Rebel MLAs: ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అటకెక్కినట్టేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరో నెల రోజుల్లో ఎన్నికలు రానున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్య బట్టి ఆ మూడు స్థానాలు వైసీపీకి దక్కే ఛాన్స్ ఉంది. అయినా సరే టిడిపి పోటీలో ఉంటుందని ప్రచారం జరిగింది. దీంతో వైసిపి జాగ్రత్త పడింది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని ఆమోదించారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ విప్ చేసిన ఫిర్యాదు పై ధిక్కారణ నోటీసులు జారీ చేశారు. అటు టిడిపి రెబల్ ఎమ్మెల్యేలకు సైతం నోటీసులు ఇచ్చారు. రాజ్యసభ ఎన్నికల వేళ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తెరపైకి రావడం విశేషం.కానీ ఇప్పుడు రాజ్యసభ స్థానాలు వైసీపీకి ఏకగ్రీవం కావడంతో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తెరమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ మోహన్, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి ఫిరాయించారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో విభేదించి అధికార పార్టీ సానుభూతిపరులుగా మారారు. ఈ తరుణంలో వారిపై అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ కోరినా ఫలితం లేకపోయింది. అప్పటినుంచి ఆ నలుగురు వైసీపీలోనే కొనసాగుతూ వస్తున్నారు.
మరోవైపు వైసిపికి నలుగురు ఎంపీలు రెబెల్ గా మారారు. గత ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. వైసిపి హై కమాండ్ ఆదేశాలకు విరుద్ధంగా.. టిడిపి అభ్యర్థికి ఓటు వేశారని కారణం చూపుతూ.. నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి లను పార్టీ నుంచి వేటు వేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని కూడా వైసీపీ నేతలు కోరారు. అయితే సరిగ్గా రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనగా ఎమ్మెల్యేలపై అనర్హత వే టు అంశం తెరపైకి వచ్చింది. అయితే తన ఎదుట హాజరు కావాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ఇరు పార్టీల రెబల్స్ కు నోటీసులు అందించారు. అయితే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. అటు టిడిపి రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం హాజరయ్యారు. ఈ తరుణంలో వైసిపి రెబల్ ఎమ్మెల్యేల పైన మాత్రమే వేటు వేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలకు టిడిపి దూరమైంది. తాము పోటీ చేయమని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. దీంతో ఈ అనర్హత వేటు అంశం పక్కకు వెళ్లినట్లేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ టిడిపి బరిలో ఉంటే మాత్రం కచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యేలపై వేటుపడి ఉండేదని తెలుస్తోంది.