Railways Install CCTV: రైలు ప్రయాణాన్ని సుఖవంతం చేయడంతోపాటు సురక్షితంగా ఉంచేందుకు భారత రైల్వే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటోంది. ఇకెట్ బుకింగ్ సులభతరం చేసింది. రైలు ఆలస్యం తగ్గించింది. తాజాగా సురక్షిత ప్రయాణానికి సీసీ కెమెరాలను అందుబాటులోకి తెచ్చింది. అయితే.. ఇండియన్ రైల్వే టెక్నాలజీపై చూపుతున్న శ్రద్ధ.. ప్రయాణికుల ఇబ్బందులపై పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
Also Read: ఏపీకి అవార్డుల పంట.. హస్తకళలు, ఆహార ఉత్పత్తులకు అరుదైన గుర్తింపు!
భారతీయ రైల్వే వ్యవస్థలో ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 74 వేల ప్యాసింజర్ బోగీలు, 15 వేల లోకోమోటివ్‌లలో అత్యాధునిక కెమెరాలను అమర్చే నిర్ణయం, ఉత్తర రైల్వేలో నిర్వహించిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో తీసుకోబడింది. ఈ చర్య దోపిడీలు, దాడుల వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంతో పాటు, ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందించనుంది. ఉత్తర రైల్వే విభాగంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సత్ఫలితాలను ఇచ్చాయి. ఈ పైలట్ ప్రాజెక్టు ఫలితాలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు సమీక్షించి, దేశవ్యాప్తంగా అన్ని బోగీలు, లోకోమోటివ్‌లలో కెమెరాలను అమర్చాలని నిర్ణయించారు.
భద్రతకు హామీ..
సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా రైలు ప్రయాణంలో భద్రతా సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చని రైల్వే అధికారులు భావిస్తున్నారు. బోగీలలో దొంగతనాలు, వ్యవస్థీకృత ముఠాల ఆగడాలను నిరోధించడంలో ఈ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రయాణికుల ప్రైవసీని గౌరవిస్తూ, కెమెరాలను బోగీల ద్వారాల వద్ద మాత్రమే ఏర్పాటు చేయనున్నారు.
ఈ సమస్యలు ఎన్నాళ్లు..
రైళ్లలో టెన్నాలజీ ప్రవేశపెట్టడంపై చూపుతున్న భారత రైల్వే ప్రయాణికుల సౌకర్యాలపై చూపడం లేదు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచే మన దేశంలో రైల్వే వ్యవస్థ ఉంది. కానీ, నేటికీ సమస్యలు ఉన్నాయి. కనీసం ప్రయాణికులకు సరిపడా భోగీలు లేవు. దీంతో చాలా మంది ఇబ్బందికరంగానే ప్రయాణిస్తున్నారు. భారీగా ఆదాయం వస్తున్నా అదనపు భోగీలు ఏర్పాటు చేయడం లేదు. ముంబై, ఢిల్లీ, కోల్‌కత్తా లాంటి నగరాల్లో లోకల్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు ఇప్పటికీ కిక్కిరిసి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. రైలు భోగీలు చాలక, ప్రయాణికులు డోర్ల దగ్గర వేలాడిన దృశ్యాలు నిత్యం కనిపిస్తాయి. ఇక పండుగల సమయంలో అయితే అన్ని రైళ్ల పరిస్థితీ ఇదే.
శుభ్రత అంతంతే..
ఇక భారతీయ రైళ్లు అపరిశుభ్రతకు నిలయాలు అన్న అపవాదు ఉంది. ప్రయాణికుల భోగీలు కంపు కొట్టడమే ఇందుకు కారణం. ప్రయాణికులు కూడా ఇష్టానుసారం ఉమ్మివేయడం, చెత్త చెదారం వేయడం కారణంగా భోగీలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. దీనిపై ప్రయాణికులకు అవగాహన కల్పించడం, అపరిశుబ్రతకు కారణమైన వారికి జరిమానా విధించడం లాంటివి చేయాల్సిన అవసరం ఉంది.
యాచకులతో ఇబ్బంది..
ఇక రైళ్లలో యాచకులు ప్రయాణికులకు పెద్ద తలనొప్పిగా మారారు. ముఖ్యంగా హిజ్రాలు రైళ్లలో ప్రయాణికులలాగా ఎక్కి… యాచన పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. బెదిరిస్తున్నారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఈ సమస్యపైనా రైల్వే దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.