Rameswaram Cafe: బెంగళూరు రామేశ్వరం కేఫ్ తెరుచుకుంది. 8 రోజుల క్రితం ఈ కేఫ్ లో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.. ఆ పేలుడు తీవ్రతకు పదిమంది గాయపడ్డారు.. ఆ పేలుడు ఘటనతో కర్ణాటక రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పేలుడు జరిగిన నాటి నుంచి శుక్రవారం వరకు ఆ కేఫ్ మూసే ఉంది. పేలుడు జరిగిన అనంతరం రాష్ట్ర దర్యాప్తు బృందాలు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బృందాలు ఆ కేఫ్ ను తమ ఆధీనంలో ఉంచుకున్నాయి. ఆ కేఫ్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్ ని తమ వద్ద ఉంచుకున్నాయి. పేలుడుకు సంబంధించి ఉపయోగించిన పదార్థాలను, ఇతర వస్తువులను దర్యాప్తు బృందాలు సేకరించాయి.. ఆ బృందాల పని పూర్తికాగానే కేఫ్ నకు దాని యాజమాన్యం మరమ్మతులు చేయడం ప్రారంభించింది. అవి పూర్తి కావడంతో శనివారం ఉదయం కేఫ్ ను తెరిచారు. పేలుడు జరిగిన విషయాన్ని ఇంకా బెంగళూరు నగరవాసులు మర్చిపోనట్టున్నారు.. అందుకే అంతగా జనం రాలేదు.. వాస్తవానికి రామేశ్వరం కేఫ్ రద్దీగా ఉంటుంది. ఇసుక వేస్తే రాలనంత జనంతో సందడిగా ఉంటుంది. కానీ శనివారం ఉదయం అందుకు భిన్నమైన పరిస్థితి అక్కడ కనిపించింది.
రెండు రోజుల్లో మరమ్మతులు
పేలుడు జరిగిన నాటి నుంచి బుధవారం వరకు జాతీయ, రాష్ట్ర దర్యాప్తు బృందాలు కేఫ్ ను తమ ఆధీనంలో ఉంచుకున్నాయి. అక్కడ పలు రకాల ఆధారాలు సేకరించాయి. పలువురిని ప్రశ్నించాయి. బాంబు ముందుగా పెట్టిన ప్రదేశం, అక్కడ సిబ్బంది ప్రమేయం ఏమైనా ఉందా? ఇలాంటి కోణాల్లో దర్యాప్తు బృందాల విచారణ కొనసాగించింది.. ఆ విచారణలో ఎటువంటి వివరాలు సేకరించారు? అదుపులో తీసుకున్న వ్యక్తులను విచారిస్తే ఏం చెప్పారు? అనే విషయాలను దర్యాప్తు బృందాలు బయటికి వెల్లడించడం లేదు. పైగా ఇప్పటికీ ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత నిర్వహిస్తున్నారు. ఈ బాంబు పేలుడుకు సంబంధించి ఏమైనా ఉగ్ర కోణం ఉందా? అనే దిశగా దర్యాప్తు సాగిస్తున్నారు. కాగా, బుధవారం వరకు దర్యాప్తు బృందాల ఆధీనంలోనే కేఫ్ ఉన్నది. ఆరోజు రాత్రి యాజమాన్యానికి అప్పగించడంతో.. వారు కేవలం రెండు రోజుల్లోనే మరమ్మతులు పూర్తి చేశారు. పేలుడు ధాటికి కేఫ్ ముందు భాగం కొంతమేర ధ్వంసం అయింది. దానిని ఆ కేఫ్ సిబ్బంది రెండు రోజులపాటు రాత్రింబవళ్లు పనిచేసి మరమ్మతులు పూర్తి చేశారు. కేఫ్ ను శనివారం తెరిచే ముందు జాతీయ గీతాలపన చేశారు. బాంబు పేలుడు జరిగిన నేపథ్యంలో కేసు ముందు మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేశారు. కేఫ్ లోకి వచ్చే వినియోగదారులను పరీక్షించేందుకు సెక్యూరిటీ సిబ్బందికి హ్యాండ్ బెల్ట్ డిటెక్టర్లు అందజేశారు. కేఫ్ పరిసర ప్రాంతాల్లో మరిన్ని సీసీటీవీలు ఏర్పాటు చేశారు
కీలక నిందితుడి కోసం..
ఈ బాంబు పేలుడుకు సంబంధించి సి సి ఫుటేజ్ లో ఓ వ్యక్తి అత్యంత అనుమానాస్పదంగా కనిపించాడు. అతడు నేరుగా కేఫ్ లోకి వచ్చి.. ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాడు. కేఫ్ నిర్వాహకులు ఇడ్లీ తెచ్చేంతలోపే అక్కడ బాంబు పెట్టాడు. ఇడ్లీ తిని కొంత దూరం వెళ్లిన తర్వాత రిమోట్ సహాయంతో బాంబు పేల్చాడు. ఆ ఘటనలో పదిమంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అతని కోసం దర్యాప్తు బృందాలు తీవ్రంగా గాలింపు చేపడుతున్నాయి. ఇప్పటికే అతడిని పట్టిస్తే పది లక్షల రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించాయి. అతడి ఫోటోను కూడా సామాజిక మాధ్యమాలలో ప్రసారం చేశాయి. ఆ నిందితుడి గురించి సమాచారం తెలిస్తే NIA (National investigation agency) ఈ మెయిల్ info.blr.nia@gov.in- లేదా 080-29510900, 8904241100 నంబర్లకు సమాచారం ఇవ్వచ్చు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతారు. అదే సమయంలో 10 లక్షల నగదు బహుమతి కూడా ఇస్తారు.