కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల గతంతో పోలిస్తే ఆదాయం తగ్గడంతో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రజల కొనుగోలు శక్తి భారీగా తగ్గినా నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం భగ్గుమంటున్నాయి కూరగాయల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్యులు కిలో కొనుగోలు చేయడానికి బదులుగా అరకిలోనే కొనుగోలు చేస్తున్నారు. చికెన్, మటన్ ధరలు సైతం గతంతో పోలిస్తే భారీగా పెరుగుతున్నాయి.
అయితే వీటన్నింటితో పోలిస్తే మనం ఎక్కువగా వినియోగించే వంటనూనె ధర సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ ధరలు గడిచిన రెండు నెలల్లో ఏకంగా 15 నుంచి 30 శాతం పెరగడం గమనార్హం. ధరల్లో పెరుగుదలే తప్ప తగ్గుదల నమోదు కావడం లేదు. దీంతో వంటనూనె పేరు చెబితేనే సామాన్యులు ఉలిక్కిపడే పరిస్థితి నెలకొంది.
మన దేశం సాధారణంగా ఇతర దేశాల నుంచి పామాయిల్ ను దిగుమతి చేసుకుంటుంది. అయితే లాక్ డౌన్ వల్ల ఇతర దేశాలు ధరను భారీగా పెంచడంతో మన దేశంలో సైతం ధరలు పెరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పెరుగుతున్న వంట నూనె ధరలకు పరిష్కారం చూపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. పెరుగుతున్న నూనె ధరలు సామాన్యులపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.
మస్టర్డ్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ ధరలు కూడా పెరగడం గమనార్హం ధరలు పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు సైతం టిఫిన్లు, భోజనాల రేట్లు పెంచాలని యోచిస్తున్నారు. కరోనా, లాక్ డౌన్ సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఆర్థికపరమైన సమస్యలు చుట్టుముట్టడానికి కారణమవుతూ ఉండటం గమనార్హం.