
ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. యావత్ తెలంగాణ ప్రజలు ఒక్కతాటిపైకి వచ్చి, ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసుకున్న రోజు. ఈ ప్రత్యేక సందర్భాన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రం సాధిస్తున్న పురోగతిని వివరించారు. ఇప్పటి వరకు ఎంతో, ఇంకా సాధించాల్సింది ఉందని చెప్పారు.
బలిదానాలు, త్యాగాలు, పోరాటాలతో ప్రజాస్వామ్యయుత పద్ధతిలోనే రాష్ట్రాన్ని సాధించుకున్నామని ముఖ్యమంత్రి అన్నారు. కేవలం ఏడేళ్లలోనే ఎంతో ప్రగతి సాధించామని, అనతి కాలంలోనే బలమైన పునాది వేసుకున్నామని, ఇందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు కేసీఆర్.
ఉద్యమ సమయంలో ఎంచుకున్న నినాదాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. సాగు, తాగునీరు, విద్యుత్, విద్యవైద్యం వంటి ప్రధాన అంశాల్లో దశలవారీగా అభివృద్ధి సాధిస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం స్వల్ప కాలిక, దీర్ఘ కాలిక లక్ష్యాలను పెట్టుకొని, వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు ముఖ్యమంత్రి.
చాలా విషయాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. భారతదేశానికే మన రాష్ట్రం అన్నపూర్ణగా నిలిచిందని, ఇందుకోసం చేసిన కృషి అమోఘమని అన్నారు. ఇందులో ప్రజల పాత్ర ఎంతో ఉందని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో నిరాధరణకు గురైన రంగాలను ఎంతో ఓపికతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు.
ఇక, మిగిలింది బంగారు తెలంగాణ సాధనే అని చెప్పారు. ప్రజల సహకారం తనకు ఎంతో ఉత్సాహం అందిస్తోందని చెప్పిన ముఖ్యమంత్రి.. వారి అభిమానమే తనకు కొండంత ధైర్యమని చెప్పారు. వారు ఇచ్చిన భరోసాతోనే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చి దిద్దుతానని చెప్పారు. అప్పటి వరకు తాను విశ్రమించేది లేదని శపథం చేశారు.