
లాక్ డౌన్ కారణంగా మీటర్ రీడింగ్ లెక్కించకుండానే వినియోగదారులు విద్యుత్ బిల్లులు చెల్లించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్, మే నెలల బిల్లుల్ని ఇలాగే చెల్లించారు. గతేడాది ఇదే నెలలో ఎంత బిల్లు వచ్చిందో అంత మొత్తాన్ని ప్రొవిజనల్ బిల్లుగా చెల్లించారు. ఇకపై ఎప్పట్లాగే కరెంట్ బిల్లుల్ని జారీ చేసేందుకు తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్-టీఎస్ఎస్‌పీడీసీఎల్ ఏర్పాట్లు చేస్తోంది. అంటే ఎప్పట్లాగే కరెంట్ బిల్లులు చెల్లించొచ్చు. అయితే ఏప్రిల్, మే నెలల మీటర్ రీడింగ్ ఎలా లెక్కిస్తారన్న సందేహాలు వినియోగదారుల్లో ఉన్నాయి. తక్కువ యూనిట్స్ వాడినా ఎక్కువ బిల్లు చెల్లించడం లేదా ఎక్కువ యూనిట్స్ వాడి తక్కువ బిల్లు చెల్లించడం లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఏప్రిల్, మే నెలల మీటర్ రీడింగ్ ను అడ్జెస్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ బిల్లును ఏ పద్ధతిలో లెక్కిస్తారు? ఎక్కువ చెల్లించినవారికి రీఫండ్ ఏ విధంగా అడ్జెస్ట్ చేస్తారు? తక్కువ చెల్లించినవారి నుంచి ఎలా వసూలు చేస్తారో తెలుసుకోండి.
ముందుగా మీటర్ లో మార్చి నుంచి ఇప్పటి వరకు అంటే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎన్ని యూనిట్స్ ఉపయోగించారో లెక్కిస్తారు. ఉదాహరణకు ఓ ఇంట్లో మూడు నెలల్లో 600 యూనిట్స్ కరెంట్ వాడారనుకుందాం. మొత్తం యూనిట్లను మూడు నెలలతో భాగిస్తారు. అంటే 600/3 చేస్తారు. 200 యూనిట్స్ వస్తుంది. ఇది యావరేజీ బిల్లు. దీని ప్రకారం మూడు ఒరిజినల్ బిల్లులు వస్తాయి. అంటే 200 యూనిట్ల చొప్పున లెక్కించి మూడు బిల్లుల్ని ఇస్తారు. మూడు ఒరిజినల్ బిల్లుల టోటల్ ఎంతో లెక్కిస్తారు. ఇక ఇప్పటికే రెండు ప్రొవిజనల్ బిల్లులు కట్టేశారు కాబట్టి ఆ రెండు ప్రొవిజనల్ బిల్లుల మొత్తాన్ని మూడు బిల్లుల మొత్తం నుంచి తీసేస్తారు. ఒకవేళ మీరు ఇంకా ప్రొవిజనల్ బిల్లులో ఎక్కువ చెల్లించి ఉంటే తర్వాతి నెలలో వచ్చే బిల్లులో అడ్జెస్ట్ చేస్తారు. ఒకవేళ ఇప్పటికీ బిల్లులు చెల్లించనివారు మూడు బిల్లుల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ మీటర్ రీడింగ్, బిల్లుల జారీ మొదలవుతుంది. మరోవైపు కరోనా వైరస్ భయాల్లో ప్రజల్లో ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు తీసుకుంటున్నారు టీఎస్ఎస్‌పీడీసీఎల్ అధికారులు. మీటర్ రీడింగ్ నమోదు చేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు ధరిస్తారు. శానిటైజర్లు ఉపయోగిస్తారు. సిబ్బంది ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లినప్పుడు శానిటైజర్ ఉపయోగిస్తారు.