Kishore Chandra Dev: మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ టిడిపికి రాజీనామా చేశారు. గత ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరారు. అరకు ఎంపీగా పోటీ చేశారు. కానీ వైసీపీ అభ్యర్థి బొడ్డేటి మాధవి చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికల అనంతరం రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగినా.. ఆ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన కిషోర్ చంద్రదేవ్.. కేంద్ర మంత్రిగా కూడా సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా పోయింది. దీంతో గత ఎన్నికల్లో టిడిపిలో చేరి ఎంపీ అవుదామని భావించారు. కానీ వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అవుతున్న వేళ కిషోర్ టిడిపిని వీడడం ప్రాధాన్యత సంతరించుకుంది. టిడిపి ఎన్ డి ఏ కు దగ్గర కావడం వల్లే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కిషోర్ చంద్రదేవ్ ప్రకటించారు.
కిషోర్ చంద్ర దేవ్ సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. ఐదు సార్లు లోక్ సభకు, ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు ఎదురుగాలి వీచినా.. కిషోర్ చంద్ర దేవ్ పార్వతీపురం నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎంపీగా విజయం సాధించారు. 1979లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 1980, 1984, 2004 ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేసి గెలిచారు. 1994 నుంచి 2000 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009 ఎన్నికల్లో అరకు స్థానం నుంచి ఐదోసారి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఇందిరాగాంధీ క్యాబినెట్ లో ఉక్కు గనుల శాఖ మంత్రిగా, యూపీఏ 2 లో కేంద్ర గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
కిషోర్ చంద్రదేవ్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ సిద్ధాంతాలకు కిషోర్ దగ్గరగా ఉంటారు. గత ఎన్నికల్లో ప్రత్యామ్నాయం లేకపోవడంతో టిడిపిలో చేరేందుకు మొగ్గు చూపారు. కానీ షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అవుతుండడం.. జాతీయ స్థాయిలో సైతం కాంగ్రెస్ పార్టీ విస్తరణకు ప్రయత్నాలు జరుగుతుండడంతో.. ఆ పార్టీలోనే చేరడం శ్రేయస్కరమని కిషోర్ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం అరుదు. అటు టిడిపి నాయకత్వం కూడా కిషోర్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు. పొత్తులో భాగంగా అరకు పార్లమెంట్ స్థానాన్ని బిజెపికి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే అరకు నుంచి తాను పోటీ చేయడానికి కుదరదని కిషోర్ భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరి అరకు ఎంపీగా మరోసారి పోటీ చేయాలని చూస్తున్నారు.