“సింధు”.. ప్రపంచంలో ఘనతకెక్కిన నాగరికతల్లో ఒకటి. ఐదు వేల సంవత్సరాల క్రితం విరాజిల్లిన ఈ నాగరికతలో ఎన్నో విశిష్టతలు. ఆ ప్రజల జీవన విధానం, నిర్మాణ కౌశలం, ప్రకృతి ఆరాధన, ఆహారపు అలవాట్లు.. ఇలా అన్నీ ప్రత్యేకమే. అయితే.. పాఠ్యాంశాల్లో పొందుపరిచిన “సింధూ ప్రజల ఆహారపు అలవాట్లు” అనే అంశంలో.. వారు పండించిన ఆహార ధాన్యాలు, ఇతర ఉత్పత్తుల గురించే ప్రధానంగా ఉంది. తాజా పరిశోధనల్లో మాత్రం వారి మాంసాహార అలవాట్లు వెలుగు చూశాయి.
Also Read: తొలి భారతీయులు వీళ్లే.. డీఎన్ఏ రిపోర్ట్!
వాసన చూపిన మట్టి పాత్రలు..
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని ఆర్కియాలజీ విభాగంలో పీహెచ్‌డీ చేసిన అక్ష్యేతా సూర్యనారాయణ్ ఆధ్వర్యంలో సింధు ప్రజల ఆహారపు అలవాట్లపై అధ్యయనం చేశారు. సింధు లోయలో దొరికిన కుండ పెంకుల్లోని ఆహార అవశేషాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు .. ఆ కాలంలో మాంసాహరాన్ని ఆరగించేవారని తేల్చారు. ఇక్కడి ప్రజల్లో అధికశాతం గొడ్డు మాంసం, గేదె, మేక మాంసాలను విరివిగా తినేవారని నిర్ధారించారు.
గతంలో పంటల గురించే..
“సింధు ప్రజల ఆహారపు అలవాట్ల గురించి చర్చ వస్తే.. వారు పండించిన పంటల గురించే మాట్లాడేవారు. కానీ.. వారు పండించిన పంటలతోపాటు.. అప్పటి జంతువులు, ఆహారంకోసం వారు ఉపయోగించిన పాత్రలు.. వీటన్నిటినీ పరిశీలిస్తే తప్ప వారి ఆహారపు అలవాట్ల గురించి సమగ్రమైన సమాచారం లభించదు” అనే ప్రతిపాదన ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ప్రజలు ఉపయోగించిన పింగాణీ పాత్రల్లో జంతువుల కొవ్వు అవశేషాలను గుర్తించారు. అక్కడ దొరికిన అనేక మట్టి, పింగాణీ పాత్రల అవశేషాలపై లిపిడ్ రెసిడ్యువల్ పరీక్షలు జరుపగా.. వారు మాంసాహరం ఎక్కువగా తీసుకునేవారనే నిర్ధారణ అయ్యింది. వాయువ్య భారతదేశంలోని (ప్రస్తుత హరియాణా, ఉత్తరప్రదేశ్) పట్టణ, పల్లె ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువగా మాంసాహారం మీదే ఆధారపడేవారని తేలింది. ఈ అధ్యయన ఫలితాలు ‘లిపిడ్ రెసిడ్యూస్ ఇన్ పోటరీ ఫ్రమ్ ది ఇండస్ సివిలైజేషన్ ఇన్ నార్త్‌వెస్ట్ ఇండియా’ పేరుతో ‘జర్నల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సైన్స్’లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన అక్ష్యేతా ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని సీఈపీఈఎంలో పోస్ట్ డాక్టరల్ ఫెలోగా ఉన్నారు.
పంట ఉత్పత్తులు..
ప్రపంచవ్యాప్తంగా.. పురాతన ప్రజలు ఆహారంకోసం ఉపయోగించిన పాత్రలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సింధు లోయలోనూ పరిశోధించారు. ప్రజలు బార్లీ, గోధుమ, వరి, తృణధాన్యాలు, శెనగలు, బఠాణీలు, పప్పులు పండించేవారని గతంలోనే తేలింది. ఇవే కాకుండా, దోసకాయ, వంకాయ లాంటి కూరగాయలు, పళ్లు, పసుపు, జనపనార, పత్తి, నువ్వులు, ఆవాలు వంటి నూనె గింజెలు సాగు చేసేవారని శాస్త్రవేత్తలు తేల్చారు.
పశు సంపద..
ఇక, జంతువుల విషయానికొస్తే పశువులను ఎక్కువగా పెంచేవారని తెలుస్తోంది. ఇక్కడ జరిపిన పురావస్తు తవ్వకాల్లో 50% నుంచీ 60% ఆవులు, గేదెల ఎముకలు బయటపడగా.. 10% మేకలు, గొర్రెల ఎముకలు బయటపడ్డాయి. “దీన్నిబట్టి సింధులోయలోని ప్రజలు గొడ్డు మాంసానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని తెలుస్తోంది” అని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. ఇవే కాకుండా.. పందుల ఎముకలు, జింకలు, పక్షులు, చేపల అవశేషాలు కూడా కొద్ది స్థాయిలో బయటపడ్డాయి. పాడి అవసరాలకు పశువులను మూడున్నర సంవత్సరాలవరకూ పెంచేవారు. ఎద్దులను వ్యవసాయానికి ఉపయోగించేవారు. పందుల ఎముకలు బయటపడినప్పటికీ వాటి ఇతర అవసరాలు ఏమిటో స్పష్టంగా తెలియలేదు.
Also Read: ‘పెళ్లికాని ప్రసాద్’ ల బాధ ఇదీ!
172 కుండపెంకుల సేకరణ..
ఈ అధ్యయనం కోసం ప్రస్తుత హరియాణాలోని సింధు లోయ తవ్వకాల స్థలానికి ఆనుకొని ఉన్న ఆలమ్‌గిర్‌పూర్, మసూద్‌పూర్, లోహారీ రాఘో, కనక్, ఫర్మానాలలో తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో మొత్తం 172 మట్టి, పింగాణీ పాత్రల పెంకులను సేకరించారు. మట్టి పాత్రల నాళాల అంచులపై ప్రత్యేక శ్రద్ధపెట్టారు. ఆహారాన్ని ఉడికించేటప్పుడు పాత్ర అంచులవరకూ పొంగి పేరుకోవడం సహజం. పాత్ర అంచులపై ఉన్న ఆహార అవశేషాలలో ఉన్న కొవ్వు నమూనాలను సేకరించారు. వీటిని పరిశీలించి అవి ఏ జంతువుకు చెందిన కొవ్వు పదార్థాలో గుర్తించారు.
అధ్యయన ఫలితాలు ఇవే..
* కుండ పెంకులపై దొరికిన ఆహార అవశేషాల్లో పాల ఉత్పత్తులు, మాంసాహారంతో పాటూ మొక్కలకు సంబంధించిన ఆహారపు ఆనవాళ్లు కూడా కనిపించాయి. బహుశా మొక్కలు, మాంసం కలిపి వండుకుని ఉండొచ్చని ఈ అధ్యయనం చెబుతోంది.
* ఈ ప్రాంతాల్లో క్షీరదాల అవశేషాలు అధికంగా బయటపట్టినప్పటికీ, మట్టి పాత్రల్లో పాల ఉత్పత్తుల అవశేషాలు చాలా తక్కువగానే కనిపించాయి. అయితే, ఇటీవల ఒక అధ్యయనంలో గుజరాత్‌లోని పురావస్తు తవ్వకాల్లో లభించిన పాత్రల్లో పాల ఉత్పత్తుల జాడలు ఎక్కువగా కనిపించాయి. దీన్నిబట్టి ఆ ప్రాంతాల్లో పాల ఉత్పత్తులను ఎక్కువగా వినియోగించేవారని ఈ అధ్యయనాల్లో తేలింది.
* గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వినియోగంలో కూడా భేదం లేదని ఈ అధ్యయనాల్లో తేలింది. అలాగే, ఈ పాత్రలను ఆహారానికి మాత్రమే కాకుండా ఇతర అవసరాలకు కూడా వినియోగించినట్లు తెలుస్తోంది.
సింధు వివరాలు మరిన్ని…
* సింధు లోయ నాగరికతకు సంబంధించిన మరికొన్ని వివరాలను పరిశీలిస్తే.. సింధు లోయ నాగరికత ప్రస్తుత పాకిస్తాన్, వాయువ్య భారతదేశం, ఉత్తర భారతదేశం, అఫ్ఘనిస్తాన్‌లోని ప్రాంతాలలో విస్తరించి ఉండేది. ఇది అతి ప్రాచీన నాగరికత. ఈ ప్రాంతాల్లోని లోయలు, మైదానాలు, పర్వత ప్రాంతాలు, ఎడారులు తీర ప్రాంతాలలో సింధు నాగరికత విస్తరించి ఉండేది.
* క్రీ.పూ. 2,600 నుంచి క్రీ.పూ. 1,990 మధ్య కాలంలో నగరాలు, పట్టణాల నిర్మాణంతో సింధు నాగరికత బాగా అభివృద్ధి చెందింది. దీనినే హరప్పా నాగరికతగా అభివర్ణిస్తారు. ఐదు పెద్ద నగరాలు, అనేక పట్టణాలు ఈ కాలంలో నిర్మించారు.
Also Read: ఏలూరు నగరంపై కాలుష్యం పడగ.. పట్టించుకోకపోతే పెనుముప్పు..?
* ఈ కాలంలో వస్తుమార్పిడి వ్యవస్థ ఉండేది. అంటే.. మన వద్ద బియ్యం ఉన్నాయి. ఇతరుల వద్ద గోధుమలు ఉన్నాయి. అప్పుడు.. ఒక కొలత ప్రకారం మార్చుకునేవారు. ఈ వ్యవస్థ ద్వారా అందరికీ అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉండేవి.
* క్రీ.పూ 2,100 బీసీ తరువాత, సింధు నాగరికతలోని పశ్చిమ ప్రాంతాలు వెనకబడిపోయి, తూర్పు ప్రాంతాలు అభివృద్ధి చెందడం మొదలైంది.
* క్రీ.పూ 2,150 తరువాత సింధు నాగరికత పతనం ప్రారంభమయ్యింది. దీనికి ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ.. వర్షాలు లేకపోవడం, కరువు కాటకాలు ప్రబలడం వంటి కారణాలతో సింధు నాగరికత అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
భవిష్యత్ పరిశోధనలకు ఊతం..
ఈ సింధు లోయలో వెలువడిన ఫలితాల ద్వారా.. దక్షిణ ఆసియా ప్రాంతాలలో మరిన్ని తవ్వకాలు చేపడతామని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. ఈ మట్టి పాత్రలను సంగ్రహించడం ద్వారా క్రీస్తు పూర్వం దక్షిణ ఆసియాలోని ఆహారపు అలవాట్లను మరింత సమగ్రంగా తెలుసుకోగలుగుతామని అక్ష్యేయ అభిప్రాయపడ్డారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Indus valley civilization diet had dominance of meat
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com