కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు కూడా రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వాల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వాటన్నింటిని సమీక్షించి పరీక్షల రద్దు చేయాలని భావించారు. పరీక్షల కంటే విద్యార్థుల ఆరోగ్యం, భద్రత ముఖ్యమని ప్రధాని మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు. పరీక్షలు రాయాలనుకునే వారికి కరోనా ఉధృతి తగ్గాక గత ఏడాదిలాగే నిర్వహించనున్నారు.
నిజానికి పరీక్షల నిర్వహణకే మెజారిటీ రాష్ర్టాలు మొగ్గు చూపాయి. మహారాష్ర్ట సర్కారు రద్దు చేయాలనగా వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత పెట్టాలని కేరళ, ఢిల్లీ ముఖ్యమంత్రులు కోరారు. అందరి అభిప్రాయాలు తెలుసుకుని మోదీ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించారు. పదో తరగతి పరీక్షలను సీబీఎస్ఈ కూడా ఎప్పుడో రద్దు చేసింది. ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా జీపీఏలు ప్రకటించనున్నారు.
ఏపీ సర్కారు మాత్రం ఇంతవరకు టెన్త్ పరీక్షలు కూడా రద్దు చేయలేదు. ఆరు నూరైనా టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పింది. మరోవైపు జూన్ చివరి వరకూ సెలవులు ఇచ్చింది. జూలైలోనే పరీక్సలు నిర్వహించి ఫలితాలు ప్రకటించేసరికి జులై పూర్తవుతుంది. పదో తరగతి పరీక్షలపై ఇతర రాష్ర్టాలు కేంద్రం కూడా తేల్చేశాయి. పరీక్షలు రద్దు చేసి ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా జీపీఏలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ఆన్ లైన్ క్లాసులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ మొదటి వారంలో తెలంగాణ ఇంటర్ అకడమిక్ ఇయర్ ప్రారంభం కాబోతోంది. వచ్చే విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు.
పరీక్షలు రాయకపోతే విద్యార్థుల భవిష్యత్ కోసం పరీక్షలంటూ ఏపీ సర్కారు వాదనలు వినిపిస్తోంది. టెన్త్ పరీక్షలు రద్దు చేయాలని విద్యారంగ నిపుణులు సూచనలు చేస్తున్నారు. పిల్లలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. టెన్త్ పరీక్షలు పెట్టకపోయినా విద్యార్థులకు భవిష్యత్ లో పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇంటర్ సెకండియర్ పరీక్షలు ముఖ్యమని , కాస్త ఆలస్యమైనా పెట్టాలనే సూచనలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ కూడా విద్యార్థుల ఆరోగ్యమే ముఖ్యమని భావిస్తున్నారు.