ఒకరినో ఇద్దరినో బెదిరించొచ్చు. కానీ 5 కోట్ల మంది ఆంధ్రుల్లో మున్సిపాలిటీల్లోని కోట్ల మందిని ఎలా బెదిరిస్తారు? అసలు ఈ బెదిరింపులకు ఈ కాలంలో ఎవరైనా భయపడుతారా? తిరగబడుతారు? లేదంటే ఓటుతో బుద్దిచెబుతారు. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజా తీర్పును అవహేళన చేసేలా మాట్లాడేశారు.
నిజానికి అధికారంలో ఉన్న పార్టీనే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించడం ఆనవాయితీగా వస్తుంది. అభివృద్ధి కోణంలో ప్రజలు అలా అధికారపార్టీకి ఓటేస్తారు. అయితే ఆ గెలుపును కూడా పవన్ అపహాస్యం చేసేశారు. వైసీపీది అసలు గెలుపే కాదన్నారు.
ఏపీ మున్సిపల్ ఎన్నికలపై పవన్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. జనసేన పార్టీతోపాటు ప్రతిపక్షం టీడీపీ కూడా ఈ ఎన్నికల్లో తేలిపోయింది. వైసీపీ ప్రభంజనం కొనసాగింది.
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ బెదిరింపులతోనే ఎక్కువ స్థానాల్లో గెలిచిందని పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజల కడుపు మీద కొట్టి తిండి లాక్కొంటామని బెదిరించడం వల్లే వైసీపీ గెలిచిందని పవన్ మండిపడ్డారు. ఓటేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరించారని పవన్ ఆరోపించడం విశేషం. రేషన్ కార్డులు, పింఛన్లు, విద్యాపథకాలు ఆపేస్తామని అధికార పార్టీ నేతలు బెదిరించినట్లు పవన్ ఆరోపిస్తున్నాడు. వైసీపీ ప్రజలకు భరోసా ఇచ్చి ఓట్లు సాధించలేదని పవన్ విమర్శించారు.
ఇలా పవన్ ప్రజాతీర్పుపై స్పందించారు. వైసీపీ బెదిరించి గెలిచిందని అక్కసు వెళ్లగక్కాడు. ఇంత పెద్ద గెలుపు కోసం వైసీపీ ఎంత మందిని బెదిరించిందని పలువురు విశ్లేషకులు సైతం పవన్ ను ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది.