National Handicraft Award 2025: జాతీయస్థాయిలో ఏపీ పేరు మరోసారి మార్మోగింది. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది ఏపీ. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు అవార్డులు వచ్చాయి. చేనేత, హస్తకళల విభాగంలో ఈ ఘనత సాధించింది ఏపీ. మరోవైపు వ్యవసాయ రంగానికి రెండు, అంతర్ రాష్ట్ర విభాగానికి మరో అవార్డు దక్కింది. ఇలా ఏకంగా 10 అవార్డులను దక్కించుకోవడం విశేషం. ‘వన్ నేషన్ వన్ ప్రోడక్ట్’ విభాగంలో భాగంగా ఈ పది అవార్డులు దక్కాయి. ఈరోజు ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ అవార్డులు స్వీకరించనున్నారు. జాతీయ స్థాయిలో ఎంపికైన మూడు రాష్ట్రాలలో ఏపీ ఒకటి కావడం విశేషం. కాగా అవార్డులు దక్కించుకున్న చేనేత హస్తకళలకు సంబంధించిన విభాగాలు ఇవి..
Also Read: ఏపీకి కొత్త నేషనల్ హైవే.. ఆ జిల్లాలకు మహర్దశ!
* బొబ్బిలి వీణ : బొబ్బిలి వీణకు మరో జాతీయ గౌరవం లభించింది. ఇది పురాతనమైన హస్తకళ. రాజుల కాలం నుంచి తరతరాలుగా సాగుతున్న ఈ హస్తకళ ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి సుపరిచితం కానుంది. బొబ్బిలి వీణ సరస్వతి వీణగా ప్రసిద్ధిగాంచింది. ఈ వాయిద్యాన్ని అంతర్జాతీయంగా కూడా గౌరవంగా చూస్తారు. పనసతోపాటు సంపంగి చెక్కలతో ఈ వీణను తయారు చేయడం విశేషం. ఇక్కడ దొరికే గిఫ్ట్ వీణలకు కూడా విశేష ఆదరణ ఉంది. అతిథులకు బహుమతులుగా వీటిని అందజేస్తుంటారు. బొబ్బిలి వీణ ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక గౌరవాలను సంపాదించింది.
* ఏటికొప్పాక బొమ్మలు : ఏటికొప్పాక బొమ్మలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. విశాఖ జిల్లా ఏటికొప్పాకలో తయారయ్యే ఈ లెక్క బొమ్మలకు నాలుగు శతాబ్దాల చరిత్ర ఉంది. వరాహ నది పక్కన ఉండే ఓ చిన్న గ్రామం ఏటికొప్పాక. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక కళాకారుడు ఉంటారు. అంకుడు కర్రతో సహజ రంగులను ఉపయోగించి మనసుకు హత్తుకునే కళాఖండాలను తయారు చేస్తారు. చింతలపాటి వెంకటపతి రాజు అనే కళాకారుడు 1990లో రసాయన రంగుల స్థానంలో సహజరంగులను వాడడం ప్రారంభించాడు. అప్పటినుంచి ఈ బొమ్మలకు సహజ రంగులే వాడుతున్నారు. ఎక్కడ పదునైన అంచులు ఈ బొమ్మలకు ఉండవు. బొమ్మలన్నీ గుండ్రని ఆకారం చేస్తారు. పూలతోపాటు చెట్ల బెరడు ల నుంచి చేసిన రంగులనే వాడతారు. ఏటికొప్పాక బొమ్మ చేయడం అంటే ఓ జీవికి ప్రాణం పోసినంత పని అంటారు అక్కడి కళాకారులు. అందుకే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ లో భాగంగా ఈ బొమ్మలకు గుర్తింపు లభించింది.
* పెద్దాపురం సిల్క్: పెద్దాపురంలో పట్టు పరిశ్రమకు పెట్టింది పేరు. ఇక్కడ తయారు అయ్యే సిల్క్ ధోటీలకు మంచి గుర్తింపు ఉంది. దీనిని వేష్టి, ముండు పంచ అని కూడా పిలుస్తారు. ఇది స్వచ్ఛమైన సిల్క్. కార్మికులు మల్బరీ సిల్క్ నూలు నువ్వు ఉపయోగించి చేనేత వస్త్రం పై నేస్తారు. ఈ ప్రాంతంలో అందమైన పట్టు చీరలను సైతం రూపొందిస్తారు.
* చీరాల సిల్క్ : చీరాల సిల్క్ సైతం జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ఈ ప్రాంతంలో మగ్గాలపై నేసే ఈ చీరలు చాలా ప్రాచుర్యం పొందాయి. సంప్రదాయ మగ్గాలపై నేసిన కుప్పడం చీరలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద ఎంపిక చేసింది.
* వెంకటగిరి చీరలు : నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి చేనేత చీరలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇవి విశిష్ట జరీ రూపకల్పన వల్ల ప్రజాదరణ పొందాయి. సంప్రదాయ మగ్గాల ద్వారా వీటిని నేస్తుంటారు. శతాబ్దాల చరిత్ర దీని సొంతం. నెల్లూరు వెలుగు గోటి రాజవంశం నాటి నుంచి ఈ చీరలు ప్రసిద్ధికెక్కినట్లు తెలుస్తోంది.
* ధర్మవరం చీరలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. దీనికి ప్రత్యేక గుర్తింపు కూడా లభించింది. భౌగోళిక గుర్తింపు చట్టం 1999 ప్రకారం దేశంలోనే గుర్తింపు చిహ్నాల జాబితాలో చోటు దక్కించుకుంది. ధర్మవరంలో పట్టు చీరలు తయారు చేసే 1500 కుటుంబాలు ఉంటాయి. లక్ష మగ్గాలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. లక్ష కుటుంబాల వరకు ఉపాధి పొందుతుంటాయి.
* నరసాపురం మండలం సీతారాంపురం లోని లేసు పార్కుకు అరుదైన గౌరవం లభించింది. ఇక్కడ లభించే లేసు ఉత్పత్తులకు వన్ డిస్ట్రిక్.. వన్ ప్రోడక్ట్ కింద ఎంపికయింది. ఇక్కడ మొత్తం ఈ పరిశ్రమను నడిపించేది మహిళలే. కనీసం అక్షర జ్ఞానం లేని వారు కూడా ఇక్కడ పనిచేస్తుంటారు. అద్భుత కళాఖండాలను తీర్చిదిద్దుతుంటారు.