Madhopatti Village: బీహార్లో ఆనంద్ కుమార్ గురించి తెలుసా?.. పోనీ అతడి సూపర్ 30 ఇనిస్టిట్యూట్ గురించి ఎప్పుడైనా చదివారా? పేద పిల్లలకు ఐఐటీలో శిక్షణ ఇచ్చే ఆ లెక్కల మాస్టారూ.. ప్రతి సంవత్సరం తన సంస్థ నుంచి 30 మందిని ఐఐటీలకు పంపిస్తాడు. అతడి నేపథ్యం ఆధారంగా సూపర్ 30 పేరుతో ఒక సినిమా వచ్చింది. హృతిక్ రోషన్ అందులో హీరో. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఎక్కడో మారుమూల బీహార్ లో అది కూడా పాట్నా లాంటి ప్రాంతంలో అలాంటి ఒక ఇనిస్టిట్యూట్ పెట్టి పేద విద్యార్థుల ఐఐటి సాకారం చేయడం అంటే మామూలు విషయం కాదు. అందుకే పాట్నాను ఐఐటీ ఫ్యాక్టరీ అంటారు. పాట్నా అంటే బీహార్ రాజధాని కాబట్టి కొద్దో, గొప్పో సౌకర్యాలు ఉంటాయి. కానీ ఎలాంటి సౌకర్యాలు లేని గ్రామం దేశానికి ఐఏఎస్ అధికారులను అందిస్తోంది. అలా అది ఐఏఎస్ ఫ్యాక్టరీగా రూపాంతరం చెందింది. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుంది? దానికి ఆ పేరు ఎలా వచ్చింది? కథనంలో తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. జైన్పూర్ జిల్లా.. మాదోపట్టి గ్రామం.. ఈ గ్రామంలో 75 ఇళ్ళు ఉంటాయి. కానీ 51 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది మాటికి నిజం. ఆ ఊరిలో ప్రతి ఇంట్లో ఐఏఎస్, ఐపీఎస్ ఉంటారు. అందుకే ఆ వూరు సర్వత్ర చర్చనీయాంశం. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు ఉంటుంది. దేశానికి అత్యధికంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అందించిన గ్రామంగా చరిత్ర పుటల్లో నిలిచింది.
ఈ గ్రామంలో సౌకర్యాలు అంతంత మాత్రమే ఉన్నప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లల చదువు విషయంలో శ్రద్ధ వహిస్తుంటారు. ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివిస్తుంటారు. పై చదువులకు మాత్రం ఇతర ప్రాంతాలకు పంపిస్తుంటారు. గతంలో ఈ ఊరు నుంచి ఒక వ్యక్తి ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. అతడిని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది అలా ఐఏఎస్, ఐపీఎస్ లు అయ్యారని చెబుతుంటారు. ఈ ఊర్లో ప్రధానంగా ఆవ పంట పండుతుంది. ఆ ఆవతోటల్లో కూర్చుని చదువుకోవడం ఇక్కడి విద్యార్థులకు భలే సరదా. చాలామంది సివిల్ సర్వీసెస్ కు వెళ్లడంతో.. ఈ గ్రామం పేరు జాతీయస్థాయిలో మార్మోగిపోతుంది. సివిల్ సర్వీసెస్ లో ఉన్న ఈ ప్రాంత వాసులు గ్రామ అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో సకల సౌకర్యాలు కల్పించారు. భావి భారత పౌరులు చదువుకునేందుకు విరివిగా పుస్తకాలు ఏర్పాటు చేశారు.
పండుగలు, ఇతర వేడుకల సమయంలో ఈ గ్రామం సందడిగా మారుతుంది. వేరువేరు ప్రాంతాల్లో స్థిరపడిన సివిల్ సర్వీసెస్ అధికారులు ఈ గ్రామానికి వస్తుంటారు. అప్పుడు ఈ గ్రామంలో ఎరుపు రంగు బుగ్గ ఉన్న కార్లు సైరన్ చేస్తూ సందడి చేస్తుంటాయి. ఎంతోమంది సివిల్ సర్వీసెస్ అధికారులను దేశానికి అందించిన ఈ గ్రామం.. నేటికీ మారుమూల గ్రామం గానే ఉండటం విశేషం.