https://oktelugu.com/

గ్రేటర్‌‌ హైదరాబాద్‌.. గ్రేట్‌ హిస్టరీ..

హైదరాబాద్‌లో ప్రస్తుతం గ్రేటర్‌‌ ఫైట్‌ నడుస్తోంది. మహానగర పాలక సంస్థలో ఎన్నికల సందడి నెలకొంది. పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఒకరికి ఒకరు సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ముఖ్యంగా అధికార టీఆర్‌‌ఎస్‌, బీజేపీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాన్ని రసవత్తరంగా మార్చుతున్నారు. మనం ఇంతవరకు గ్రేటర్‌‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు అంటూ చదువుతున్నాం. కానీ.. అసలు గ్రేటర్‌‌ కార్పొరేషన్‌ ఎలా ఏర్పడింది..? ఎప్పుడు ఏర్పడింది..? దాని చరిత్ర ఏంది..? మొదటి మేయర్‌‌ ఎవరు..? […]

Written By:
  • NARESH
  • , Updated On : November 22, 2020 10:03 am
    Follow us on

    హైదరాబాద్‌లో ప్రస్తుతం గ్రేటర్‌‌ ఫైట్‌ నడుస్తోంది. మహానగర పాలక సంస్థలో ఎన్నికల సందడి నెలకొంది. పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఒకరికి ఒకరు సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ముఖ్యంగా అధికార టీఆర్‌‌ఎస్‌, బీజేపీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాన్ని రసవత్తరంగా మార్చుతున్నారు. మనం ఇంతవరకు గ్రేటర్‌‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు అంటూ చదువుతున్నాం. కానీ.. అసలు గ్రేటర్‌‌ కార్పొరేషన్‌ ఎలా ఏర్పడింది..? ఎప్పుడు ఏర్పడింది..? దాని చరిత్ర ఏంది..? మొదటి మేయర్‌‌ ఎవరు..? ఇలాంటి అంశాలు చాలావరకు ఎవరికీ తెలియవు. ఒకసారి ఆ చరిత్ర తెలుసుకుందాం..

    Also Read: టీఆర్ఎసోళ్లు మాయ చేశారే!

    * మున్సిపాలిటీ టూ కార్పొరేషన్‌..
    1869లో నిజాం ప్రభుత్వం తొలిసారి మున్సిపాలిటీ వ్యవస్థను తీసుకొచ్చింది. హైదరాబాద్‌, ఛాదర్‌ఘాట్‌ను రెండు మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసింది. అప్పట్లో హైదరాబాద్‌లో నాలుగు, ఛాదర్‌ఘాట్‌లో ఐదు డివిజన్లు ఉండేవి. నిజాం సామ్రాజ్యంలో ప్రధానమంత్రిగా పనిచేసిన సాలార్‌జంగ్‌-1 ఈ రెండు మున్సిపాలిటీలకు మున్సిపల్‌ కమిషనర్లను నియమించారు. 1886లో ఛాదర్‌ఘాట్‌ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారింది. ఆ సమయంలో 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్‌ మున్సిపాలిటీలో 3.5 లక్షల జనాభా మాత్రమే ఉండేది. 1921లో ఇదే హైదరాబాద్‌ 84 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. జనాభా కూడా బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో 1933లో ఛాదర్‌ఘాట్‌ కార్పొరేషన్‌ను హైదరాబాద్‌ మున్సిపాలిటీలో కలిపి ‘హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌’ ఏర్పాటు చేశారు. 1934లో తొలిసారి ఈ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించారు. 1937లో జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ఏరియాలను కలిపి జూబ్లీహిల్స్‌ మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. 1942లో పలు కారణాల వల్ల హైదరాబాద్‌ మున్సిపాలిటీకి కార్పొరేషన్‌ హోదాను రద్దు చేశారు. ఆ తర్వాత 1945లో సికింద్రాబాద్‌ మున్సిపాలిటీ ఏర్పాటైంది. అయితే.. 1950లో సికింద్రాబాద్‌కు కార్పొరేషన్‌ హోదా కల్పించడంతోపాటు జూబ్లీహిల్స్‌ మున్సిపాలిటీని హైదరాబాద్‌ మున్సిపాలిటీలో కలిపి తిరిగి కార్పొరేషన్‌ హోదా కల్పించారు. 1951 నుంచి 1954 వరకు హైదరాబాద్‌ కార్పొరేషన్‌కు మాడపాటి హనుమంతరావు తొలి మేయర్‌గా పనిచేశారు.

    * మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌..
    1955లో హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం ద్వారా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ మున్సిపాలిటీలను కలిపేసి ‘మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌(ఎంసీహెచ్‌)’గా మార్చారు. 1956లో హైదరాబాద్‌ను ఆనాటి ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా చేశారు. ఆ తర్వాత కొన్నిసార్లు ప్రజాప్రతినిధులను ఎన్నుకొని, కొన్నిసార్లు ప్రత్యేక అధికారుల ద్వారా పాలన సాగిస్తూ వచ్చారు. అత్యధికంగా కాంగ్రెస్‌ నాయకులే మేయర్లుగా ఉన్నారు. ఎంసీహెచ్‌లో నాలుగు జోన్లు, 7 సర్కిళ్లు ఉండేవి.

    *జీహెచ్‌ఎంసీగా అప్‌గ్రేడ్‌ అయింది ఇలా..
    హైదరాబాద్‌ చుట్టుపక్కల.. రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల పరిధిలో ఉన్న 12 మున్సిపాలిటీలు (ఎల్బీనగర్‌, గడ్డి అన్నారం, ఉప్పల్‌, మల్కాజ్‌గిరి, కాప్రా, అల్వాల్‌, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, రామచంద్రాపురం, పటాన్‌చెరు), 8 పంచాయతీలు (శంషాబాద్‌, సాతమరాయ్‌, జల్లాపల్లి, మామిడిపల్లి, మంఖల్‌, అల్మాస్‌గూడ, శారదానగర్‌, రావిలాల) కలుపుకొని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ కాస్త గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)గా రూపాంతరం చెందింది. 2005లోనే గ్రేటర్‌ హైదరాబాద్‌ కోసం అప్పటి ప్రభుత్వం జీవో ఇవ్వగా.. కొన్ని న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. వాటిని ఎదుర్కొని 2007 ఏప్రిల్‌ 16న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆవిర్భవించింది. 175చ.కి.మీ విస్తీర్ణంలో 45 లక్షల జనాభా ఉన్న ఎంసీహెచ్‌.. గ్రేటర్‌ హైదరాబాద్‌గా మారడంతో విస్తీర్ణం 650 చ.కి.మీకు పెరిగింది. జనాభా 2007 నాటికి 67 లక్షలు ఉండగా.. ప్రస్తుతం కోటి దాటింది.

    *ఆరు జోన్లు.. 30 సర్కిళ్లు.. 150 వార్డులు
    జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆరు జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులు ఉన్నాయి. మేయర్లుగా 2002–-07లో తీగల కృష్ణారెడ్డి, 2009–-12లో బండ కార్తీకరెడ్డి, 2012-–16లో మహ్మద్‌ మాజిద్‌ హుస్సేన్‌ ఉన్నారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించింది. దీంతో ఆ పార్టీకి చెందిన చర్లపల్లి కార్పొరేటర్‌ బొంతు రామ్మోహన్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు.

    Also Read: టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన పోసాని.. చుక్కలు చూపిస్తున్న నెటిజన్లు..!

    *ఎన్నో సవాళ్లు.. మరెందరికో ఆశ్రయం
    ఈ మహానగరం రోజురోజుకూ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడు దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. క్రమక్రమంగా విశ్వనగరంగా రూపాంతరం చెందుతోంది. ఎందరికో ఉపాధినిస్తోంది. మరెందరికో అండగా నిలుస్తోంది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్‌.. తొలినాళ్లలో ఎన్నో సవాళ్లను సైతం ఎదుర్కొంది. అనేక కష్టాలను తట్టుకొని నిలబడింది. నాటి కూలీకుతుబ్‌ షా.. ‘మహా సముద్రాన్ని మత్స్య సంపదతో నింపినట్లుగా నా నగరాన్ని మనుషులతో నింపు’ అని ప్రార్థించారట. ఆయన మాట్లాడిన విశేషమో.. మరేంటో కానీ హైదరాబాద్‌ ఇప్పుడు జనసమూహమైంది. ఎంత వేగంగా జనం పెరుగుతోందో.. సిటీ కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ మహానగరం ఇప్పుడు ఎటుచూసినా 50 నుంచి 60 కిలోమీటర్ల మేర విస్తరించింది.

    *ప్లేగు.. ఆపై మూసీ ప్రళయం
    హైదరాబాద్‌ పేరు చెప్పగానే ముందు గుర్తొచ్చేది చార్మినారే. కుతుబ్‌షా వంశంలో ఐదో పాలకుడు, హైదరాబాద్‌ నగర స్థాపనకు మూలపురుషుడైన మహ్మద్‌ కూలీకుతుబ్‌షా క్రీ.శ.1591–92లో చార్మినార్‌‌ను నిర్మించారు. అప్పట్లో నగరంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. వందలాది మంది ప్రజలు చనిపోయారు. క్రమంగా ఆ మహమ్మారిని తరిమికొట్టి.. ఆ విజయానికి గుర్తుగా చార్మినార్‌‌ కట్టారు. దాని తర్వాత 1800 బిట్రీష్‌ గవర్నర్‌‌ జనరల్‌ వెల్లస్లీతో నిజాం పాలకులు సైన్యసహకార పద్ధతి ఒప్పందం కుదుర్చుకున్నాక ఒకట్రెండు అల్లర్లు, అంటువ్యాధులు మినహా పెద్ద ఆటుపోట్లేమీ రాలేదు. 1908 సెప్టెంబర్‌‌లో ఓ రోజు రాత్రి మూసీకి వరద పోటెత్తింది. అంతకుముందు రెండు రోజులపాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో ఎగువన ఉన్న చిన్నాపెద్దా చెరువు కట్టలన్నీ తెగిపోయాయి. రాజధాని చుట్టూ ఉన్న సుమారు 800 చెరువుల్లో 221 చెరువులకు గండ్లు పడ్డాయి. ఆ నీరంతా మూసీలో వచ్చిచేరింది. ప్రజలంతా ఆదమరిచి నిద్రిస్తున్న వేళ మూసీ ప్రళయం సృష్టించింది. ఈ విధ్వంసానికి సుమారు 15 వేల మంది మృత్యువాతపడ్డారు. 50 వేల మంది వరకు నిరాశ్రయులయ్యారు. సుమారు 25 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి.

    *మినీ ఇండియా..
    ఆ తర్వాత నగరంలో క్రమంగా అభివృద్ధి ప్రారంభమైంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సందర్భంలోనే అప్పటి ప్రభుత్వాలు ప్రధానంగా హైదరాబాద్‌పైనే దృష్టి పెట్టాయి. దీంతో అనేక సంస్థలు నగరానికి వచ్చాయి. పారిశ్రామికంగానూ అభివృద్ధి సాధించింది. దీంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలూ ఉద్యోగ, ఉపాధి కోసం భాగ్యనగరం బాటపట్టారు. శివారు ప్రాంతాల్లో ఫార్మా సహా వందలాది సంస్థలు వెలిశాయి. ఉన్నత విద్యకోసం దేశవిదేశాల నుంచి వస్తున్నారు. ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందడంతో సాంకేతికంగానూ నగరం కీర్తి గడించింది. ప్రపంచస్థాయికి ఎదిగింది.

    *ముగిసిన నామినేషన్ల పర్వం
    గ్రేటర్‌‌ హైదరాబాద్‌కు 2020 ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ విడుదల కాగా.. శుక్రవారంతో నామినేషన్ల పర్వం ముగిసింది. 150 డివిజన్లకు గాను మొత్తం 1932 మంది 2602 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం ఒక్కరోజే 1412 మంది 1937 నామినేషన్లు వేశారు. వీరిలో బీజేపీ నుంచి 571 మంది, సీపీఐ నుంచి 21, సీపీఎం నుంచి 22 మంది, కాంగ్రెస్‌ నుంచి 372 మంది, ఎంఐఎం నుంచి 78 మంది, టీఆర్‌‌ఎస్‌ నుంచి 577 మంది, టీడీపీ నుంచి 206 మంది, రికగ్నైజ్‌, రిజిష్టర్డ్ పొలిటికల్‌ పార్టీల నుంచి 115 మంది, ఇండిపెండెంట్స్‌ 650 మంది నామినేషన్లు అందజేశారు. నేడు ఎంత మంది పోటీలో ఉండబోతున్నారో తేలనుంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    *ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు..
    ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రసవత్తరంగా నడుస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ వర్సెస్‌ టీఆర్‌‌ఎస్‌ అన్నట్లుగా నడుస్తున్నాయి. ఇటీవల దుబ్బాక ఎన్నికలో గెలుపుతో మంచి ఊపులో ఉంది బీజేపీ. ఎలాగైనా గ్రేటర్‌‌పై కాషాయం జెండా ఎగురవేయాలని ఉవ్విల్లూరుతోంది. మరోవైపు బీజేపీకి జనసేన తోడైంది. ఇదిలా ఉంటే.. గత ఎన్నికల్లో గ్రేటర్‌‌లో 99 సీట్లు గెలుచుకున్న టీఆర్‌‌ఎస్‌ ఈసారి సెంచరీ దాటాలని పిలుపునిస్తోంది. దుబ్బాక ఓటమిని పట్టించుకోవాల్సిన పనిలేదని కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పటికే ఆ పార్టీని వీడి చాలామంది నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. జీహెచ్‌ఎంసీలో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ క్యాడర్‌‌ను కాపాడుకోలేకపోతోంది. మరోపార్టీ ఎంఐఎం.. తన స్థానాలను తాను కాపాడుకుంటే సరిపోతుందనే భావనలో ఉంది.

    *ఇబ్బంది పెడుతున్న ఇండిపెండెంట్లు..
    ఏ ఎన్నికల్లో చూసినా ‘పానకంలో పుడక లాగా..’ ఈ ఇండిపెండెంట్లు మధ్యలో ప్రధాన పార్టీలకు తలనొప్పిలా మారుతున్నారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు అందరు కలిసి 2 లక్షల ఓట్లు రాబట్టుకోగలిగారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు పలువురు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అంతెందుకు మొన్నటి దుబ్బాక ఉప ఎన్నికలో కూడా ఓ ఇండిపెండెంట్‌ అభ్యర్థి మూలంగానే అధికార పార్టీ ఓటమి పాలైందని స్పష్టమైంది. ఈసారి కూడా జీహెచ్‌ఎంసీలో 650 మంది వరకు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. అందుకే.. ఈసారి కూడా వీరి ప్రభావం ఏ మేరకు ఉండబోతోందోనని పార్టీలు భయపడుతున్నాయి.

    -శ్రీనివాస్.బి