమీద వేస్తే ఆ వివరాలు మున్సిపాలిటీ సిబ్బందికి చెప్పాలని సూచించింది. పూర్తి ఆధారాలతో మున్సిపాలిటీ వారికి సమాచారం చేరవేరిస్తే వారికి 2,500 క్యాష్ రివార్డు ప్రకటించింది. అంతేకాదు మున్సిపాలిటీకి వివరాలు అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ప్రకటించింది. చెత్తను నడిరోడ్డు మీద వేసినందుకు గానూ అపరాధ రుసుము కూడా విధిస్తామని స్పష్టం చేసింది. దీనివల్ల ప్రజల్లో సామాజిక బాధ్యత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పనిలో పనిగా స్వచ్ఛభారత్ లక్ష్యం కూడా నెరవేరుతుందని చెబుతోంది. అయితే ఇది ఎంతవరకు విజయవంతం అవుతుందో తెలియదు గానీ.. ప్రస్తుతానికైతే ఈ విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
View this post on Instagram