Ayodhya Ram Mandir: ‘అయోధ్యలో దివ్య రామ మందిరంలో భవ్య రాముడు కొలువుదీరాడు. ఎన్నో త్యాగాలు, బలిదానాల తర్వాత మన శ్రీరాముడు అయోధ్యకు చేరుకున్నారు. దశాబ్దాల భారతీయుల కల నెరవేరింది. రామ భక్తులందరికీ నా శుభాకాంక్షలు. బాల రాముడి ప్రాణ ప్రతిష్టలో పాల్గొనడం నా అదృష్టం. 2024, జనవరి 22 కొత్త కాలచక్రానికి ప్రతీక. ఇది విగ్రహ ప్రతిష్ట కాదు.. మన దేశ గౌరవం. రాముడు ఉన్నచోట హనుమంతుడు ఉంటాడు’ అని ప్రధాని నరేంద్రమోదీ అయోధ్యలో ఎమోషనల్ ప్రసంగం చేశారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభించిన ఆనందం మోదీ ప్రసంగంలో స్పష్టంగా కనిపించింది.
అభిజిత్ లగ్నంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట.
భారతీయుల ఐదు శతాబ్దాల కల నెరవేరింది. అయోధ్య రామ మందిరంలో మేషలగ్నం, అభిషత్ ముహూర్తంలో జనవరి 22(సోమవారం) మధ్యాహ్నం 12:32:29 సెకన్లక బాల రాముడు కొలువుదీరాడు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రామ్ లల్లాకు ప్రాణ ప్రతిష్ట జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ బాల రాముడికి ప్రాణ ప్రతిష్ట గావించారు. అంతకు ముందు రామ్ లల్లాకు మోదీ పట్టు వస్త్రాలు, వెండి ఛత్రి తీసుకుని వచ్చారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుందరంగా అలంకరించిన బాల రాముడిని, అపురూప దివ్య స్వరూపాన్ని ఆవిష్కరించారు. రామ్ లల్లా దివ్య స్వరూపాన్ని తిలకించి యావద్ దేశం పులకించిపోయింది. నీలి కళ్ల రాముడు.. బంగారు ఆభరణాలతో అలంకారితుడై దర్శనమిచ్చాడు. 84 సెకన్లలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట పూర్తి చేశారు.
పూజలో ప్రముఖులు
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట పూజలు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. బాల రాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాణ ప్రతిష్ట అనంతరం బాల రాముడికి ప్రధాని మోదీ 108 హారతులతో హారతి ఇచ్చారు. అర్చన చేశారు. నైవేద్యాలు సమర్పించారు. తాను తీసుకువచ్చిన పట్టు వస్త్రాలు, వెండి ఛత్రిని కూడా బాల రాముడికి సమర్పించారు.
మోదీ భావోద్వేగ ప్రసంగం
రామాలయంలో పూజా కార్యక్రమాల అనంతరం నరేంద్రమోదీ ఆలయ ప్రాంగణంలో ఉన్న అతిథులను, సాధువులను ఉద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేశారు. ఐదు శతాబ్దాల స్వప్నం సాకారమైందన్నాడు. మన రాముడు అయోధ్యకు వచ్చాడని తెలిపారు. ఇక బాల రాముడు టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదన్నారు. రామ మందిర నిర్మాణం పూర్తయిందని, ఇక దేశ నిర్మాణంపై దృష్టిపెడతామన్నారు. మోదీ స్వయంగా జై శ్రీరామ్ అంటు నినదించారు. అయోధ్యలో అపూర్వ ఘట్టంలో తాను భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
38 వేల కిలోల పూల వర్షం..
ఇదిలా ఉండగా బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు ముందు అయోధ్య రామాలయంపై హెలిక్యాప్టర్లతో పూల వర్షం కురిపించారు. 38 వేల కిలోల పూలను ఇందుకోసం వినియోగించారు. మరోవైపు అయోధ్య రామాలయ అలంకరణకూ టన్నుల కొద్దీ పూలను వినియోగించారు.
50 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం..
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని 50 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. దాదాపు గంటపాటు అపురూప ఘట్టాన్ని హిందువులు వీక్షించారు. న్యూయార్క్ టైమ్స్ స్వేర్‌పైనా బాల రాముని ప్రాణ ప్రతిష్ట వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేశారు.