Parabhava Nama Samvatsara Panchangam: ఉగాది పండుగతో కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. కొత్త ఏడాది ప్రకారం కొత్త పంచాంగం తయారై అందుబాటులోకి వస్తుంది. ఈ నేపథ్యంలో శుభకార్యాలు, కొత్త పనులు ప్రారంభించాలని అనుకునేవారు శుభముహూర్తాల గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. ముఖ్యంగా వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, వాహన కొనుగోలు, వ్యాపార ప్రారంభాలు వంటి కార్యక్రమాల కోసం అనుకూలమైన తేదీలు ఎప్పుడు ఉన్నాయని తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు . కొంతమంది పండితులు విడుదల చేసిన కొత్త పంచాంగం ప్రకారం ఈ ఏడాది కొన్ని నెలల్లో విస్తృతంగా ముహూర్తాలు ఉన్నాయి. మరికొన్ని కాలాల్లో పూర్తిగా ముహూర్త విరామం ఉండనుంది.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీమియర్ షోస్ రివ్యూ…మామూలు రచ్చ కాదుగా..?
కొత్త పంచాంగం ప్రకారం చైత్ర మాసంలో మార్చి 27, 28 తేదీల్లో శుభకార్యాలకు అనుకూలమైన ముహూర్తాలు ఉన్నాయి. ఉగాది తరువాత వెంటనే శుభారంభాలు చేయాలనుకునే వారికి ఇవి తొలి అవకాశాలుగా భావిస్తున్నారు. వైశాఖ మాసంలో ఏప్రిల్ 26, 29, మే 1, 3, 6 నుంచి 11 వరకు కొత్త పనులను ప్రారంభించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ కాలాన్ని ఈ ఏడాదిలో అత్యంత అనుకూలమైన ముహూర్తాల దశగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా వివాహాల కోసం ఈ తేదీలకు అధిక డిమాండ్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 17 నుంచి జులై 9 వరకు కూడా ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ కాలం తరువాత గురు మౌఢ్యమి ప్రారంభమవుతుండటంతో జులై 15 నుంచి ఆగస్టు 15 వరకు శుభకార్యాలకు విరామం ఉంటుంది. గురుగ్రహం అస్తమించే ఈ సమయంలో పెళ్లిళ్లు, ప్రధాన శుభకార్యాలు నిర్వహించరాదని శాస్త్రోక్తంగా భావిస్తారు.
శ్రావణ మాసంలో ఆగస్టు 15, 16, 20, 22 తేదీలు మళ్లీ శుభముహూర్తాలతో అందుబాటులోకి వస్తాయి. గురు మౌఢ్యమి ముగిసిన వెంటనే ఈ తేదీలపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. కార్తీక మాసంలో నవంబర్ 12 నుంచి 22 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీపావళి తర్వాత కుటుంబాలు గృహప్రవేశాలు, వివాహాలు నిర్వహించేందుకు ఈ కాలాన్ని ప్రాధాన్యంగా ఎంచుకునే అవకాశం ఉంది.
అయితే అక్టోబర్ 19 నుంచి 29 వరకు శుక్ర మౌఢ్యమి ఉండటంతో ఆ రోజుల్లో ముహూర్తాలు ఉండవు. శుక్రగ్రహం శుభకార్యాలకు ముఖ్యమైనదిగా భావించబడటంతో ఈ సమయంలో వివాహాలు నిర్వహించరాదని పండితులు సూచిస్తున్నారు. 2027లోకి వెళ్లే మాఘ మాసంలో ఫిబ్రవరి 7 నుంచి 27 వరకు, అలాగే ఫాల్గుణ మాసంలో మార్చి 10 నుంచి ఏప్రిల్ 2 వరకు శుభముహూర్తాలు లభిస్తాయి. ఈ కాలం కూడా వివాహాల కోసం అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు.
